పారా గ్లయిడింగ్ కారణంగా తీవ్రంగా గాయపడిన హీరో శర్వానంద్ కు సోమవారం శస్త్ర చికిత్స జరుగుతుంది. డాక్టర్ గురవారెడ్డి ఈ ఆపరేషన్ ను చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ రోజు అంతా శర్వాకు మందులతో ట్రీట్ మెంట్ చేస్తున్నారని బోగట్టా. పెయిన్ ను భరించలేకపోతుండడంతో, ఆ మేరకు కొన్ని మందులు ఇచ్చి, చిన్న చికిత్స ఒకటి చేసినట్లు తెలుస్తోంది.
షోల్డర్ బాగా గాయపడడం, చేతికి, కాలికి చిన్న చిన్న గాయాలు తగలడంతో, శర్వానంద్ పూర్తిగా కోలుకుని, మళ్లీ చురుగ్గా షూటింగ్ లో పాల్గొనడానికి మూడు నెలలు టైమ్ పట్టే అవకాశం వుందని తెలుస్తోంది.
శస్త్ర చికిత్స అయిన తరువాత శర్వానంద్ మామూలవుతారు. కానీ కనీసం నెల నుంచి నెలన్నర విశ్రాంతి అవసరం. ఆ తరువాత కూడా ఫిజియోథెరపీ లాంటివి అవసరం పడతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న 96 రీమేక్ సినిమా పనులు అన్నీ రెండు నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పూర్తి అయిన సుధీర్ వర్మ డైరక్షన్ లోని రణరంగం సినిమా వర్క్ అంతా పూర్తయింది. డబ్బింగ్ కూడా అయిపోయింది. కేవలం ప్రమోషన్ మాత్రమే జరగాల్సి వుంది.
ఇది కాక, తమిళ-తెలుగు భాషా చిత్రం ఒకటి ఓకె చేసారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. ఆపైన ఇంకో సినిమాకు కూడా ఓకె చెప్పారు. ఈ రెండూ పూర్తిగా కోలుకున్నాక, 96 సినిమా రీమేక్ పూర్తయిన తరువాత మొదలవుతాయి. ఇటీవల కాలంలో ఓ పాపులర్ హీరో కాస్త పెద్దగా గాయపడడం ఇదే. చిన్న చిన్న గాయాలు, వారం, రెండు వారాలు రెస్ట్ తప్ప, పెద్దగా గాయపడడం ఇదే.