ఫాంటసీ సినిమాల్లో డ్రాగన్స్ వుంటాయి. అవి నోటితో మంటలు ఊదుతాయి. తోకతో కొడతాయి. గోళ్లతో రక్కుతాయి. నోటితో కరుస్తాయి. వాటిని ఎదిరించాలంటే హీరోకి మంత్ర శక్తులుండాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రేక్షకులు కూడా డ్రాగన్స్‌లా విరుచుకుపడుతున్నారు. పెద్దపెద్ద సినిమాల్ని కూడా ఈడ్చి తంతున్నారు. హెవీ బడ్జెట్లు, హీరోలు దేన్నీ లెక్కచేయడం లేదు. చితకబాదుతున్నారు. దీన్ని తట్టుకోవాలంటే సినిమా స్టైలే మారాలి. కథలు మారాలి. ముఖ్యంగా హీరోలు మారాలి. తాము కనపడితే విజిల్స్ వేసి, రంగు కాగితాలు గాల్లోకి విసిరే ప్రేక్షకుడు మాయమై, తెలివైన ప్రేక్షకుడు తయారవుతున్నాడని తెలుసుకోవాలి.
టికెట్ రేట్స్ తగ్గించామన్నా పట్టించుకోడు. ప్రమోషన్స్‌లో ఆహా ఓహో అని జబ్బలు చరిస్తే నమ్మడం లేదు. కనీసం ఫస్ట్ డే కూడా మోసపోవడం లేదు. లాభాల సంగతి దేవుడెరుగు, కనీసం కరెంట్ ఖర్చులు వస్తే చాలని థియేటర్ ఓనర్లు అనుకునే పరిస్థితి తెచ్చాడు.
అమీర్‌ఖాన్ సినిమా వస్తే ఒకప్పుడు హైదరాబాద్‌లో సందడి. ఫస్ట్ డే క్యూలో నిలబడి బ్లాక్‌లో కొని చూసేవాళ్లు. మొన్న లాల్సింగ్ని పట్టించుకున్న వాళ్లు లేరు. అక్షయ్‌కుమార్ రక్షాబంధన్ ఇంకా ఘోరం. దేశమంతా ఇదే స్థితి. మన తెలుగులో రామారావు, థ్యాంక్యూ, వారియర్, మాచర్ల తుస్సుమన్నాయి. సీతారామం, బింబిసార, కార్తికేయ-2 నిలబడ్డాయి. కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూడు సినిమాల్లో రొటీన్ బిల్డప్‌లు లేవు. హీరోయిజం ఓవరాక్షన్ లేదు. ఉన్నదల్లా గట్టి కథ, స్క్రీన్ ప్లే. ప్రేక్షకున్ని సీట్లో కూచోపెట్టాయి. మిగిలిన సినిమాలు ఎందుకు పల్టీ కొట్టాయో వివరించాల్సిన పనిలేదు.
రాంగ్ ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే క్రిమి సంహారకానికి మందు వాడుతారు. అయితే ఆ మందు ఏళ్ల తరబడి వాడితే క్రిమిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మందు పని చేయదు. ప్రేక్షకుల స్థితి కూడా ఇదే. ఇన్నాళ్లు నువ్వు వాడుతూ వచ్చిన ఫార్ములా సినిమాలు పని చేయవు. కొత్తవి కావాలి. కొత్తదనం కావాలంటే ముందు హీరోలు, దర్శకులు మారాలి. కథలో సాధన, శోధన, తపస్సు వుండాలి. మనకు అంత టైమ్ లేదు. హీరోకి నచ్చితే చాలు. పాప్‌కార్న్, పీచుమిఠాయి కథలతో లండన్, న్యూయార్క్‌ల్లో లాగించేస్తారు. వంకాయి బాంబు అంత సౌండ్ వస్తుందని చెబుతారు. కనీసం సీమ టపాకాయి సౌండ్ కూడా రాదు. జనం థియేటర్లకి రారు.
మన హీరోల సమస్య ఏమంటే వీళ్లలో చాలా మందికి కథల జడ్జిమెంట్ రాదు, తెలియదు. ఆ విషయం వాళ్లకి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కారణం వాళ్లు అద్దాల మేడల నుంచి బయటికి రారు. చుట్టూ వున్న భజన బృందం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. దర్శకులే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే తప్ప రంగస్థలం, పుష్ప లాంటి డిఫరెంట్ సినిమాలు రావు.
తరాలు మారినట్టే ప్రతి ఐదేళ్లకోసారి సినిమా తన రూపాన్ని మార్చుకుంటుంది. కరోనాతో ఈ వేగం పదింతలైంది. ప్రపంచంలో కొత్త అంశాలతో వస్తున్న వెబ్‌సిరీస్ సినిమాలు ప్రేక్షకులకి అర్థమయ్యాయి. అదే కొత్తదనాన్ని మన సినిమాల నుంచి కూడా కోరుకుంటున్నారు. ఇస్తే థియేటర్ మొహం చూస్తున్నారు. లేకపోతే లేదు. థియేటర్‌కి ప్రేక్షకుల అవసరం వుంది కానీ, ప్రేక్షకుడికి ఇప్పుడు థియేటర్ అవసరం లేదు.
సినిమా బతకాలంటే కథే ఆక్సిజన్ అని అర్థమైతే ఆట ఇంకొంత కాలం నడుస్తుంది. లేదంటే ఇంటర్వెల్‌కే శుభం కార్డు పడిందని అనుకుని జనం వెళ్లిపోతారు.
జీఆర్ మహర్షి