పదవి ఇచ్చేముందు గత చరిత్ర తెలుసుకోరా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో రాజకీయాలు ఎంత ఛండాలంగా మారాయో అందరికీ తెలుసు. రాజకీయాల్లో కానీ, పరిపాలనాలోగానీ విలువలు పూర్తిగా నశించాయి. నైతికత పూర్తిగా అడుగంటిపోయింది. అవినీతి వట వృక్షంలా పెరిగిపోయింది.…

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో రాజకీయాలు ఎంత ఛండాలంగా మారాయో అందరికీ తెలుసు. రాజకీయాల్లో కానీ, పరిపాలనాలోగానీ విలువలు పూర్తిగా నశించాయి. నైతికత పూర్తిగా అడుగంటిపోయింది. అవినీతి వట వృక్షంలా పెరిగిపోయింది. దీన్ని ప్రజలూ  పట్టించుకోవడంలేదు. దేశంలో కొందరు ముఖ్యమంత్రులకు అవినీతి మచ్చలు లేవు. నిజాయితీపరులుగా పేరుంది. కానీ వారి మంత్రుల కారణంగా వారికి చెడ్డపేరు వస్తోంది. 

అవినీతిపరులకు, క్రిమినల్స్ కు  కూడా మంత్రి పదవులిస్తున్నారు. తెలిసి కూడా పదవులు ఎందుకిస్తున్నారంటే అవినీతిపరులను, క్రిమినల్స్ ను పక్కకు పెడితే మంత్రి పదవులు ఇవ్వడానికి నాయకులు దొరకరని భయం కావొచ్చు. వాళ్ళ నేరాలు నిరూపణ అయ్యేవరకు ఏళ్ళూ పూళ్ళూ పడుతుంది కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిపరులకు, నేరగాళ్లకు పదవులు ఇవ్వక తప్పదు. మన దేశంలో నేర నిరూపణ తొందరగా జరగదు కాబట్టి అప్పటివరకు వారికి పదవులు ఇవ్వకుండా  పక్కన పెట్టడం అన్యాయమనే భావన ఉంది. 

బీహార్ లో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. బీజేపీతో బంధం తెంపుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో జత కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.  ఒకప్పుడు అవినీతిని కారణంగా చూపి ఇదే ఆర్జేడీని పక్కకు పెట్టి బీజేపీతో కలిశారు నితీష్. ఇప్పుడు కొత్త కేబినెట్‌ కొలువుదీరిన కొన్ని గంటలకే నీతీశ్‌ కుమార్‌కు  కొత్త తలనొప్పులు మొదలైనట్లు కనిపిస్తోంది. 

నీతీశ్‌ కేబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ సింగ్‌పై అరెస్టు వారెంటు ఉందన్న విషయాన్ని బయటకు తీసిన బీజేపీ నేతలు.. అటువంటి నేతకు న్యాయ శాఖను ఎలా అప్పగిస్తారని మండిపడుతున్నారు. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర విలేకర్లు ప్రస్తావించగా.. 'ఆ కేసు గురించి నాకు తెలియదు' అంటూ నీతీశ్‌ కుమార్‌ బదులిచ్చారు. ఒక నాయకుడిని మంత్రిగా నియమిచ్చేటప్పుడు అతని చరిత్ర ఏమిటో తెలుసుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత కదా. 

అందులోనూ నితీష్ కు అవినీతి రహితుడనే పేరుంది. మరి ఆయన ఈ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? తేజస్వి పార్టీకి చెందిన కార్తికేయ సింగ్‌పై గతంలో కిడ్నాప్‌ కేసుకు సంబంధించి అరెస్టు వారెంటు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో ఆగస్టు 16నే దానాపూర్‌ కోర్టు ముందు ఆయన లొంగిపోవాల్సి ఉండగా.. అదే రోజు ఆయన న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కార్తికేయ్‌ సింగ్‌.. ఎమ్మెల్సీ పదవి చేపట్టే సమయంలోనే ఆ కేసు గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించానని పేర్కొన్నారు. 

ఆ కేసులో తనపై తప్పుడు అభియోగాలు నమోదు చేశారని, తనపై ఎటువంటి వారెంట్‌ లేదని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఐతే స్థానిక పోలీసులు మాత్రం ఆయనపై వారెంటు ఉన్న విషయాన్ని ధ్రువీకరించారు. ఆర్జెడీకి చెందిన కార్తికేయ సింగ్‌.. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

అయితే, 2014లో జరిగిన ఓ కిడ్నాప్‌ వ్యవహారంలో కార్తికేయతోపాటు మరో 16 మందిపై కేసు నమోదయ్యింది. ఓ బిల్డర్‌ను హత్య చేసేందుకు కిడ్నాప్‌ చేశారనే అభియోగాలపై వారిపై కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని లేవనెత్తిన బిహార్‌ బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ.. కిడ్నాప్‌ కేసులో వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తిని మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా …నీతీశ్‌ కుమార్‌ కొత్త మంత్రివర్గంలో 27మంది కోటీశ్వరులు కాగా.. 70శాతం మందికి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌  నివేదిక వెల్లడించింది. 

కేబినెట్‌ విస్తరణలో భాగంగా 31మందిని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే, వీరంతా 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌, బిహార్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు నివేదికను రూపొందించి విడుదల చేశాయి. సీఎం నీతీశ్‌తో పాటు మొత్తం 33మందితో కేబినెట్‌ ఉండగా.. 32మంది అఫిడవిట్లను పరిశీలించినట్టు ఏడీఆర్‌ తెలిపింది. 

ఇలాంటి క్రిమినల్ కేసులున్న మంత్రులు కేంద్రంలోనూ ఉంటారు, రాష్ట్రాల్లో ఉంటారు. వారికి పదవులివ్వకుంటే అసలు పరిపాలన చేసే పరిస్థితే ఉండదు. ఈ వ్యవస్థ అలాంటిది.