Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎలక్షన్‌ టీంలో సెలక్షన్‌కు ఎమ్మెల్యేల్లో పోటీ!

ఎలక్షన్‌ టీంలో సెలక్షన్‌కు ఎమ్మెల్యేల్లో పోటీ!

చివరి నిమిషం వరకు క్యాబినేట్‌లో బెర్త్‌ లభించడం తధ్యమని భావించి భంగపడిన ఆశావహులు ఇక చేసేదిలేక వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఎలక్షన్‌ టీంలో బెర్త్‌ దొరకాలంటే ఇప్పటినుంచే ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాల్సి ఉందని పలువురు ఎమ్మెల్యేలు హితవు పలుకుతున్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా పనిచేసిన వారినే జగన్‌ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. తొలి విడత మంత్రివర్గంలో గోదావరి జిల్లాకు జగన్‌ సముచిత స్థానం ఇచ్చారు. మంత్రుల పంపికలో జగన్‌ సామాజిక సమతుల్యత పాటించారు.

తూర్పు గోదావరి జిల్లాలో కాపుసామాజిక వర్గం నుండి కాకినాడ రూరల్‌ పమ్మెల్యే కురసాల కన్నబాబుకు, బీసీ(శెట్టిబలిజ) సామాజికవర్గం నుండి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు, దళిత సామాజికవర్గం నుండి పినిపే విశ్వరూప్‌కు మంత్రి పదవులను కట్టబెట్టారు. జగన్‌ కేబినేట్‌ కూర్పుపై తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసారు. వైఎస్‌ జగన్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన పిల్లి బోస్‌, పినిపే విశ్వరూప్‌లు బాసటగా నిలిచారు. రాజశేఖరరెడ్డి, రోశయ్య ప్రభుత్వాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ మంచిగా పనిచేసిన విశ్వరూప్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2013వ సంవత్సరంలో మంత్రి పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి చెందారు. 2019లో అమలాపురం అసెంబ్లీకి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఎస్సీ సామాజిక వర్గ కోటాలో విశ్వరూప్‌కు మంత్రిపదవి దక్కింది. పిల్లి బోస్‌ గతంలో రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి వైఎస్‌ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. బోస్‌ సైతం కష్టకాలంలో జగన్‌కు అండగా నిలిచారు. అందుకు గుర్తింపుగా బోస్‌కు పమ్మెల్సీ పదవిని జగన్‌ కట్టబెట్టారు.

2019 ఎన్నికల్లో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. దీంతో మండపేట అసెంబ్లీ స్థానానికి బోస్‌ వైసీపీ అభ్యర్ధిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించగా బోస్‌ పరాజయం పాలయ్యారు. అయితే ఈయనకు మరో రెండేళ్లు ఎమ్మెల్సీ పదవీకాలం ఉండటంతో ఆ కోటా కింద మంత్రి లభించింది. కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు అనూహ్యంగా మంత్రిపదవి దక్కింది.

జిల్లాలోని ఇదే సామాజికవర్గానికి చెందిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రి పదవిని ఆశించారు. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదర ద్వయాన్ని రెండుసార్లు  ఓడించిన దాడిశెట్టి రాజాకు మంత్రిపదవి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు కన్నబాబును ఆమాత్య కిరీటం వరించింది. పశ్చిమ గోదావరి జిల్లా విషయంలోనూ జగన్‌ సామాజిక సమతుల్యత పాటించారు. ఈ జిల్లా నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన చెరుకూరి శ్రీరంగనాథరాజు, కాపు వర్గానికి చెందిన ఆళ్ల నానిలకు మంత్రి పదవులు దక్కాయి.

భీమవరం నుండి పోటీచేసి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై ఘన విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్‌కు క్యాబినేట్‌లో చోటు లభిస్తుందని ఆశించారు. అయితే గ్రంథికి సైతం ఎలక్షన్‌ టీంలోనే స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రి పదవియోగాన్ని త్రుటిలో కోల్పోయిన ఆశావహులకు రెండున్నరేళ్ల తరువాత మంచిరోజులు రావడం తథ్యమన్న ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?