ఏ వేదికమీద మాట్లాడుతున్నాను.. సభికులు ఎవరు, వారి స్థాయి ఏమిటి.. అనే అంశాలను బట్టి.. తన ప్రసంగాన్ని సమూలంగా డిజైన్ చేసుకునే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే ఇటీవలి కాలంలో ఆయన కాస్త గాడి తప్పిపోయినట్లున్నారు. ఏ వేదిక ఎక్కినా ఒకటే మాట మాట్లాడుతున్నారు.
మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్నదేమో అనిపిస్తోంది. చిన్నదా పెద్దదా, సభ ఎలాంటిది? అనేవేవీ పట్టించుకోకుండా.. ఎక్కడ మైకు ముందు మాట్లాడే సందర్భం దొరికినా.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి చురకలు అంటించేలా.. మాట్లాడుతూనే ఉన్నారు. వేదిక ఏదైనా మైకు దొరికితే చాలు.. బిజెపి మీద విసుర్లు పడాల్సిందే.
తాజాగా మేడ్చల్ కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాధారణంగా తమ ప్రభుత్వం ఘనతను మాత్రం చాటుకోవాల్సిన కార్యక్రమం అది. కానీ.. యథోరీతిగా.. బిజెపి మీద విసుర్లకు కూడా తన ప్రసంగంలో బాగానే సమయం కేటాయించారు.
భారతదేశాన్ని కులం మతం పేరుతో విడదీయడానికి ప్రయత్నం జరుగుతున్నదని కేసీఆర్ అన్నారు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టమని కూడా చెప్పారు. తెలంగాణ పల్లెలు, బస్తీల్లో కూడా దేశంలో జరుగుతున్న పరిణామాల మీద చర్చ జరగాలని, ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపు ఇచ్చారు. ప్రజల్లో చైతన్యం అంటే.. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం అనేది కేసీఆర్ నిర్వచనం కావొచ్చు.
ఈ రాజకీయ విమర్శలన్నిటినీ పక్కన పెడితే కేసీఆర్ మరో అద్భుతమైన మాట కూడా అన్నారు. ‘‘చైనా మాదిరిగా అందరూ కులమత రహితంగా ముందుకు సాగాలి’’ అని! కులరహిత సమాజాన్ని స్వప్నించేంత దార్శనికత కేసీఆర్ కు ఉన్నదా? నిజమేనా?
కుల ప్రాతిపదికను ప్రధానంగా ఎంచుకోకుండా.. ఆయన రాజకీయం చేస్తున్నారా? అభ్యర్థుల ఎంపిక జరిగినా, మంత్రి పదవుల వంపిణీ జరిగినా? కులాలవారీగా లెక్కలు కట్టి.. సమన్యాయం చేశాం అని డప్పు కొట్టుకోవడం లేదా? సామాజిక న్యాయం అనే పదం ముసుగులో కులాలకు పెద్దపీట వేస్తున్న వ్యవస్థలే మనకు ఉన్నాయి గానీ.. కులాలతో నిమిత్తం లేకుండా సమర్థతకు పట్టం కట్టే సందర్భాలు అసలు మనకు తెలుసా?
కులాలు మతాల వారీగా తాయిలాలు ప్రకటించి, మతాల వారీగా స్థిరమైన ఓటు బ్యాంకులను తయారు చేసుకునే అలవాటు, కోరిక తనకు లేదని ఆత్మసాక్షిగా కేసీఆర్ చెప్పగలరా? ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు.
బిజెపిని నిందించడానికి కుల మత రహిత సమాజమనే పడికట్టు పదాలు వల్లించడానికి పరిమితం కాకుండా, అలాంటి సమాజాన్ని ఆవిష్కరించడంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపితే కేసీఆర్ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.