ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈయన అధికార పార్టీనా? లేక ప్రతిపక్షమా? అనే అనుమానం రాకమానదు. ప్రతిపక్ష పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని చెప్పడం ఆయనకే చెల్లింది. తాను నిస్సహాయంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్టు బ్రిజేంద్రరెడ్డి చెప్పకనే చెప్పారు. ఈయన నిస్సహాయతపై సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆళ్లగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అఖిలప్రియపై ఆరోపణలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ప్రయత్నిస్తుంటే, మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం నేరాలకు పాల్పడుతూ ఆళ్లగడ్డకు చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు.
తమ పార్టీ నాయకులు ఆళ్ళగడ్డ మున్సిపల్ పరిధిలో అక్రమంగా టోల్ గేట్ అధికంగా వసూలు చేస్తున్న మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే మిగిలిన మూడు టోల్ గేట్లను పొందిన టీడీపీ నాయకుడైతే కనీసం రసీదులు ఇవ్వకుండా రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
మూడు గేట్లను టీడీపీ నాయకుడు పొందడం అంటే బ్రిజేంద్రరెడ్డి ఎంత అసమర్థుడో అర్థం చేసుకోవచ్చని ఆళ్లగడ్డ వైసీపీ నేతలు చేస్తున్న మొదటి విమర్శ. ఇక రెండో విమర్శకు వస్తే…. రసీదులు ఇవ్వకుండా టీడీపీ నాయకుడు అధిక వసూళ్లకు పాల్పడుతుంటే… అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రేక్షకపాత్ర పోషించడం అంటే అసమర్థతను చాటుకోవడం కాదా? అనే ప్రశ్న వస్తోంది.
ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆగడాలను నిలువరించకపోతే, ఇక అధికార పార్టీలో వుంటూ ఏం చేస్తున్నారని సొంత వాళ్లు నిలదీస్తున్న పరిస్థితి ఆళ్లగడ్డలో వుంది. ఇదొక్కటే కాదు, ఏది తీసుకున్నా తన నిస్సహాయతను, చేతగాని తనాన్ని ఎమ్మెల్యే బాహాటంగానే ప్రదర్శిస్తుండడం చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా ఈయన మారుతారా? లేక ఈయన్ను వైసీపీ మారుస్తుందా? అనేది కాలానికి వదిలేద్దాం.