అమ‌రావ‌తి…ఉద్య‌మ ఆహుతి!

చివ‌రికి అమ‌రావ‌తి ఉద్య‌మం కూడా అవినీతి జ్వాల‌కు ఆహుతి కానుంది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాలంటూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు, కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల…

చివ‌రికి అమ‌రావ‌తి ఉద్య‌మం కూడా అవినీతి జ్వాల‌కు ఆహుతి కానుంది. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాలంటూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు, కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల 12వ తేదీకి ఈ పోరాటం వెయ్యి రోజులు పూర్తి చేసుకోనుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం భూమిలిచ్చిన పేద‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌డాన్ని ఏ ప్రాంత ప్ర‌జానీకం కూడా హ‌ర్షించ‌దు. వాళ్ల‌కు న్యాయం చేయాలి, జ‌ర‌గాలి అనేది అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెర‌పైకి తెచ్చిన మూడు రాజ‌ధానుల కాన్సెఫ్ట్ చివ‌రికి ఏమ‌వుతుందో కానీ, మ‌న ప్రాంతం కూడా అభివృద్ధి జ‌ర‌గాలంటే రాజ‌ధాని వుంటేనే సాధ్య‌మ‌నే అభిప్రాయం ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో బ‌ల‌ప‌డుతోంది. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో రాజ‌ధాని ఎపిసోడ్ త్రిశంకు స్వ‌ర్గాన్ని త‌ల‌పిస్తోంది. హైకోర్టు తీర్పు త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ రెండో ద‌ఫా అమ‌రావ‌తి పాద‌యాత్ర చేప‌ట్టాల‌నే నిర్ణ‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే ఏక‌ప‌క్షంగా పాద‌యాత్ర నిర్ణ‌యం తీసుకున్నార‌ని అమ‌రావ‌తి రాజ‌ధానికి చెందిన వివిధ జేఏసీల్లో తీవ్ర వ్య‌తిరేక‌త చోటు చేసుకున్న‌ట్టు తెలిసింది. ప్ర‌ధానంగా జేఏసీ నేత‌లు శివారెడ్డి, తిరుప‌తిరావు త‌దిత‌రులు వ‌సూళ్ల బ్యాచ్ అని, గ‌తంలో ఉద్య‌మం పేరుతో రాబ‌ట్టిన సొమ్మును దిగ‌మింగార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. డ‌బ్బు లావాదేవీల ఆరోప‌ణ‌లు తోటి ఉద్య‌మ‌కారుల నుంచి రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌తంలో వంద‌ల కోట్లు ఉద్య‌మానికి విరాళంగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

గ‌త కొంత కాలంగా అమ‌రావ‌తి పోరాటానికి రాయ‌పాటి శైల‌జ దూరంగా ఉండ‌డం వెనుక …. అంత‌ర్గ‌తంగా తీవ్ర‌విభేదాలే కార‌ణ‌మ‌ని జేఏసీ నేత‌లు చెబుతున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు ఆమె ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. చివ‌రికి లైవ్ డిబేట్ల‌లో అమ‌రావ‌తి జేఏసీ నాయ‌కులు ఉద్య‌మానికి రాబ‌ట్టిన విరాళం ఎంత‌? చేసిన ఖ‌ర్చు ఎంత‌? చెప్పాల్సిందే అని డిమాండ్ చేసే వ‌ర‌కూ విభేదాలు దారి తీశాయి.  

సెప్టెంబరు 12న రెండో ద‌ఫా పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న వెనుక రాజ‌ధానిని కాపాడుకోవాల‌నే త‌ప‌న కంటే…ఆ పేరుతో సొమ్ము చేసుకోవాల‌నే ఆరాట‌మే ఎక్కువ అని కొంద‌రు జేఏసీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అమ‌రావ‌తి జేఏసీలోని ఆధిప‌త్య పోరు చివ‌రికి ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందో చెప్పలేని స్థాయిలో విభేదాలున్నాయ‌నే చ‌ర్చకు తెర‌లేచింది.  

అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి నేతలు గురువారం నిర్వ‌హించిన స‌మావేశంలో శివారెడ్డి, శైలజ, తిరుపతిరావు మిన‌హా, గ‌తంలో క్రియాశీల‌కంగా ప‌ని చేసిన వాళ్లు క‌నిపించ‌లేద‌ని జేఏసీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా అమ‌రావ‌తి ఉద్య‌మంలో భారీ చీలిక‌కు మ‌రెంతో దూరం లేద‌నే అభిప్రాయాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.