‘రేవడీ కల్చర్’.. మిఠాయిలు పంచిపెట్టే సంస్కృతి సమాజానికి చేటు చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నప్పటినుంచి.. రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల గురించి దేశవ్యాప్తంగా తరచుగా చర్చ జరుగుతోంది. మోడీ ఆ మాట అన్నాడు గనుక ఆయన భక్తులందరూ.. ఇన్నాళ్లు ఈ విషయంలో తమ స్వరం ఎలా వినిపించిన వారైనా సరే.. హఠాత్తుగా ఉచితపథకాలను అసహ్యించుకోవడం ప్రారంభించారు.
అలాంటి పథకాలను అమలు చేస్తున్న పార్టీలకు చెందిన వారంతా.. మోడీ మీద ఎదురునిందలు వేయడం కూడా ప్రారంభించారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను పక్కన పెడితే.. సమాజంలో ఉండే అసమానతలను తొలగించడానికి అణగారిన వర్గాలకు బేషరతు చేయూత అందించకపోతే ఎలా అనే వాదన వినిపిస్తుంది.
ఇది నిజం. అయితే చాలా రాష్ట్రాల్లో విస్తృతంగా ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ఇతరత్రా పరిపాలను, ఇతర సంక్షేమ పథకాలను అవన్నీ దెబ్బతీస్తున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే మాత్రం.. ఉచితపథకాల కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం వాటా ప్రమాదకరంగానే కనిపిస్తుంది.
2022లో అపెక్స్ బ్యాంకు వారు నిర్వహించిన ఒక రీసెర్చి నివేదిక ప్రకారం.. ఉచిత పథకాల విషయంలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. అప్పులు-రాష్ట్ర జీడీపీ లెక్కల దామాషాలో వీరిది అట్టడుగు స్థానం. పంజాబ్ లో రాష్ట్రం యొక్క మొత్తం రెవెన్యూలో 17.8 % ఈ ఉచిత పథకాలకే వెచ్చిస్తున్నారు. అంతకంటె భయంకరమైన వాస్తవం ఏంటంటే.. రాబోయే అయిదేళ్లలో ఈ దామాషా.. 45% మించిపోనుంది.
‘ఫ్రీబీ’ల్లో పంజాబ్ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ దే. మొత్తం రాష్ట్ర రెవెన్యూ లో 14.1 % ఉచితపథకాలకే ఇక్కడ ఖర్చయిపోతోంది. మధ్యప్రదేశ్ లో ఇదే వాటా 10.8%గా ఉంది.
ఉచిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూలో మేజర్ వాటాగా తయారైపోతున్నాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది. పంజాబ్ ఇప్పటికే అప్పుల ఊబిలో పీకల్దాకా కూరుకుపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి నిందలు ఎక్కువగా ఉన్నా.. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది.
దేశవ్యాప్తంగా కూడా.. కోవిడ్ విపత్తు ముంచెత్తిన తర్వాత.. ఈ ఉచితపథకాల జోరు ఇంకా పెరిగిందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సగటున లెక్కవేస్తే.. సబ్సిడీలు ఉచితాల కోసం వెచ్చిస్తున్న మొత్తం 2021-22 లో 11.2 శాతానికి పెరిగింది. రాష్ట్రాలు సగటున.. తమ తమ రెవెన్యూలో 8.2 % సొమ్ములు ఉచితాలకే ఖర్చు పెడుతున్నాయి.
అయితే, ఉచిత పథకాల గురించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ స్థాయిలో ఉచిత పథకాలకు ఖర్చు చేయడాన్ని ఏకపక్షంగా సమర్థిస్తున్నవారు మాత్రం లేరు. దీనికి నియంత్రణ ఉండాలనేదే అందరి మాట. మౌలిక రంగాలైన విద్య, మౌలికవసతుల కల్పన వంటి విషయాల్లో ప్రభుత్వం ఉదారంగా ఉండాలే తప్ప.. రకరకాల ఉచిత పథకాలు తేవడం మంచిది కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆ మాటకొస్తే ఉచిత పథకాల విషయంలో ప్రభుత్వాలకు విచక్షణ ఉండాలి. పేదలు ఎదగడానికి, నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా చేయూత అందించాలే తప్ప.. వారిని పరాన్న జీవులుగా తయారుచేయడానికి పథకాలు దారితీయకూడదనేది ఎక్కువ మంది అభిప్రాయం.
భారత్ వంటి అతిపెద్ద దేశంలో.. ఇప్పటికీ నిరుపేదల సంఖ్య గణనీయంగా ఉన్న దేశంలో.. ప్రభుత్వాల చేయూత ఖచ్చితంగా అవసరమే. కానీ.. దానికి హద్దులు నిర్ణయించడంలోనే.. ప్రభుత్వాల దార్శనిక దృక్పథం, నాయకుల పరిణతి బయటపడతాయి. ఈ దిశగా మన నాయకులు కూడా ఆలోచించాల్సి ఉంది.