తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న వేళ సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆందోళన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకుంది. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారశైలితో విసిగి పోయానని మర్రి శశిధర్‌రెడ్డి మండిపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి అనుకూల నేతలు స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అనే నావలో అందరం ప్రయాణిస్తున్నామన్నారు. నావ మునిగితే అందరూ మునిగిపోతామన్నారు. కావున కాంగ్రెస్‌ను ముంచే పని చేయవద్దని సున్నితంగా హితవు చెప్పారు. మరో నాయకుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని కోరారు.
కాంగ్రెస్ అగ్రనేత మర్రి చెన్నారెడ్డి తనయుడిగా శశిధర్‌రెడ్డిపై తమకు గౌరవం వుందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా శశిధర్‌రెడ్డి మాట్లాడటం సరైంది కాదని హితవు చెప్పారు. మర్రి విమర్శల్లో తన గురించి కూడా ప్రస్తావన వుందని అద్దంకి గుర్తు చేశారు. ఇప్పటికే తాను క్షమాపణ చెప్పానన్నారు.
తన కామెంట్స్‌ను మరింత వివాదాస్పదం చేయకుండా సద్దుమణిగేలా మర్రి మాట్లాడి వుంటే బాగుండేదని అద్దంకి అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ గురించి విమర్శిస్తే పార్టీకి నష్టం కదా? అని అద్దంకి ప్రశ్నించారు. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పి వుంటే బాగుండేదన్నారు.