తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏమీ పాలుపోతున్నట్లు లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పతనం దాదాపుగా సంపూర్ణం అయిన తెలంగాణ రాష్ట్రంలో, పార్లమెంటు ఎన్నికల నాటికి తిరిగి కాస్త ఊపిరి అందిందని అనుకుంటుండగా… ఇప్పుడు మళ్లీ తమ అసలు బుద్ధులు ప్రదర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి.. విషప్రచారాలు చేస్తున్నారు. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రాజెక్టులాగా రంగుపులిమి… కొత్త విషాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. తమ పార్టీ పతనం సర్వవిదితం అవుతుండగా.. ఇంకా ఇలాంటి వక్రబుద్ధులు ప్రదర్శించడం ఎందుకని పలువురు భావిస్తున్నారు.
తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. దీని ప్రారంభానికి పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ స్వయంగా జగన్ ను ఆహ్వానించడానికి సోమవారం విజయవాడ వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో… తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క ఏపీ సీఎం జగన్ కు ఒక లేఖ రాశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభిస్తే.. కేసీఆర్ దానిపేరు మార్చి, డిజైన్ మార్చి, బడ్జెట్ పెంచి కాళేశ్వరంగా పూర్తి చేశారని… దీని ప్రారంభానికి వస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని జగన్ కు భట్టి హితవు చెప్పారు.
ఈ వాదనే అత్యంత అర్థ రహితంగా కనిపిస్తోంది. ఎందుకంటే… డిజైన్, పేరు, బడ్జెట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ… ఈ ప్రాజెక్టు ద్వారా… వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పించింది ప్రధానంగా… తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం మాత్రమే. ఆయన మరణానంతరం ఏలుబడి సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పనిని పూర్తి చేయలేకపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసింది. డిజైన్లు, పేరు ప్రధానం కాదనుకుంటే గనుక… తెలంగాణ సస్యశ్యామలం కావడం అనే వైఎస్ అసలు లక్ష్యం నెరవేరినట్లే కదా అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత అయిదేళ్లలో లేని సౌహార్ద్ర సంబంధాలు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో భట్టివిక్రమార్క లాంటి నాయకులు… తమ వక్రబుద్ధులు ప్రదర్శించడం వివేకం అనిపించుకోదు. పైగా, తన లేఖను జగన్ ఖాతరు చేసే పరిస్థితి లేని ప్రస్తుత సమయంలో ఇలాంటి వక్రబుద్ధిని బయటపెట్టుకుంటే వారికే చెడ్డపేరు తప్పదు!
బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!