కానుకతో సరిపెడతారా..? క్లాసులు కూడా ఉంటాయా?

పదో తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ సర్కారు ఆలోచనలు ఫలించలేదు. విద్యార్థుల భవిష్యత్ కి నష్టం కలగకుండా, కరోనా బ్యాచ్ అనే ముద్ర పడకుండా.. వారికి పరీక్షలు పెట్టి, మార్కులివ్వాలన్న సీఎం జగన్…

పదో తరగతి, ఇంటర్ పరీక్షల విషయంలో ఏపీ సర్కారు ఆలోచనలు ఫలించలేదు. విద్యార్థుల భవిష్యత్ కి నష్టం కలగకుండా, కరోనా బ్యాచ్ అనే ముద్ర పడకుండా.. వారికి పరీక్షలు పెట్టి, మార్కులివ్వాలన్న సీఎం జగన్ ప్రణాళిక వర్కవుట్ కాలేదు. ఇప్పుడు స్కూల్స్ తెరిచేందుకు కూడా ఏపీ విద్యాశాఖ అదే ఉత్సాహంతో ఉంది. 

స్కూల్స్ విషయంలో ఏపీ కంటే ముందే తేదీలు ప్రకటించిన తెలంగాణ కూడా ఇంత వరకు డైరెక్ట్ క్లాస్ లపై నిర్ణయం తీసుకోలేదు. ఏపీ మాత్రం ఆగస్ట్ 16 నుంచి పిల్లల్ని బడికి పంపించాలంటోంది. మరి ఈసారైనా ప్రభుత్వ ఆలోచన అమలులోకి వస్తుందా? అనుకున్న విధంగా అధికారులు బడులు తెరవగలరా..?

ఏపీలో ఈనెల 1 నుంచి స్కూల్ గేట్స్ తెరుచుకున్నా, అవి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే. వారు కూడా 50-50 రేషియోలో రోజుకి సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. ఈనెల 15 నుంచి పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. వర్క్ షీట్లు తయారు చేస్తున్నారు, వాటిని తల్లిదండ్రులకు ఇచ్చి విద్యార్థులకు పంపిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా కేసుల్లో పూర్తి స్థాయి తగ్గుదల కనిపిస్తోంది. ఏపీలో ఉభయగోదావరి జిల్లాలు మినహా అన్నిచోట్లా దాదాపుగా ఆంక్షలు ఎత్తేశారు. ఈ క్రమంలో ఆగస్ట్ 16 నుంచి బడిగంట మోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటిలోగా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటోంది.

కానుకతో సరిపెడతారా..? క్లాసులుంటాయా..?

ఆగస్ట్ లో విద్యార్థులందరికీ జగనన్న కానుక అందించాలని కృతనిశ్చయంతో ఉంది ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే విద్యార్థులు, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేస్తున్నారు. ఈసారి విద్యాకానుకలో స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, బెల్ట్, షూస్ తో పాటు.. డిక్షనరీ కూడా ఇవ్వబోతున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న ఈ కరోనా కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఆగస్ట్ 16 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభించగలదా లేదా అనేది మాత్రం అనుమానమే. ఇప్పటికే సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదని అంటున్నారు నిపుణులు, థర్డ్ వేవ్ పై కచ్చితమైన సమాచారం తెలియదు కానీ, అన్ లాక్ తో అన్నిచోట్లా నిబంధనలు సడలించడంతో ప్రజలు చేజేతులా మూడో ముప్పుకి స్వాగతం పలికేలా ఉన్నారు.

అదే నిజమైతే.. మరోసారి లాక్ డౌన్ అనివార్యం అవుతుంది. అప్పుడిక మళ్లీ బడులు, గుడులు, థియేటర్లు అన్నీ మూసేయాల్సిందే. కరోనా కాలంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులేనంటూ ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి.