టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత కేసీఆర్ సర్కార్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల్ని ప్రతి రోజూ చూస్తునే ఉన్నాం. ఇన్నాళ్లకు రేవంత్ కామెంట్లకు గట్టి కౌంటర్ పడింది. ఈసారి ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. రేవంత్ విమర్శల్ని తిప్పికొట్టడమే కాకుండా, ఆయనపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు.
“గతంలో ఇదే రేవంత్ రెడ్డి, సోనియా గాంధీని ఎన్ని తిట్లు తిట్టాడో యూట్యూబ్ లో కొడితే వస్తాయి. ఆమె తల్లి కాదు, తెలంగాణలో 1200 మందిని చంపేసిన బలి దేవత అన్నాడు. ఈరోజు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నాడు. ఇలానే వదిలేస్తే రేపోమాపో చంద్రబాబు నాయుడ్ని తెలంగాణ తండ్రి అని కూడా చెబుతాడు.”
రేవంత్ కు పాత వాసనలు పోవడం లేదన్నారు కేటీఆర్. ఇంకా ఆయన టీడీపీలోనే ఉన్నట్టు ఫీలవుతున్నారని.. కాంగ్రెస్ పార్టీని, తెలుగు-కాంగ్రెస్ పార్టీగా మార్చే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో ఓ రకమైన గందరగోళం నడుస్తోందన్నారు.
“ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి వ్యక్తి తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కొనేశారంటున్నాడు. ఇంతకంటే గమ్మత్తు ఏముంటుంది. కొనుడు-అమ్ముడు గురించి రేవంత్ కంటే గొప్పగా ఎవ్వరికీ తెలియదు. నోట్ల కట్టలతో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయినోడు ఈరోజు నీతి మాటలు మాట్లాడుతున్నాడు.”
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రేవంత్ కు ఓ పదవి దొరికిందని, ఓ 2 రోజులు ఇలానే హంగామా చేస్తారని ఎద్దేవా చేశారు కేటీఆర్.