వెనకటికి ఒకాయన ఆవుకి గడ్డి తీసుకురాడానికి బద్దకించి, గడ్డిబొమ్మ గీసి ఆవుని తినమన్నాడట. ఆయన తరువాత ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖలో చేరాడు. F2 సినిమాలో హీరోయిన్‌కి హనీ ఈజ్ ది బెస్ట్ అనే మానరిజం వుంటుంది. తెలివి తక్కువ పనులు చేయడంలో విద్యాశాఖ ది బెస్ట్. గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులపై చర్చ జరగకుండా, సాధ్యాసాధ్యాల విశ్లేషణ లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి స్టైల్ వాళ్లది. ముఖ్యమంత్రి జగన్‌కి విద్యాశాఖలో అద్భుతాలు జరుగుతున్నాయనే భ్రమ కల్పిస్తున్నారో, ఆయనే ఆ భ్రమలో ఉన్నారో తెలియదు. తలాతోకా లేని పనులన్నీ ఆయన అకౌంట్‌లోకి చేరిపోతున్నాయి. శత్రువులు చేసే హాని కంటే అనుకూల శత్రువులు చేసే హాని ఎక్కువ.
టీచర్లు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ వేస్తారనే కొత్త రూల్ తెచ్చారు. మంచిదే. సమయ పాలనని ఎవరైనా గౌరవించాల్సిందే. టీచర్లు టైమ్‌కి రాకుండా స్కూళ్లు టైమ్‌కి ఎలా ప్రారంభమవుతున్నాయి. ఇది బేసిక్ ప్రశ్న. ఒకప్పుడు టీచర్లు తాము పని చేస్తున్న ఊర్లోనే కాపురం ఉండేవాళ్లు. గత మూడు దశాబ్దాలుగా ఇది మారింది. పిల్లల చదువులు, వైద్య అవసరాల కోసం దగ్గరలో వున్న టౌన్‌లో వుంటూ, పని చేస్తున్న ఊరికి రాకపోకలు సాగిస్తున్నారు. ఒకవేళ ఉండాలన్నా పల్లెల్లో వసతులతో ఉన్న అద్దె ఇళ్లు దొరకడం లేదు. ఒక్క టీచర్లే కాదు, అన్ని శాఖల ఉద్యోగులు పని చేస్తున్న వూళ్లలో కాపురం వుండడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలో ఒక్కోసారి బస్సు ఆలస్యం కావడమో, మిస్ కావడమో జరిగితే ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇది ఆ స్కూల్ హెడ్మాస్టర్ చూసుకుంటాడు. లేట్‌గా వచ్చిన టీచర్, లీజర్ పీరియడ్‌లో ఎక్సట్రా క్లాస్ తీసుకుంటాడు. అన్ని స్కూళ్లలో ఇలా ఇంటర్నల్ సర్దుబాట్లు వుంటాయి. టీచర్ల ప్రాథమిక విధి బోధన సక్రమంగా వుండేలా చూసుకోవడం. హెడ్మాస్టర్ పని, స్కూల్‌ని క్రమశిక్షణతో నడపడం, సకాలంలో సిలబస్ పూర్తి చేయడం. దీని మీద ఫోకస్ పెట్టకుండా హెడ్మాస్టర్‌కి ఫొటోలు అప్‌లోడ్ చేయడం అప్పగించారు. ఇది చాలదని ఇప్పుడు టీచర్ల సెల్ఫీల గోల.
అనేక గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ వుండదు. రేషన్‌కి, పింఛన్లకే కొండ గుట్టలు ఎక్కుతున్నారు. యాప్ పెట్టారు సరే, సర్వర్ పని చేయాలి కదా! టీచర్లు టైమ్‌కి రావడం కాదు, ముందు పుస్తకాలు రెడీ చేయండి. లేని కొండనాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోతుంది.
టీచర్లని టైమ్‌కి రమ్మనడం తప్పా? అని కొందరు ప్రశ్నించొచ్చు. తప్పే కాదు. కానీ దానికి కూడా పట్టువిడుపులుండాలి. అసలు టైమ్ సెన్స్ టీచర్లకే కాదు అందరికీ వుండాలి. రాజకీయ వ్యవస్థ ఆచరిస్తేనే ప్రజలు ఆచరిస్తారు. మన ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్క ప్రోగ్రామ్‌కైనా టైమ్‌కి వస్తారా? కనీసం కార్పొరేటర్లు, సర్పంచులు కూడా రారు. మీరు ఏ దశలోనూ పాటించనవి జనం నెత్తిన రుద్దితే ఎట్లా? టీచర్లు జీతాలు తీసుకుంటున్నారు కదా, ఊరికే వస్తారా? అంటున్నారు. జీతాలు ఎవరూ ఎవరికీ ఉచితంగా ఇవ్వరు. ఉద్యోగులకి ప్రభుత్వ జీతాలు ఇవ్వడం ఎంత కరెక్టో, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు, మంత్రులకి ప్రజలే జీతాలు ఇస్తున్నారు. ఈ సూక్ష్మం అర్థమైతే ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. లేదంటే నియంతృత్వ రూల్స్ రుద్దుతుంటారు.
కొసమెరుపుః టైమ్‌కి రమ్మనడం బాగుందని, ఇదే సందర్భంలో ఒకటో తేదీకి ఠంచన్‌గా జీతాలు ఇస్తారా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
జీఆర్ మహర్షి