జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జగన్ తప్పు చేశారా!

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్… ఇలా అన్ని రకాలు కలిపి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీచేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ ఏడాదికి గాను మరో 10వేల143 కొత్త పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.…

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్… ఇలా అన్ని రకాలు కలిపి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీచేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ ఏడాదికి గాను మరో 10వేల143 కొత్త పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవేవీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. నోటిఫికేషన్ లో లేని ఉద్యోగాల్ని మాత్రమే ఎత్తిచూపుతున్నారు. వాటిపైనే ఆందోళనలు చేస్తున్నారు. లేని ఉద్యోగాలు చూపించి విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంతో పాటు జనసేన-బీజేపీకి ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. వాళ్ల విమర్శలు, ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఇక జగన్ ప్రభుత్వం నుంచి జాబ్ నోటిఫికేషన్ రాదని, ఈ 10వేల ఉద్యోగాలతోనే దుకాణం సర్దేస్తారనే రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇలా ఆందోళనలు చేస్తున్న బ్యాచ్ అంతా (కొంతమంది నిరుద్యోగులతో కలిపి) కావాలని మరిచిపోతున్న అంశం ఒకటుంది.

ఈ జాబ్ క్యాలెండర్ కేవలం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది మాత్రమే. 2021-22 నోటిఫికేషన్ మాత్రమే. కొత్త ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మళ్లీ కొత్త ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్ లో కొత్త డిపార్ట్ మెంట్లు చేరుతాయి. ఇప్పుడు ''నిరుద్యోగులు'' ఏఏ డిపార్ట్ మెంట్లు/రంగాల్లో ఉద్యోగాలు లేవని ఆందోళనలు చేస్తున్నారో ఆ ఉద్యోగాలన్నీ రాబోయే రోజుల్లో వస్తాయి.
 
ఇదేదో ఈ ఏడాదితో అయిపోయేది కాదు. చంద్రబాబు జమానాలా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే వ్యవహారం కూడా కాదు. జగన్ ఇంకా అధికారంలో ఉంటారు, ప్రజల ఆశీస్సులతో ఎప్పటికీ అధికారంలో కొనసాగుతూనే ఉంటారు. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లు ఏటా వస్తూనే ఉంటాయి. అన్ని డిపార్ట్ మెంట్లు యాడ్ అవుతూనే ఉంటాయి. చంద్రబాబు హయాంలో ఉద్యోగాల్లేక, అంతకు ముందు కూడా నోటిఫికేషన్లు రాక అల్లాడిన నిరుద్యోగులు, ఇంకాస్త సమయం ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు?

చాలా డిపార్ట్ మెంట్లలో ఖాళీలు ఉన్న మాట వాస్తవమే. ఆ మేరకు రంగాల వారీగా కొంతమంది చెబుతున్న లెక్కలు కూడా కరెక్టే. అంతమాత్రానికే అవన్నీ ఒకే నోటిఫికేషన్ లో ఇచ్చేయమంటే ఎలా? రాష్ట్ర ఆర్థిక స్థితి చూసుకోవాలి కదా. పైగా ఉద్యోగాలన్నీ గంపగుత్తగా ఇచ్చేస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. 

ప్రతి రంగంలో ప్రాధాన్యత ప్రకారం భర్తీ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడమే జగన్ చేసిన తప్పు అన్నట్టు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

కేవలం జాబులు మాత్రమే ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు 14 శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగుల వేతనాల్ని పెంచారు. అన్నింటికీ మించి 51,387 మంది ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వాళ్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచారు. అలా 7 లక్షల మందికి పైగా ఉద్యోగులు లబ్ది పొందారు. 

ఈ విషయాలు మరిచిపోతే ఎలా? పోనీ ప్రభుత్వం నుంచి చేస్తున్న పనుల్ని కాసేపు పక్కనపెడదాం.. వచ్చే ఆర్థిక సంవత్సరం భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాల్ని కూడా జాబ్ క్యాలెండర్ కంటే ముందే ప్రకటిస్తామని జగన్ స్పష్టంచేశారు కదా. అప్పటివరకు కూడా  ఆగలేకపోతున్నాయి ప్రతిపక్షాలు.

ఇప్పుడు ఆందోళన చేస్తున్న కొంతమంది నిరుద్యోగులు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిపక్షాల ట్రాప్ లో పడకుండా తమ ప్రిపరేషన్ ను కొనసాగించాలి. కాస్త అటుఇటు ఆలస్యమైనా వాళ్లు ఎదురుచూస్తున్న జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ కచ్చితంగా వస్తుంది. రాష్ట్రంలో ఈ నెల నుంచి జాబ్ నోటిఫికేషన్లు మొదలుకాబోతున్నాయి. 

అవినీతి, వివక్షకు తావులేకుండా, ఇంటర్వ్యూలు రద్దు చేసి మరీ, అత్యంత పారదర్శకంగా జగన్ సర్కారు ఉద్యోగాలు భర్తీచేయబోతోంది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ జగన్ వచ్చిన తర్వాతే జాబులొస్తున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది పచ్చి నిజం.