జ‌గ‌న్ ప్ర‌శ్న అర్థ‌మ‌వుతోందా కేసీఆర్‌?

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ స‌ర్కార్‌ను గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. త‌ప్పేంట‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పేరు పెట్ట‌కుండానే నిల‌దీశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్…

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ స‌ర్కార్‌ను గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. త‌ప్పేంట‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పేరు పెట్ట‌కుండానే నిల‌దీశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌యంతిని పుర‌స్కరించుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతు దినోత్స‌వాన్ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో ఏర్పాటు చేసిన రైతు స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జ‌ల జ‌గ‌డంపై నోరు విప్పారు.

నీటి విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని కేసీఆర్ స‌ర్కార్‌కు ప‌రోక్షంగా హిత‌వు చెప్పారు. నీటి వాటాలో ఫిప్టీ ఫిప్టీ ఫార్ములాను తెర‌పైకి తెచ్చి, రెండు తెలుగు రాష్ట్రాల రైతుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేసిన కేసీఆర్‌కు జ‌గ‌న్ త‌గిన రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని త‌ప్పు ప‌ట్టారు. అలాంటి వాళ్లంతా ఓ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని నీటి పంప‌కాల గురించి లెక్క‌లు చెప్పారు.  

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపాయ‌ని, ఈ మేర‌కు ముగ్గురు సంత‌కాలు కూడా చేశార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. కోస్తాకు 360, సీమకు 144, తెలంగాణకు 290 టీఎంసీలు చొప్పున జ‌ల కేటాయింపుల‌పై ఒప్పందం చేసుకున్నార‌ని చెప్పారు. గతంలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారన్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు. 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉంటుంద‌న్నారు.

796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని కేసీఆర్‌ను జ‌గ‌న్ ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. గతంలో మీరు (చంద్ర‌బాబు) ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. 

ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే గాడిదలు కాశారా అని చంద్ర‌బాబును నిల‌దీశారు. పాలమూరు రంగారెడ్డి, దిండి..ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని జగన్‌ నిలదీయ‌డం గ‌మ‌నార్హం.