‘‘రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదని మా భూలోకంలో సామెత. స్వర్గానికి వచ్చినా యీ చాకిరీ తప్పక పోవడమేమిటి?’’ అని అరుణ్ కుమార్ కాస్త గట్టిగానే అడిగాడు. ‘‘ఇక్కడ నియమాలు చెప్పాను. కావాలంటే పర్యవేక్షకుణ్ని అడుగు’’ అన్నాడు యితనికి పని బెత్తాయించిన మేస్త్రీ. ఇంతలో ఆయనే అక్కడకు వచ్చాడు. ‘‘విషయం ఏమిటి?’’ అని అడుగుతూ.
అరుణ్ కుమార్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘‘నేను చచ్చిపోయి ఐదేళ్లయిందండి. చిత్రగుప్తుల వారు పాపపుణ్యాల లెక్కలు వేసి నాకు ఐదేళ్లు నరకవాసం, రెండేళ్లు స్వర్గవాసం ఉందన్నారు. వారం పోయాక నరకయాతన భరించలేక ‘రెండూ అడ్జస్టు చేసి మొత్తం మీద మూడేళ్ల నరకవాసం చేయండి’ అని అడిగానండి. ‘అలా కుదరదు, దేని ఖాతా దానిదే. రెండూ అనుభవించాల్సిందే’ అన్నారు. సరే చివర్లో రెండేళ్ల స్వర్గవాసం ఉంటుంది కదాన్న ఆశతో అయిదేళ్లూ నరకంలో పెట్టిన బాధలన్నీ భరించానండి..’’
‘‘..సరే, స్వర్గానికి వచ్చావు కదా, యింకా ఏమిటి నీ ఫిర్యాదు? రెండేళ్ల దాకా ఎవరూ నిన్ను పొమ్మనరు, సరేనా?’’ అన్నాడు పర్యవేక్షకుడు చికాగ్గా. ‘‘స్వర్గంలో ఉండడం అంటే హాయిగా తింటూ, తాగుతూ, తిరుగుతూ ఉండడమే అనుకున్నానండి. చూస్తే ఈయన నేను రోజూ చేయవలసిన పనులంటూ అంటూ పెద్ద జాబితా చదువుతున్నాడండి..’’ ‘‘..అవును మరి, పనులు చేయకపోతే ఎలా?’’ ‘‘ఇదెక్కడి అన్యాయమండీ, స్వర్గానికి వచ్చినది పనులు చేయడానికా!?’’ ఈసారి అరుణ్ గద్దించే అడిగాడు.
ఆయన యితన్ని చూసి జాలిపడ్డాడు. ‘‘ఇలా కూర్చో’’ అని సింహాసనం ఒకటి చూపించాడు. తను పక్కనే ఉన్న మరో సింహాసనంపై కూర్చున్నాడు. నెమ్మదిగా సంభాషణలోకి దించాడు – ‘‘నువ్వు భూలోకంలో ఉండగా పౌరహక్కుల ఉద్యమనేతవు కదా!’’ అని అడిగాడు. ‘‘ఔను.’’ ‘‘అందుకే నీకు ప్రశ్నించే గుణం బాగా అబ్బింది..’’ ‘‘..నరకంలోనూ అదే మాట అనేవారు. మనిషి చచ్చిపోగానే ఆ గుణాలూ, వాసనలూ భూమిమీదే వదిలేసి వస్తాడంటారు!?’’
‘‘ఎవరా అన్నది? ఇక్కడి వ్యవహారాలు తెలిసినవాళ్లెవరూ అలా అనరు. భూలోకవాసులు తమ గుణాలు, జ్ఞాపకాలు అన్నీ వెంటపెట్టుకునే వస్తారు. నరకంలో బాధలు పెడుతున్నపుడు ‘ఫలానా పని చేసినందుకు యిలా అనుభవిస్తున్నాను’ అని తెలియాలి కదా! అలాగే స్వర్గంలో హాయిగా కూర్చున్నపుడు ‘ఫలానా మంచి పని చేశాను కాబట్టి..’ అనుకోవాలి కదా. అయితే మళ్లీ భూలోకానికి పంపినప్పుడు యిక్కడి అనుభవాల జ్ఞాపకాలు, పూర్వజన్మసృతులు వెంట పెట్టుకుని వెళ్లనీయరు. దీని సారాంశాన్ని చిన్న చిప్‍లో పెట్టి శరీరంలో అమరుస్తారు. దానికే నరులు వివేకం అని పేరు పెట్టారు. ‘ఇది మంచి, ఇది చెడు’ అని నా మనస్సాక్షి చెపుతోంది, అంతరాత్మ చెపుతోంది అంటూంటారు చూడు, దానికి కారణం ఆ చిప్!’’
‘‘స్వర్గంలో మా చేత నానా చాకిరీ చేయించిన విషయం మాత్రం గుర్తు లేకుండా చేస్తారు కాబోలు. దాన్తో స్వర్గసుఖాలంటూ ఏవో ఉంటాయి అని మేం భూలోకంలో కలలు కంటూనే ఉంటాం.’’ ఆయన కోపం తెచ్చుకోలేదు. ‘‘అవును, అలా చేయకపోతే యిక్కడ వర్క్‌ఫోర్స్ ఎలా వస్తుంది చెప్పు మరి.’’ అన్నాడు చిరునవ్వుతో. ‘‘అసలు యిక్కడ పనేముంటుందండి, చెయ్యడానికి? ఎంతసేపూ హాయిగా తిరగడమేగా, అదేగా స్వర్గమంటే..’’ అన్నాడు అరుణ్ విస్మయంగా.
‘‘అలా అడుగు చెప్తాను. నువ్విప్పుడు సింహాసనం మీద కూర్చున్నావా? అది శుభ్రంగా, తళతళలాడుతూ ఉందా?’’
‘‘ఉంది. స్వర్గం కదా! ఇలాగే ఉండాలి. అదే నరకం అయితే ముళ్లకంపల మీద కూర్చోమనేవారు.’’
‘‘సరిగ్గా చెప్పావ్. స్వర్గం అంటే ఒక స్థాయి మేన్‍టేన్ చేయాలి. ఆ సింహాసనం ఎందుకలా మెరుస్తోంది? ఎవరో ఒకరు దాన్ని రోజూ తోముతున్నారు కదా! వారానికి ఓ సారి పాలిష్ చేస్తున్నారు కదా! రోజూ నక్షత్ర ధూళి దాని మీద పడుతూంటే పొద్దున్నా, సాయంత్రం దాన్ని తుడవాలి కదా!’’ అరుణ్ నోరు తెరిచాడు.
ఆయన కొనసాగించాడు. ‘‘ఇంద్రసభ చూశావ్. పెద్ద పెద్ద తెల్ల స్తంభాలుంటాయి, వాటికి తీగలు అల్లుకుని ఉంటాయి, కప్పు లేకుండా పైన నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. మరి స్తంభాలకు రంగులేయాలిగా, వాటికి తీగలు చుట్టాలిగా, నక్షత్రాలను రోజూ రుద్దుతూ ఉండాలిగా, లేకపోతే డల్‍గా అయిపోతాయి… సినిమాల్లో చూసి ఉంటాయి. దేవతలు దోసిళ్లలో పూలు పట్టుకుని నిలబడతారు. ఎవరైనా గొప్ప పని చేయగానే పుష్పవృష్టి కురిపిస్తారు. వాళ్ల దోసిళ్లలోకి పువ్వులు ఎలా వస్తాయి? పూల చెట్లు పెంచాలి, పువ్వులు కోయాలి, పళ్లాలలో అమర్చి దేవతలకు అందించాలి. అలాగే వాళ్ల కిరీటాలు తోమాలి. తెల్లటి పంచెలు, జుబ్బాలు ఉతకాలి. ఇవన్నీ చేయకుండా స్వర్గం ఎలా శోభిస్తుంది?’’
అరుణ్ మొహం ఎర్రబడింది. ‘‘ఇవన్నీ ఆటోమెటిక్‍గా జరుగుతాయనుకున్నా.’’ ఆయన చికాకు పడ్డాడు. ‘‘ఆటోమెటిక్‍గా జరిగేవాటికి కూడా మరమ్మత్తులుంటాయి కదయ్యా. పుష్పక విమానం దానంతట అదే ఎగురుతుంది. అంతమాత్రం చేత దానికి ఓవరాలింగ్ అక్కరలేదా? దానిలో వేసే పరుపులు, పక్కలు వాటంతట అవే పుడతాయా? దానిలో ఉండే మద్యశాలలో మధువు దానంతట అదే ఊరుతుందా? ఎవరో ఒకరు పాత్రల్లో నింపాలి కదా..’’
అరుణ్‍కి విషయం బోధపడింది. భూలోకంలో లాగే యిక్కడ కూడా పెద్ద యంత్రాంగం నడుస్తోంది. పని చేసేవాళ్లు, పని చేయించేవాళ్లు, అజమాయిషీ చేయించేవాళ్లు, సమీక్షించేవాళ్లు.. యిలా. దీనిలో తన బోటివాళ్లు అట్టడుగు వర్గం. ఇక్కడ కూడా వర్గభేదాలు, పెత్తందారీ విధానం ఉన్నట్టున్నాయి. ‘‘మరి ముక్కోటి దేవతలు ఏమీ చేయరా?’’ అని అడిగాడు ఉక్రోషంతో.
‘‘మొదటగా తెలుసుకోవలసినది దేవతల సంఖ్య ముక్కోటి కాదు. ఎప్పటిదో అంకె పట్టుకుని అదే జపించకు. అక్కడ భూలోకంలో మీరు ఎన్ని రెట్లు పెరిగారు? ఇక్కడ వాళ్లు మాత్రం ఖాళీగా కూర్చుంటారా? కోట్లాది దేవతలున్నారు. వాళ్లు ఏమీ చేయరా? అని కదా నీ ప్రశ్న. చెప్పానుగా, పువ్వులు దోసిళ్లలో పట్టుకుని నించోవడం, రంభాది అప్సరసలు నృత్యాలు చేస్తూంటే, నారదాదులు వీణ వాయిస్తూంటే భేష్, భేష్ అనడం, ఎవరైనా తమ గురించి యాగాలు చేస్తూ ఉంటే హవిస్సు లందుకుని తమలో తాము పంచుకోవడం, ఎవరైనా తపస్సు చేస్తూంటే, సరైన గెటప్‍లో ప్రత్యక్షం కావడానికి, దుస్తులూ అవీ…’’
‘‘ఇక ఆపండి. వాళ్ల షోకుల కోసం మేం శ్రమించాలన్నమాట. స్వర్గానికంటూ వచ్చాక అందరూ సమానమే. ఇక్కడ కూడా పల్లకీ ఎక్కేవాళ్లు, మోసేవాళ్లూ అంటూ వివక్షత చూపించడం ఏమీ బాగా లేదు. అసలు మీకూ, మాకూ తేడా ఏమిటి?’’ ఆయన కాస్త కంగారుపడ్డాడు. ‘‘చూడు బాబూ, నేను దేవతల్లో ఒకణ్నని పొరబడుతున్నావులా ఉంది. దేవతలంటే ఇంద్రుడికి బంధువులు, సన్నిహితులు. నేనూ నీలాటి వాణ్నే. ఎటొచ్చీ ఎక్కువ పుణ్యాలు చేయడం వలన, పాతికేళ్ల స్వర్గవాసం దఖలు పడి నాకీ పదవి దక్కింది. ఇదిగో యీ మేస్త్రీది పదేళ్ల టెర్మ్. అంతకంటె తక్కువైతే మీ కేటగిరీ అన్నమాట. మాకు పదవులంటూ ఉన్నాయి కానీ పని పనే కదా! ఏ పనీ చేయనక్కరలేని వాళ్లు దేవతలు. తక్కిన వాళ్లందరూ కూలీలే. చిన్న కూలీయా, పెద్ద కూలీయా అనేదే తేడా.’’
అరుణ్‍కు పట్టుదల పెరిగింది. ‘‘రాకరాక స్వర్గానికి వస్తే, యీ చాకిరీ ఏమిటి నాన్సెన్స్! భూలోకంలో కష్టపడి, యమలోకంలో యాతన పడి, యిక్కడా రెక్కలు ముక్కలు చేసుకోవాలా? నేను చేయను. వేరే ఎవర్నీ చేయనివ్వను.’’ అని ప్రకటించాడు. మధ్యాహ్నాని కల్లా అందరూ పని మానేశారు. మేస్త్రీలు కూడా వాళ్లతో చేతులు కలిపారు. పర్యవేక్షకులు మాత్రం తటస్థంగా ఉన్నారు. దేవతలు ఆందోళన పడ్డారు. రెండు రోజులు పోయేసరికి ఇంద్రుడికి ఫిర్యాదు చేశారు. ‘‘మీరు వచ్చేవారంలోనే విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకునే కార్యక్రమం పెట్టారు. సరైన గుడ్డలు లేవు. ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, కిరీటాల్లో రాళ్లు ఊడిపోయాయి, అతికించాలి. ఇవన్నీ మేం ఎన్నడూ చేసి ఎరగం. ఇలా అయితే మీరొక్కరే వెళ్లి విష్ణుమూర్తి గారిని కలవాల్సి వస్తుంది.’’ అని బెదిరించారు కూడా.
ఆ సాయంత్రమే ఇంద్రుడు అరుణ్‍ని పిలిపించాడు. అప్పటికే వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకున్న అరుణ్ తన ప్రతిపాదనను సూటిగా ఆయన ముందు ఉంచాడు. ‘’స్వర్గంలో పనులు ఉంటాయి, ఎవరో ఒకరు చేయాల్సిందే, ఒప్పుకుంటా, కానీ ఎప్పుడూ మేమే ఎందుకు చేయాలి? దేవతలనూ చేయమనండి. అందరం కలిసి ఆడుతూ, పాడుతూ పని చేసుకుందాం.’’ అని.
ఇంద్రుడు తృళ్లిపడ్డాడు – ‘‘దేవతలు పని చేయడమా!? చాల్లే, ఎవరైనా వింటే నవ్విపోతారు. బోల్డంత పుణ్యం వాళ్ల ఖాతాల్లో జమై ఉంది. భూలోకవాసులు చేసే ప్రార్థనలతో, యిచ్చే హవిస్సులతో అది మరింత పెరుగుతూ పోతోంది. వాళ్లు కానీ వాళ్ల పిల్లలకు కానీ శాపవశాన భూలోకంలో పుట్టినా, యీ పుణ్యం కారణంగా ధనవంతులుగా పుడుతున్నారు. ఆ ధనంతో దానాలు చేసి, మరింత పుణ్యం సంపాదించుకుని స్వర్గానికి వస్తున్నారు. ఆ విధంగా వాళ్లు, వాళ్ల పిల్లలు అందరూ తరతరాలుగా యిక్కడే ఉండిపోతున్నారు…’’
‘‘…వాళ్లయితే శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. మేమైతే రెండు, మూడేళ్లు ఉండి వెళ్లిపోతాం. ఆ కొద్దికాలం కూడా మాకు తీరిక కల్పించకపోతే స్వర్గం గురించిన మధుర జ్ఞాపకాలు ఏం మిగులుతాయి? ఇక్కడి విషయాలు, అంటే మేం అవస్తలు పడిన సంగతి మాకు గుర్తు లేకుండా చేసి పంపుతున్నారు. కానీ భూలోకంలో ఏ ఒక్క మేధావైనా మీరు పెట్టిన చిప్‍ను డీకోడ్ చేస్తే స్వర్గలోకం బండారం మొత్తం బయటపడుతుంది. ఇక భూలోకవాసులు కష్టపడి పుణ్యాలు చేయరు, స్వర్గానికి ఎవడూ రాడు, మీకు కార్మికులు లేకుండా పోతారు. అప్పుడు శాశ్వతంగా మీ పనులు మీరే చేసుకోవలసి వస్తుంది.’’ అన్నాడు అరుణ్.
ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. బృహస్పతిని, యితర ప్రముఖ దేవతలను సంప్రదించి, మర్నాటికి ఏ విషయం చెప్తానన్నాడు. మర్నాడు ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. భూలోకంలో లాగ యిక్కడా కరెన్సీ ప్రవేశపెడతారు. పని చేసినవాళ్లకు ఆ కరెన్సీలో వేతనాలు చెల్లిస్తారు. ఏడాది చివరకు ఆ కరెన్సీ పెట్టి స్వర్గలోకవాసాన్ని కొనుక్కోవచ్చు. ఆ విధంగా పని చేస్తున్న కొద్దీ స్వర్గలోకంలో ఉండే కాలం పెరుగుతూ పోతుంది. కాలం పెరిగిన కొద్దీ మేస్త్రీలుగా, పర్యవేక్షకులుగా ఎదుగుతూ పోతారు. 50 సంవత్సరాలు కాలపరిమితికి చేరినవారు దేవతలతో సమానమై పోతారు. ఇక పని చేయనక్కరలేదు.
‘‘కష్టపడేవాడికి లాభం చేకూరేట్లుగా చేశారు, మా వరకు బాగానే ఉంది. మరి దేవతల మాటేమిటి?’’ అని అడిగాడు అరుణ్. ‘‘ఇక మీద వాళ్లకు హవిస్సులు ఆపేసి, అవన్నీ నేనే పుచ్చుకుంటాను. వాళ్ల ఖాతాల్లో యిప్పటికే చాలా పుణ్యం ఉంది కదా, దాన్ని కూడా కరెన్సీలోకి మార్చేస్తున్నాను. వాళ్లూ మీతో పాటే పని చేస్తే ఖాతా నిలవ పెరుగుతుంది. పని చేయకుండా కూర్చుంటే ఖాతా నిలవ తరిగిపోయి వాళ్లూ పనిచేయాల్సిన స్థితి వస్తుంది.’’ ‘‘ఆ నిలవంతా తరగడానికి ఏళ్లూ, పూళ్లూ పడుతుంది. వాళ్లు అప్పటిదాకా కాళ్లు బారజాపుకుని కూర్చుంటారు. వాళ్ల చేత వెంటనే పని చేయించే విధానం చూడండి.’’
ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. చివరకు ‘‘ఓ పని చేస్తాను. నేను చిత్రగుప్తుడితో మాట్లాడి ఆ నిలవంతా మీ అందరికీ సమానంగా పంచమంటాను. ఉజ్జాయింపుగా తలా ఒకరికి 15 ఏళ్ల స్వర్గవాసం వస్తుందనుకుంటాను. అది వచ్చే లోపున మీరు మరింతగా కష్టపడి పని చేశారనుకోండి, ఒక పదేళ్ల స్వర్గవాసానికి విలువైన కరెన్సీ పోగేయవచ్చు. పాతికేళ్ల స్వర్గవాసం అంటే నీకు పర్యవేక్షకుడి పదవి సులభంగా వచ్చేస్తుంది. పని కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే యీ పథకం కారణంగా పని ఎగ్గొట్టేవాళ్లు ఎవరూ ఉండరు. ఎంత పని చేస్తే అంత లాభం కదా’’
అంతా విన్నాక అరుణ్ కాస్త సణిగాడు ‘‘పథకం బాగానే ఉంది కానీ దేవతలు పని చేయకుండా కూర్చోవడమే నాకు నచ్చలేదు.’’.
‘‘చూడు బాబూ, మార్పనేది వెంటనే రాదు, సమయం పడుతుంది. ఇవాళ్టికివాళ వాళ్లు పని చేయకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ల సంపదంతా తరిగిపోయి, వాళ్లే మీ యింటి ముందు క్యూలు కట్టి కరెన్సీ కోసం అడుక్కునే స్థితి వస్తుంది. మీరు స్వతహాగా కష్టజీవులు, చకచకా పని చేసి గబగబా భాగ్యవంతులు అయిపోతారు. ఒక్క ఏభై ఏళ్లు కళ్లు మూసుకుని కష్టాలు భరించండి, ఆ తర్వాత మీ బళ్లు ఓడలవుతాయి. నువ్వు ఒక్క జన్మ ముగించుకుని మళ్లీ వచ్చేసరికి దేవతలు దీపపు బుడ్లు తుడుస్తూ కనబడకపోతే నన్నడుగు.’’ అని ఇంద్రుడు అనునయించాడు.
‘‘దేవతలంతా మీకు బంధువులు, స్నేహితులు కదా. వాళ్లకు నష్టం కలిగించే పని చేస్తారంటే నమ్మబుద్ధి కావటం లేదు.’’ అన్నాడు అరుణ్ నిర్మొగమాటంగా. ‘‘దేవతల జాతిలో పుట్టడం నా దురదృష్టం. అందుకే యిలాటి సందేహాలకు సమాధానం చెప్పవలసి వస్తోంది. నేను వాళ్లకు చెప్పి చూశాను – రోజులు మారుతున్నాయి, కాస్తయినా ఒళ్లొంచి పని చేయండిరా బాబూ అని. విన్నారు కాదు. వాళ్ల పుణ్యాన వాళ్లే పోతారులే అని ఊరుకున్నాను. ఇదిగో నీలాటి వాడు వచ్చి నిలదీశాడు. రెండు రోజులుగా అల్లల్లాడి పోతున్నారు. నేనేం చెప్పినా నోరెత్తకుండా వింటారు. నీకా భయం లేదు.’’ అని ఇంద్రుడు హామీ యిచ్చాడు.
దానితో బాటు ‘‘నీకో రహస్యం చెపుతాను విను, ప్రస్తుతం నా రాజ్యంలో పనిచేసేవాళ్లు తక్కువ, సేవలందేవాళ్లు ఎక్కువ. నీ ధర్మాన ఆ పరిస్థితి మారి వర్క్‌ఫోర్స్ పెరిగి, అందరూ పని పంచుకుంటే నా కంటె సంతోషించేవాళ్లు ఇంకోళ్లు ఉండరు. ఖాళీగా కూర్చుంటేనే ఫిర్యాదులు ఎక్కువ చేస్తారు. పేచీలు పడుతూంటారు. అందరూ ఎంతోకొంత పనిలో మునిగితే నాకు శాంతిగా ఉంటుంది. అప్పుడు నేను నీకు ధన్యవాదాలు చెప్పాల్సి వుంటుంది.’’ అనడంతో అరుణ్ ఉబ్బిపోయాడు. ‘అదే కదండీ, నా తాపత్రయం కూడాను..’ అంటూ నమస్కరించి లేచి వచ్చేశాడు.
మర్నాటి నుంచి చేసిన పని బట్టి, గంట కింత అని వేతనాలు యివ్వసాగారు. ఆ నోట్లను ఎవరికి వారు దాచుకోసాగారు. అవి పోగు పడుతున్న కొద్దీ వేతనజీవులకు ఉత్సాహం పెరిగింది. ఎవరి అజమాయిషీ అక్కరలేకుండా ఒళ్లు విరుచుకుని పనిచేయసాగారు. స్వర్గం గతంలో కంటె ఎక్కువ మిలమిలా మెరవసాగింది. రెండేళ్లు తిరిగేసరికి అరుణ్ దగ్గర మరో రెండేళ్లకు సరిపడా కరెన్సీ పోగుపడింది. ఇంద్రుడు తమందరి పేర ఖాతా తెరిచి దానిలో వేస్తానన్న పదిహేనేళ్లు కూడా కలుపుకుంటే మేస్త్రీగా పని చేయవచ్చు కదా అనే ఆశతో ఉన్నాడు. కానీ ఆ పదిహేనేళ్ల సంగతీ ఎటూ తేలలేదు. గట్టిగా అడుగుదామంటే ఇంద్రుడి దర్శనం దొరకటం లేదు. ఎప్పుడడిగినా పరలోకాల పర్యటనలో ఉన్నారనే సమాధానం వస్తోంది. ఒకసారి ఆయన బంగళా తోటలో కొమ్మలు కత్తిరించే డ్యూటీ పడినపుడు చొరవ చేసి యింట్లోకి వెళ్లి అడిగేశాడు.
‘‘ఆ పని మీదే ఉన్నానయ్యా, ఆ చిత్రగుప్తుడు ఎప్పటికీ లెక్క తేల్చకుండా ఉన్నాడు. వివరాలు అడగడానికి నువ్వెవడివి, అది యమధర్మరాజుగారి పని కదా అని కొన్నాళ్లు సాగదీశాడు. అభ్యర్థన రాసి పంపితే చూస్తానని ఆర్నెల్లు పోయాక చెపితే, పంపించాను. మీది స్వర్గలోక భాష, మాది నరకలోక భాష, లిఖితపూర్వకంగా అభ్యర్థన యిచ్చినపుడు తర్జుమా ప్రతి కూడా జతపరచాలని పితలాటకం పెట్టాడు. మన దేవతలందరికీ కులాసాగా గడపడమే తప్ప యిలాటివి రావు. తర్జుమాదారులందరూ నరకంలో ఉన్నారట. వాళ్ల సేవలు ఉపయోగించుకోవాలంటే మరో అభ్యర్థన, అదీ నరకభాషలో రాయాలట. ‘అనుమతి లేనిదే లోపలకి రాకూడదు, లోపలకి వెళితే తప్ప అనుమతిపత్రం యివ్వరు’ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏదో ఒకటి చేయాలి. వెళ్లి మాట్లాడదామంటే నాకూ తీరిక లేకుండా ఉంది. ఇటీవలే కొత్త గ్రహమొకటి నివాసయోగ్యంగా ఉందట. వెళ్లి చూసి రావాలనుకుంటున్నాను. మన ఇంద్రలోక ప్రతిభ, నా కీర్తి విశ్వమంతా వ్యాపించాలంటే నాకీ తిరుగుళ్లు తప్పేట్లు లేదు.’’ అని ఇంద్రుడు వాపోయాడు.
‘‘సరే, అన్నీ తెలిసినవారు, మీరే ఏదో ఒకటి చేయండి’’ అని దణ్ణం పెట్టి వచ్చేశాడు అరుణ్.
అప్పణ్నుంచి యిప్పటివరకు ఆ 15 సంవత్సరాల పంపిణీ తేలలేదు. సరే ఇంకో రెండేళ్లు ఎలాగూ ఉంటాం కదా, ఆ లోపున రాకపోదా అనే ఆశతో ఉండగానే ఓ రోజు రాత్రి ఆకాశవాణి ద్వారా ఇంద్రుడి ప్రకటన వినవచ్చింది – ‘మన లోకంలో పని చేసినవాళ్లకు కరెన్సీ రూపంలో వేతనం యిస్తున్నామన్న వార్త నరకలోకానికి పొక్కింది. అక్కడి పాపులకు పాపిష్టి బుద్ధి పుట్టింది. మన కరెన్సీకి నకలుగా దొంగ కరెన్సీ తయారు చేశారు. అవి చూపించి మీ స్థానాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల ద్వారా తెలియవచ్చింది. అదే జరిగితే యిన్నేళ్ల మీ కష్టార్జితం వృథా అవుతుంది. మరేం చేయాలి…?’ అని ఇంద్రుడు అర్ధోక్తిలో ఆపాడు.
అరుణ్‍తో సహా అందరూ ఉగ్గబట్టుకుని వింటున్నారు.
‘‘..అందుకే నేను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ కరెన్సీని రద్దు చేస్తున్నాను… ఆగండి, హాహాకారాలు చేయకండి. మీ డబ్బు ఎక్కడికీ పోదు. స్వర్గలోకంలో తక్షణమే ఒక బ్యాంకు ప్రారంభిస్తున్నాం. దానిలో మీమీ పేర ఖాతాలు తెరవండి, వాటిలో యీ కరెన్సీ జమ చేసుకోండి. దీనికి వారం రోజులు మాత్రమే గడువుంది. నరకం వాళ్లు నకిలీ చేయలేని కొత్త కరెన్సీ ముద్రణ సాగుతోంది. మీ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని కొత్త కరెన్సీ రూపంలో తీసుకోవడానికి అనువుగా ‘సదా నగదు’ యంత్రాలను నెలకొల్పుతున్నాం. మీరు కొత్త కరెన్సీ కోసం బ్యాంకుకు రానక్కరలేదు, రాకూడదు కూడా. ఆ యంత్రాల్లో మీటలు నొక్కితే చాలు. ఈ రోజు మీరు తెరిచిన ఖాతాలు, భవిష్యత్తులో పదిహేనేళ్ల స్వర్గనివాసం మీ పేర జమచేయడానికి ఉపయోగపడతాయి కూడా. మీకు కొన్నాళ్లపాటు కొద్దిపాటి అసౌకర్యం కలగవచ్చు. కానీ ఓర్చుకోండి. మీ శ్రేయస్సు కోరే యీ భారీ పక్రియ మొదలుపెట్టామని గుర్తుంచుకోండి.’ అని తన ప్రసంగాన్ని ముగించాడు ఇంద్రుడు.
తమ కష్టార్జితం నరకంపాలు కాకుండా ఇంద్రుడు తీసుకున్న జాగ్రత్తను అందరూ హర్షించారు. బ్యాంకు ముందు వరుసలు కట్టి, మూడు రోజుల్లోనే తమ వద్ద ఉన్న కరెన్సీ యావత్తూ జమ చేసేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే వచ్చాయి కష్టాలు. కొత్త కరెన్సీ ముద్రణ పూర్తి కాలేదంటూ కొన్నాళ్లు తాత్సారం జరిగింది. ఆ తర్వాత ‘సదా నగదు’ యంత్రాలు పెట్టాం కానీ కొత్త నోట్లకు, వాటికీ జత కుదరలేదన్నారు. జత కుదిరిందని నమ్మకం చిక్కేసరికి ఆ యంత్రాలు పనిచేయడం మానేశాయి. ఒక రోజు చూసేసరికి అవన్నీ ముక్కలై ఉన్నాయి. కోపోద్రిక్తులైన కొందరు స్వర్గవాసులు వాటిని బద్దలు కొట్టారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకు వేతనాలను బ్యాంకు ఖాతాలోనే వేస్తామన్నారు.
ఈలోగా అరుణ్ చాలా ఆందోళన పడ్డాడు. ఎందుకంటే యింకో రెండు రోజుల్లో అతని స్వర్గలోకవాసం పూర్తి కావస్తోంది. తన పేర బ్యాంకులో ఉన్న జమ చూపించి, తను యింకా కొన్నేళ్లు ఉండవచ్చని నిరూపించుకుందామంటే బ్యాంకులోకి రానివ్వటం లేదు. కరెన్సీ జమ చేసినపుడు కొన్ని కుంభకోణాలు జరిగాయట, వాటిపై విచారణ జరిగేవరకు ఖాతాలన్నీ స్తంభింప చేశారట.
ఆరోజు మధ్యాహ్నం అరుణ్ ఆలోచిస్తూ కూర్చుని ఉండగా పర్యవేక్షకుడు వచ్చి ‘‘రేపే భూలోకానికి నీ పయనం. సగం రోజు సెలవు తీసుకో. నృత్యశాలకు వెళ్లి ఏవైనా నృత్యాలు అవీ చూడాలనుంటే చూసుకో.’’ అన్నాడు ఉదారంగా. అరుణ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘అదేమిటి? నా ఖాతాలో యింకా రెండేళ్ల స్వర్గవాసం ఉందిగా’’ అన్నాడు. ‘‘ఏ ఖాతా?’’‘‘అదే… బ్యాంకులో ఖాతా?’’
‘‘అయ్యో నీకు తెలియదా? బ్యాంకు దివాలా తీసిందట. దేవతలకు కొత్త కరెన్సీ అవసరం పడితే ఋణాలు యివ్వాల్సి వచ్చిందట. వాటిని మీ వేతనాలతో సరిపుచ్చి బ్యాంకు రద్దు చేశారు. ఇక మీ వేతనాలు హుళక్కే.’’ అన్నాడాయన. ‘‘మోసం, మోసం.’’ అని అరిచాడు అరుణ్.
‘‘ఒక్కడివీ అరిస్తే ఏం లాభం? వేతనజీవులందరూ ఉద్యానవనంలోకి వెళ్లి రోదిస్తూ అరుస్తున్నారు. నువ్వూ వెళ్లి ఆ బృందగానంలో చేరు.’’ అని అక్కణ్నుంచి వెళ్లిపోయాడాయన.
నిండు సభలో బృహస్పతి కేసి విలాసంగా చూస్తూ ఇంద్రుడు అడిగాడు – ‘‘ఏమంటున్నారు, ఆ అరుణూ, వాడి ముఠా?’’
ఆయన చిరునవ్వు నవ్వాడు. ‘‘ఆరోజు తిరుగుబాటు చేసినవాళ్లందరినీ ఒక్క దెబ్బతో వదుల్చుకుంటున్నాం. ఈ వేతనాల అంశం తెచ్చి తమ చేత ఎక్కువ పని చేయించినందుకు అరుణ్‍పై అతని సహచరులందరూ కోపంగా ఉన్నారు. సమీప భవిష్యత్తులో యిలాటి సమస్య తలెత్తుతుందని అనుకోను. మహామహా వారినే తన ఇంద్రజాలంతో తికమక పెట్టిన దేవేంద్రుడి ముందు భూలోకవాసుల కుప్పిగంతులా?’’ అన్నాడు.
సభాసదులు కరతాళధ్వనులు చేశారు.
ప్రశంసకు ఆనందిస్తూనే ‘‘ఏ మాట కామాట చెప్పుకోవాలి. నరులను పాలించే ఇంద్రుల నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి.’’ అంటూ వినయం ఒలకబోశాడు ఇంద్రుడు. మరో హాస్యకథ వచ్చే నెల మూడో బుధవారం
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)