హైదరాబాద్‌లో భూవివాదం నేపథ్యంలో కేసులు, జైలు అంటూ వార్తల్లో వ్యక్తిగా నిలిచిన భూమా అఖిలప్రియ….ఎట్టకేలకు గురువారం మీడియా ముందుకొచ్చారు. తమపై కొందరు పోలీసులు కక్షకట్టినట్టు వ్యవహరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పరమైన గొడవే తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
కొందరు పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ తండ్రి ఆస్తుల్ని కాపాడుకునేందుకు కొట్లాడుతామని, అది ఆళ్లగడ్డైనా, హైదరాబాద్ అయినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. తమను బెదిరించాలని చూస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. ఇట్లాంటివి చాలా చూశామని ఆమె చెప్పుకొచ్చారు. తిక్కతిక్క వేషాలు వేయొద్దని హెచ్చరించారు. కొంత మంది పోలీస్ ఆఫీసర్ల వల్ల తెలంగాణ సర్కార్‌కు చెడ్డ పేరు వస్తోందన్నారు.
ప్రాణం పోయినా తమ తండ్రి ఆస్తుల్ని వదులుకునే ప్రశ్నే లేదని ఆమె స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకోని తమతో ఆడుకోవడం కాదని, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలని సవాల్ విసిరారు. తన భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్ పై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తప్పుగా చెప్పి చీట్ చేశారని కేసు నమోదు చేశారన్నారు.
ఇదంతా తమను ఇబ్బందులకు గురి చేయడానికే అని ఆమె వాపోయారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖ రాస్తామని అఖిలప్రియ తెలిపారు. తమపై పెట్టిన కేసులను సీబీఐకి అప్పగించి విచారించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఆట ఇప్పుడే మొదలైందని, ఇకపై తామేంటో చూపిస్తామని అఖిలప్రియ హెచ్చరించారు.