ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు ఆశ్చర్యంగా వుంటున్నాయి. ఇంతకూ ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేఎస్ఈజెడ్) పరిధిలో సేకరించిన భూముల్లో కొన్నింటిని రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే ఇందులో స్పష్టత కరువైంది. మంచోచెడో సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించకుండా తిరిగి ఇచ్చేయడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అది కూడా చంద్రబాబు హయాంలో మొదలు పెట్టి, తన తండ్రి వైఎస్సార్ పాలనలో సేకరించిన భూములు కూడా ఉండడం గమనార్హం. సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న 2,180 ఎకరాలను తిరిగి వారికే ఇవ్వాలని దానిపై ఏర్పాటైన కమిటీ సిఫార్సు లను జగన్ కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఆమోదించిన మేరకు వేలాది ఎకరాలను రైతులకు తిరిగి ఇస్తున్నారా? లేదా? అనేది స్పష్టత కరువైంది.
కాకినాడ తీరంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసేందుకు నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు సర్కార్ భూముల సేకరణకు 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నెలకొల్పాలను కున్న ఈ సెజ్‌ను వైఎస్సార్ కొనసాగించారు. ఈ మేరకు 2006-2011 మధ్య కాలంలో భూసేకరణ జరిగింది. 2009లో కూడా వైఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఒక దుర్ఘటనలో వైఎస్సార్ ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా వుండగా ఒప్పందం మేరకు సెజ్‌కు భూసేకరణ కొనసాగింది. 3,400.13 ఎకరాలు కొనుగోలు చేసి, కేఎస్ఈజెడ్కు ఇచ్చింది. అయితే సెజ్ యాజమాన్యం అంతకు మించి మొత్తం 4,558.39 ఎకరాలు కొనుగోలు చేసింది. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 2,180 ఎకరాలకు చెందిన 1,307 మంది రైతులు అవార్డు తీసుకోలేదు. భూములూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2014లో విభజిత ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. ఈ భూములను చంద్రబాబు ప్రభుత్వం బలంగా లాక్కుందని వైసీపీ వాదన. నాడు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో సెజ్ భూముల్లో అవసరానికి మించి తీసుకున్న వాటిని తమ ప్రభుత్వం రాగానే తిరిగి ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
తాజాగా కేఎస్ఈజెడ్ కోసం బలవంతంగా సేకరించిన భూములంటూ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేస్తోంది. సెజ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడమనేది దేశంలో ఇదే తొలిసారి అని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి అవసరం మేరకు ఉంచి, మిగిలిన భూములను సంబంధిత భూయజమానుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు జగన్ ప్రభుత్వం చెబుతోంది.
కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 148 ఎకరాలను 478 మంది రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు మండలాల్లో 597 ఎకరాలను భూమికి భూమి పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. రైతుల నుంచి భూములు తీసుకోవడమే నేరమైతే, అందులో వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా భాగం వుంటుందని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాలి. పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించడం కష్టమైన పరిస్థితుల్లో, తీసుకున్న వాటిని వెనక్కి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపించి, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వుంటే బాగుండేదని మెజార్టీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే, ఇంతకంటే ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయని పౌర సమాజం గుర్తు చేస్తోంది. మద్యనిషేధం, వారంలో నెరవేరుస్తానన్న సీపీఎస్, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలు ఏమయ్యాయనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కే-సెజ్)కు సంబంధించి చంద్రబాబు నోటిఫికేషన్ వరకే పరిమితం అయ్యారు. ఆ తర్వాత తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో భూసేకరణ మొదలై, ఆ తర్వాత ఆయన మరణానంతరం కూడా కొనసాగిందని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్ఈజెడ్ సరైంది కాదని వైఎస్సార్ భావించి వుంటే, భూసేకరణ ఎందుకు మొదలు పెడతారనే నిలదీత కూడా ఎదురవుతోంది. ఏది ఏమైనా రైతులకు తిరిగి భూములను రిజిస్ట్రేషన్ చేయడాన్ని వైసీపీ సమర్థిస్తుండగా, మిగిలిన పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. భూమిని సద్వినియోగం చేసుకోవడం చేతకాక, డొంకతిరుగుడు వాదనను ప్రభుత్వం చెబుతోందనే బలమైన విమర్శ ఉంది.