తన తండ్రి తరహాలో బాలీవుడ్ లోనూ ఉనికిని చాటాలని అనుకున్నాడో ఏమో కానీ.. నాగచైతన్య బాలీవుడ్ ప్రయత్నం అయితే లాంఛనంగా జరిగింది. ఈ తరం బాలీవుడ్ సినిమాల ట్రెండ్ కు తగ్గట్టుగా మల్టీస్టారర్ సినిమాలో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
సోలోగా హీరోగా చేస్తానంటూ నాగార్జున తనయుడి సినిమాకు అక్కడ మార్కెట్ ఏమీ ఉండదు. ఆమిర్ ఖాన్ వంటి హీరో సినిమా కాబట్టి.. ఓ మోస్తరు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించినా మంచి గుర్తింపు దక్కుతుంది. పబ్లిసిటీ దశలోనే చైతూ గురించి అక్కడి మీడియా కూడా బోలెడంత రాసింది.
తనకు ఎలాంటి సినిమా అయితే అక్కడ మంచి గుర్తింపును ఇస్తుందో సరిగ్గా అలాంటి సినిమానే నాగచైతన్యకు దక్కింది. అయితే.. ఆ సినిమా మాత్రం సరిగా ఆడటం లేదు. ఇదే అతి పెద్ద సెట్ బ్యాక్. అయితే బాలీవుడ్ మీడియాలో నాగార్జున తనయుడి పేరు నానుతోంది. సమంతతో విడాకుల అంశం కూడా బాలీవుడ్ మీడియాను బాగా అట్రాక్ట్ చేసింది. ఇదే సమయంలో భారీ బడ్జెట్ సినిమాలో నటించడం నాగార్జున తనయుడికి మరింత గుర్తింపును ఇచ్చింది.
ఈ సినిమా పోయినంత మాత్రానా నాగచైతన్య బాలీవుడ్ ప్రయత్నాలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కూడా. సదరు బాలీవుడ్ సినిమాలకు సౌత్ లో కాస్తో కూస్తో మార్కెట్ ను సంపాదించుకోవడానికి కూడా చైతన్య వంటి హీరోల అవసరం ఉండవచ్చు.
గతంలో నాగార్జున శివ హిట్ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా బాలీవుడ్ ప్రయత్నాలు చేశాడు. శివ రీమేక్ తో హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత స్ట్రైట్ హిందీ సినిమాల్లో కొన్నింటిలో నటించాడు. అడపాదడపా నాగార్జున ప్రయత్నాలు కొనసాగాయి. ఈ హీరో సినిమాలు హిందీలోకి డబ్ అవుతూ కూడా వచ్చాయి. మహేశ్ భట్ క్యాంపులో నాగార్జున సినిమాలు హిందీలో వచ్చాయి. అయితే ఒక దశలో హిందీ వైపు తొంగిచూడటాన్ని మానేశాడు నాగార్జున.
అయితే మాస్, డాన్ వంటి సినిమాలు హిందీ డబ్బింగ్ లో టీవీ చానళ్లలో వందల సార్లు ప్రదర్శితం అయ్యాయి. ఇలా నాగార్జున డబ్బింగ్ సినిమాల పరంపర కొనసాగింది. ఈ మధ్య మళ్లీ అక్కడి సినిమాలకు నాగార్జున ప్రాధాన్యతను ఇస్తున్నట్టున్నాడు. మరి చైతన్య బాలీవుడ్ ప్రయత్నాలు ముందు ముందు ఎలా ఉంటాయో!