తిరుపతి..అలిపిరి..ఈ పదాలు వింటనే భక్తుల శరీరంలో చిన్న ప్రకంపన. ఏ ఊరైనా స్థానికులకే కాస్త ప్రేమ వుంటుంది. కానీ కొన్ని ఊళ్లు అంటే స్థానికతతో సంబంధం లేకుండా అనుబంధం వుంటుంది.
తిరుపతి అలాంటి పట్టణాల్లో ఒకటి. ఈ తిరుపతి పట్టణ వైనం మీద ఓ మాంచి పాట రాసారు కిట్టూ విస్సాప్రగడ. అప్పుడెప్పుడో వేటూరి యమహానగరి అంటూ కలకత్తా మీద రాసినట్లు, తిరుపతి పట్టణ టూర్ గైడ్ అనే విధంగా ఈ పాటను రాసారు.
తెలుగువారికి సుపరిచితమైన శంకర్ మహదేవన్ ఈ పాటను రమ్య బెహరాతో కలిసి ఆలపించారు. తిరుపతిలోని కీలక ప్రదేశాలను, పట్టణ జీవన శైలిని ఈ పాటలో చిత్రీకరించారు. ఆయా ప్రాంతల విశేషాలను పాటలో పొందుపరిచారు. ఫణి కళ్యాణ్ మంచి క్యాచీ ట్యూన్ అందించారు. ఇంతకీ ఈ పాట ఇప్పుడు ఎందుకు తయరైందీ అంటే ఓ సినిమా కోసం. ఆ సినిమా కూడా తిరుపతి నేపథ్యంలో సాగే సినిమానే.
సినిమా పేరే..అలిపిరికి అల్లంత దూరంలో అనే ఈ సినిమాను కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై పి రాజేంద్ర రెడ్డి, డబ్బుగొట్టు రమేష్ నిర్మిస్తున్నారు. జె ఆనంద్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవీన్ రెడ్టి, శ్రీ నిఖిత, అలంకృిత షా, రవీందర్ బొమ్మకంటి, ప్రసాద్ బెహరా తదితరులు నటిస్తున్నారు.