'అబ్బే.. మోడీ అలాంటోడు కాదు, చిరాగ్ పాశ్వాన్ కు న్యాయం చేస్తాడు, చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి తగు న్యాయం చేస్తాడు..' అన్న.. భక్తుల వాదన డొల్లయిపోయింది. బిహార్ లో బీజేపీ పోటి చేసిన సీట్లతో తప్ప.. మిగిలిన సీట్లలో మాత్రమే పోటీ చేసి, తను మోడీకి హనుమంతుడిని అని చెప్పుకున్న చిరాగ్ పాశ్వాన్ కు పెద్ద షాకే తగిలింది.
కేంద్ర మంత్రి వర్గంలో ఎల్జేపీ తిరుగుబాటు నేత, ఆ పార్టీ పార్లమెంటరీ విభాగం అధ్యక్షుడు పశుపతి కుమార్ పారాస్ కు పదవి దక్కింది. మామూలు హోదాతో కాదు, కేబినెట్ హోదాతో ఆయన మంత్రి అయ్యారు!
ఇటీవలే ఎల్జేపీ పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ పై ఆయన బాబాయ్ పశుపతి తిరుగుబాటు చేశారు. మొత్తం ఐదు మంది ఎంపీలు ఆయనను తమ పార్టీ అధ్యక్ష హోదా నుంచి తప్పించేశారు.
లోక్ సభలో ఈ తిరుగుబాటుకు గుర్తింపు లభించింది. తిరుగుబాటు వర్గానే ఎల్జేపీగా గుర్తించారు లోక్ సభ స్పీకర్. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్నికల కమిషన్ వద్దకు చేరింది. తమదే అసలైన ఎల్జేపీ అని, చిరాగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించింది పశుపతి వర్గం. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
అయితే.. చిరాగ్ కు కేంద్రంలో మంత్రి పదవి దక్కనుందని, తద్వారా పశుపతికి గట్టి ఝలక్ తగులుతుందనే ప్రచారం జరిగింది. ఇక మోడీ భక్తులు కూడా.. ఈ ప్రచారాన్నే చేశారు. తన చేతిలో లేని అంశంలో చిరాగ్ కు మోడీ న్యాయం చేయలేకపోయినా, ఇప్పుడు మంత్రి పదవిని ఇచ్చి ఊరడిస్తారనే టాక్ వచ్చింది.
అందులోనూ మోడీని రాముడిగా పోలుస్తూ తనను హనుమంతుడిగా చెప్పుకున్న వ్యక్తి చిరాగ్. మరి హనుమంతుడు కష్టాల్లో ఉన్నప్పుడు రాముడు రాడా? అంటూ ఇటీవల చిరాగ్ బోరుమన్నంత పని చేశాడు. అయితే.. అలాంటి సీన్ ఏమీ ఉండదని స్వయంగా మోడీ క్లారిటీ ఇచ్చారు.
చిరాగ్ కు కనీసం సహాయ మంత్రి పదవి దక్కలేదు. పశుపతికి మాత్రం కేబినెట్ హోదా దక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పశుపతి మాట్లాడుతూ.. చిరాగ్ పై చిందులు తొక్కారు. రామ్ విలాస్ తన దేవుడని, చిరాగ్ మాత్రం శత్రువన్నాడు.
ఇంకవైపు చిరాగ్ ట్వీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. తను ఈ అంశంపై కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ప్రకటించాడు. పార్టీలో తిరుగుబాటు ఎంపీలపై కోర్టుకు ఫిర్యాదు చేస్తారట చిరాగ్. అయినా.. కర్ర ఉన్నవాడిదే పెత్తనం అన్నట్టుగా స్వయంగా మోడీనే పశుపతికి మంత్రి పదవి ఇచ్చాకా, ఇక చిరాగ్ పోరాటానికి ప్రయోజనం ఉండే ఛాన్సే లేదేమో!