‘దేశం’ ఓటమి కి ముందు వెనుక

గెలపు ఓటములు దైవాధీనం అంటారు. కానీ రాజకీయాల్లో దైవాధీనం తో పాటు ఓటరు ఆధీనం కూడా వుంటుంది. మన అను'కుల' పత్రికలు చదివి అవి చెప్పే విషయాలే వాస్తవమనుకుని, గ్రౌండ్ రియాల్టీని వదిలేసి, కేవలం…

గెలపు ఓటములు దైవాధీనం అంటారు. కానీ రాజకీయాల్లో దైవాధీనం తో పాటు ఓటరు ఆధీనం కూడా వుంటుంది. మన అను'కుల' పత్రికలు చదివి అవి చెప్పే విషయాలే వాస్తవమనుకుని, గ్రౌండ్ రియాల్టీని వదిలేసి, కేవలం మాటలతో కాలక్షేపం చేస్తే ఓటరు క్షమించడు. స్థానిక ఎన్నికల్లో అది దారుణమైన పరాజయం తెలుగుదేశం పార్టీకి సంప్రాప్తించడానికి కీలకమైన కారణాలు కొన్ని వున్నాయి. వాటిని ఓసారి అవలోకిద్దాం.

తెలుగుదేశం చేసిన కీలక తప్పిదం, మోడీకి భాజపాకు దగ్గర కావడానికి, వారి అనుగ్రహం పొందడానికి హిందూ కార్డ్ ను ఎక్కువగా వాడి మైనారిటీలు, క్రిస్టియన్లకు పూర్తిగా దూరం కావడం. ఒక్కసారిగా రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు వరుసపెట్టి జరిగాయి. 

అధికారంలో వున్న వ్యక్తి, తనపై అనుమానం, లేదా విమర్శ రావడానికి దారి తీసే పనులు ఎందుకు చేస్తాడు? లేదా అధికారంలో వున్నది తమ అనుకూల ప్రభుత్వం అని అనుకున్న తరువాత దానికి ఇబ్బంది తెచ్చి పెట్టే పనులు వారెందుకు చేస్తారు? ఈ లాజిక్ జనాలకు తెలియదా? ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఒక్కసారిగా దాడులు ఎందుకు ప్రారంభమయ్యాయి? ఎందుకు వున్నట్లుండి ఆగిపోయాయి అన్నది జనాలకు అర్థం కాదా?

పోనీ అర్థం అయిపోయినా కాకున్నా, తమని ఇంతలా టార్గెట్ చేస్తుంటే, ఇంతలా బద్ నామ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు అయిన ముస్లింలు, క్రిస్టియన్లు ఎందుకు మద్దతు పలుకుతారు? కీలకమైన వారి ఓటు బ్యాంకు ను సమూలంగా దూరం చేసుకోడం అన్నది తెలుగుదేశం పార్టీ చేసిన ఘోర తప్పిదం కాదా? ఈ విషయంలో తెలుగుదేశం అను'కుల' మీడియా చేసిన హడావుడి ఆ పార్టీకి ఎంత చేటు చేయాలో అంతా చేసింది అన్నది వాస్తవం కాదా?

పైగా ఇలా చేయడం ద్వారా జగన్ ఆలయాల విషయంలో మరింత జాగ్రత్త వహించడానికి దారి తీసింది. ఆలయాలకు నిధులు అందాయి. కొత్త రథాలు, మరింత సెక్యూరిటీ, కొత్త విగ్రహాలు ఇలా మరింత ఆకర్షణ వచ్చింది. దేశం అను'కుల' మీడియా చేసిన హడావుడి వల్ల హిందూ ఓట్లలో ఏమైనా నెగిటివిటీ వచ్చినా , అది పాజిటివ్ గా మారినా, మారకున్నా, కనీసం న్యూట్రల్ గా మారేలా చేసింది.

ఇక రెండో తప్పిందం ఇప్పటికీ జనసేనతో లోపాయకారీ పొత్తు వీడకపోవడం. గ్రౌండ్ లెవెల్ లో భాజపా కు అంత సీన్ లేదు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన-తదేపా కలిసే చాలా చోట్ల పని చేసాయి. ఎలాగూ భాజపా లేదు కనుక ఇదేమంత సమస్య కాలేదు. దానివల్ల బిసిలకు పార్టీ దూరం కావడం అన్నది కొనసాగుతూనే వుంది. 

బిసిలకు ఆదరణ కార్యక్రమం, వేరు వేరుగా కార్పొరేషన్లు పెడితే వాటిని విమర్శించారు తప్ప సమర్థించలేదు. అది సహజంగానే తమకు తెలుగుదేశం దూరం అనే భావనను బిసిల్లో మరింత పెంచింది. అటు కాపు ఓట్లను జనసేన చీల్చి, ఇటు బిసి ఓట్లను వైకాపా పట్టుకుపోతే, దేశానికి ఇక మిగిలింది ఏమిటి?

ఇదిలా వుంటే మరో కారణం చూద్దాం. దేశం అధికారంలో వున్నపుడు అన్ని విధలా కీలకంగా వ్యవహరించి అందినంత సంపాదించుకున్న సీనియర్ నాయకులు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ ఇప్పుడు పైసా జేబులోంచి తీయకపోవడం. దశాబ్ధాల కాలంగా సీనియర్లు ఎడాపెడా అధికారం చెలాయించారు. సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంపాదన విషయంలో రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు. 

ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పటికిప్పుడు అనవరంగా డబ్బులు ఖర్చుచేసి సాధించేది ఏమిటి? పోనీ చేద్దాం అన్నా అనవసరంగా వైకాపా ఆగ్రహానికి గురికావాలి. తమ తమ వ్యాపారాలు ఆ ఆగ్రహానికి గురి కావాలి? ఇదంతా అవసరమా? మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు చంద్రబాబు తమను కాదని ఎవరికి టికెట్ ఇవ్వరు. ఆ ధైర్యం చేయరు. అదీ సీనియర్ల ఆలోచన. ఈ సీనియర్లనునమ్ముకుని సెకండ్ లెవెల్ క్యాడర్ ను డెవలప్ చేయలేదు చంద్రబాబు. ఇంకెవరు ఫైట్ చేసేది?

జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పోరాటం దేనిమీద సాగించారు. అమరావతి మీద. కేవలం అమరావతి మీదే ఆయన, ఆయన అను'కుల' మీడియా ఎక్కువ సమయం వెచ్చించారు. ఒక్కసారి అయినా గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి పోరాటం సాగించారా?  భవన కార్మికులు రోడ్ మీద వున్నారని తరచు స్టేట్ మెంట్ లు ఇవ్వడమే. 

నిజానికి ఇవ్వాళ ఏ ఊరిలో ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఖాళీ లేడు చేతినిండా పని వుంది. పైగా వర్కర్లకు భయంకరమైన కొరత వుంది. కాదని అనగలరా? నిరూపణకు గ్రౌండ్ లెవెల్ కు రాగలరా? ఇది నిజం అన్న సంగతి తెలుసు కనుకే, తమ ధర్నాలకు, నిరసనలకు జనం రారు, వచ్చే పరిస్థితిలో లేరు అని తెలుసు కనుకే ఆ తరహా విధానానికి పార్టీ దూరంగా వుంది.

ప్రజాసమస్యలైన పెట్రోలు, గ్యాస్ ధరలు, ఇతరత్రా వ్యవహారాలను వదిలేసి ఇప్పటికీ జగన్ ను దుయ్యపడుతూనే కాలక్షేపం చేయడం. జనం అంతా మోడీని దుయ్యబడుతూ వుంటే, మోడీ తప్పులు కూడా జగన్ ఖాతాలో వేసే ప్రయత్నం చేయడం. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగేసినంత మాత్రాన జనం చూడకుండా వుండరు. మోడీ అనుగ్రహం కోసం అర్రులు చాస్తూ, మోడీని పల్లెతు మాట అనకుండా ఆయన తప్పులు కూడా వైకాపా, జగన్ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తే జనం గమనిచనంత వెర్రివాళ్లా?  

ఇవన్నీ ఇలా వుంచితే, తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన చేటు చేసేది ఆ పార్టీ అను'కుల'మీడియానే జనం అంతా జగన్ ను ద్వేషించేస్తున్నారని చాటింపు వేస్తూ, చంద్రబాబు ప్రకటనలను తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తూ, ఆ పార్టీకి, ఆ పార్టీ నేతలకు గ్రౌండ్ రియాల్టీ తెలియకుండా చేస్తోంది.అప్పు చేసి మరీ జగన్ అందిస్తున్న నగదు పథకాల పట్ల జనం హ్యాపీగా వున్నారు. 

అదే సమయంలో అమరావతి, మూడు రాజధానులు, మతం కార్డులు గ్రామాల్లో జనాలను ఇసుమంతయినా ప్రభావితం చేయలేదు. కానీ ఈ సంగతి తెలియాలంటే మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాల్లోకి వెళ్లాలి. ఎక్కడ మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లారో ఒక్కసారి ఆరాతీయండి. అందరూ ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయిపోయారు. తెల్లవారి లేరి తమ పార్టీ అను'కుల' మీడియా పత్రిక చదివేసి, జగన్ పని ఇక అయిపోయినట్లే అని రోజులు లెక్క పెట్టేసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు.

ఇలా పార్టీ భ్రమల్లో వుంది. నాయకుల అచేతనం అయిపోయారు. కీలక బాధ్యులు తప్పుడు ప్రకటనలు చేస్తూ, అదే కరెక్ట్ అని అనుకుంటూవస్తున్నారు. ఇంక మరి విజయం ఎలా సాధ్యం?

ఇప్పడు చూడండి., భాజపాకు దగ్గర కాలేరు. అలా అని దూరంగా వుండలేరు. జనసేనను దగ్గరకు తీసుకోవాలని వుంటుంది. బిసిలు దూరం అవుతారని భయం. పోనీ ఇవన్నీ వదిలేసి వంటరి పోరు సాగించగలరా? అంటే అమ్మో అది మరీ ప్రమాదం. సీనియర్లను పక్కన పెట్టి, టోటల్ గా పార్టీ ని ప్రక్షాళన చేయాలన్న కోరిక వుంది. కానీ బాబుగారు నాయకుడిగా వుండగా అదిసాధ్యం కాదు. మరి విజయతీరాలకు తెలుగుదేశం చేరేదెలా?

చాణక్య