సీఎంకు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి కోల్‌క‌తా హైకోర్టు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. దీనికి కార‌ణ‌మేంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి కౌశిక్‌చందాకు బీజేపీతో స‌న్నిహిత‌ సంబంధాలున్నాయ‌ని, త‌న వ్యాజ్యాన్ని ఆయ‌న విచారించ‌కూడ‌ద‌ని మ‌మ‌తాబెన‌ర్జీ…

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి కోల్‌క‌తా హైకోర్టు రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. దీనికి కార‌ణ‌మేంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి కౌశిక్‌చందాకు బీజేపీతో స‌న్నిహిత‌ సంబంధాలున్నాయ‌ని, త‌న వ్యాజ్యాన్ని ఆయ‌న విచారించ‌కూడ‌ద‌ని మ‌మ‌తాబెన‌ర్జీ డిమాండ్ చేయ‌డ‌మే నేర‌మైంది. దీన్ని స‌ద‌రు న్యాయ‌మూర్తి కౌశిక్ సీరియ‌స్‌గా తీసుకుని, త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన సీఎంకు జ‌రిమానా విధించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిది.

కోల్‌క‌తా హైకోర్టు శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా కౌశిక్ చందా నియామ‌కాన్ని త‌ప్పు ప‌డుతూ, ఆయ‌కు బీజేపీతో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ మేర‌కు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జ‌స్టిస్‌కు ఆమె లేఖ రాశారు. ఆ త‌ర్వాత నందిగ్రామ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, ఓట్ల లెక్కింపుల్లోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ ఇటీవ‌ల మ‌మ‌తాబెన‌ర్జీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇది విచార‌ణ నిమిత్తం కౌశిక్ చందా ధ‌ర్మాస‌నానికి వెళ్లింది. దీంతో మ‌రోసారి ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కౌశిక్‌కు బీజేపీతో సంబంధాలున్నాయ‌ని, ఆయ‌న విచారిస్తే త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌దంటూ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు మ‌మ‌తాబెన‌ర్జీ ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో నేడు ఆ కేసును కౌశిక్ విచార‌ణ చేప‌ట్టారు.  

ఇలా ప్ర‌తి ఒక్క‌రి మీద ఆరోపిస్తూ, న్యాయ వ్య‌వ‌స్థ మీద దాడి చేస్తూ పోతే, న్యాయ ప‌ర‌మైన కార్య‌క‌లాపాల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని జ‌డ్జి కౌశిక్ అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశారంటూ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీకి రూ.5 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సొమ్మును కోవిడ్ బాధితులైన న్యాయ‌వాద కుటుంబాల‌కు వినియోగిస్తామ‌న్నారు.  

త‌న వ్య‌క్తిగ‌త అభీష్టం మేర‌కు కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు జ‌డ్జి ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం. నిన్న తెలంగాణ హైకోర్టులో కూడా ఇదే ర‌క‌మైన వాతావ‌ర‌ణం నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. రామ‌చంద్ర‌రావు అనే న్యాయ‌మూర్తిని నీటి ప్రాజెక్టుల విచార‌ణ నుంచి త‌ప్పుకోవాల‌ని తెలంగాణ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ కోర‌వ‌డంపై హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.