అవును నిజమే ఇది. విశాఖ ఇపుడు జనాలను రమ్మని పిలుస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని సాదరంగా స్వాగతం పలుకుతోంది. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా విశాఖ జిల్లాలో టూరిజం స్పాట్స్ వెలవెలబోయాయి.
ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది నుంచి కూడా పర్యాటక రంగం బోసిపోయింది. అయితే రెండవ విడత కరోనా తగ్గుముఖం పడుతూండడంతో అన్ని నిబంధనలు సడలించారు. ఈ నేపధ్యంలో విశాఖ బీచ్తో పాటు కైలాసరిగి రుషికొండ, భీమిలీ వంటి స్పాట్స్ జనంలో కిటకిటలాడాయి.
చాలా కాలం తరువాత ఉవ్వెత్తున సాగే సాగర కెరటాలను చూస్తూ జనాలు ఉప్పొంగిపోయారు. ఇక విశాఖ జిల్లా మన్యంలో కూడా పాడేరు జలపాతాల వద్ద కూడా పర్యాటకుల తాకిడి కనిపిస్తోంది.
అలాగే అరకు అందాలను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ టూరిజం మళ్ళీ కొత్త శోభను సంతరించుకుంటోంది.
మరో వైపు విశాఖకు వచ్చే టూరిస్టులు కూడా పెరుగుతున్నారు. ఈ సీజన్ ఇలాగే కొనసాగితే పర్యాటక రంగానికి ఊతమందించినట్లే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.