తన ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని అంటున్నాడు ఒకప్పటి భారత క్రికెట్ జట్టు ప్లేయర్ వినోద్ కాంబ్లీ. తన కెరీర్ ఆరంభంలో అద్భుతాలు చేసిన వినోద్ కాంబ్లీ 104 వన్డేలు, 17 టెస్టు మ్యాచ్ లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ తో కలిసి అద్భుతాలు చేశాడు వినోద్ కాంబ్లీ. రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిష్యరికం చేసిన వారిలో సచిన్ తో పాటు కాంబ్లీకీ పేరొచ్చింది. జాతీయ జట్టుకు అయితే సచిన్ కు ధీటుగా ఎంపికయ్యాడు కాంబ్లీ. టెస్టుల్లో సెంచరీలు కూడా సాధించాడు. సచిన్ కన్నా ప్రతిభావంతుడు కాంబ్లీ అనే వాళ్లూ ఉన్నారు. అయితే .. సచిన్ లా అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయాడు.
సచిన్ కు స్నేహితుడు, సచిన్ తో సరిసమానుడు అనిపించుకున్నా.. కాంబ్లీ కెరీర్ మాత్రం పడుతూ లేస్తూ సాగింది. వంద వన్డేలు ఆడటం మాత్రమే అతి పెద్ద ఘనత అయ్యింది. క్రికెట్ అభిమానులు కూడా క్రమంగా కాంబ్లీని మరిచిపోయారు. అయితే ఆ పేరును మాత్రం మరిచిపోలేదు! ఇప్పటికీ కాంబ్లీ అంటే.. ఎంతో కొంత సానుభూతి వ్యక్తం కావడమో లేదా, చేజేతులారా కెరీర్ ను పాడు చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం కావడమో రొటీనే.
ఇలాంటి క్రమంలో తన ప్రస్తుత పరిస్థితి గురించి కాంబ్లీ చెప్పుకున్నాడు. ప్రతి నెలా బీసీసీఐ ఇచ్చే ముప్పై వేల రూపాయల పెన్షనే తన జీవనాధారమని కాంబ్లీ చెప్పాడు. తనకు చేతిలో మరో కాంట్రాక్టు ఏదీ లేదని స్పష్టం చేశాడు.
రెండు మూడు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన వారు కూడా చాలా మంది కోచ్ లుగా పని చేస్తూ ఉంటారు. బీసీసీఐలో రకరకాల పదవులు చేపడుతూ ఉంటారు. సెలెక్టర్లుగా, రిఫరీలుగా.. ఇలా తమ గుర్తింపుతోనో, లాబీయింగ్ తోనే జీతం పొందే పదవులు చేపట్టడం ఏ మాత్రం కష్టం కాకపోవచ్చు. అయితే కాంబ్లీ మాత్రం పెన్షన్ తప్ప మరో దిక్కు లేదంటున్నాడు.
ఐపీఎల్ వంటి లీగ్ లు వచ్చాకా.. మాజీ క్రికెటర్లందరికీ చేతినిండా పని దొరికింది. అయితే కాంబ్లీకి మాత్రం అలాంటి అవకాశాలూ దక్కుతున్నట్టుగా లేవు. కొన్నాళ్ల కిందటి వరకూ ముంబై లెవల్లో ఒక టీ20 లీగ్ లో ఒక జట్టుకు కాంబ్లీ కోచ్ గా చేశాడట. ఇప్పుడు అది కూడా లేదు. సచిన్ రిఫరెన్స్ తో ఏదో గౌరవ హోదా లభించిందట కానీ దాని వల్ల డబ్బులేమీ రావు. ఈ విషయం సచిన్ కు కూడా తెలుసని, అయితే అతడి నుంచి తను ఏమీ ఎక్స్ పెక్ట్ చేయడం లేదని అంటున్నాడు కాంబ్లీ.
మొత్తానికి ఒక దశలో అద్భుతాలు చేస్తాడనిపించుకున్న కాంబ్లీ.. ఇలా ముప్పై వేల పెన్షన్ తో బతుకుతున్నానంటూ అనడం క్రికెట్ కు సంబంధించి మరో కోణాన్ని అర్థమయ్యేలా చేస్తోంది.