విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కావడం ఖాయం. ఇందులో రెండవ మాటకు తావు లేదు. ఎందుకంటే ఉక్కు ప్రైవేటీకరణ లావాదేవీలు చూసేందుకు, న్యాయపరమైన అవరోధాలు లేకుండా చూసేందుకు సలహాదారులు కూడా వచ్చేస్తున్నారు. అలా విక్రయ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగిపోతోంది.
మరో వైపు కార్మిక నాయకులు తాజా పరిణామాల మీద మండిపడుతున్నారు. కేంద్రం తక్షణం తన దూకుడు ఆపి ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని స్పష్టమైన ప్రకటన చేయమని ప్రకటించాలని వారు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతుగా నిలవాలని కూడా కోరుతున్నాయి.
సరే ఈ విషయంలొ అధికార వైసీపీ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసింది. వేటు వద్దు అంటూ విన్నపాలు చేసుకుంది. కానీ కేంద్రం దీనిని ఒక పాలసీగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది. మరి ఆ సంగతి తలపండిన అన్ని రాజకీయ పార్టీలన్నింటికీ తెలుసు. తెలుగుదేశానికి తెలియదా.
పైగా ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అంటూ ఈ రోజు దాకా టీడీపీ తరఫున కేంద్రానికి లేఖ రాసింది లేదు. కానీ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాత్రం ఉక్కు సెగను వైసీపీ మీదకు ఎగదోయడానికి రెడీ అయిపోతున్నారు. విశాఖ ఉక్కుని కేంద్రానికి జగన్ తాకట్టు పెట్టేశారని, తన మీద ఉన్న కేసుల కోసం ఇలా చేస్తున్నారని ఆరోపించేశారు. పనిలో పనిగా ఫోక్సో కంపెనీకి ఉక్కుని అమ్మేయడానికి జగన్ ఆరాటపడుతున్నారని కూడా బండలు వేశారు.
మొత్తానికి ఉక్కు సెగను రగిల్చి కార్పోరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకున్న టీడీపీ ఇపుడు కూడా ఉద్యమం కంటే రాజకీయమే ముఖ్యమనుకుంటోందా అన్నదే డౌట్.
ఏది ఏమైనా ఉక్కు కర్మాగారం కేంద్రానిది… దీన్ని అమ్ముకుంటాం, ఏమైనా చేసుకుంటాం, రాష్ట్రానికి సంబంధం ఏంటి అని కేంద్ర మంత్రులు ప్రశ్నిస్తున్న వేళ ఉక్కుని వేటు నుంచి బయటేయడం అసాధ్యమని తెలుగుదేశానికి కూడా తెలియకుండా ఉంటుందా. అయితే నాయకులు మాత్రం ఉక్కు నుంచి కూడా తుక్కు రాజకీయం చేయాలనుకోవడమే ఉద్యమానికి అసలైన శాపంగా మారుతోంది మరి.