బీజేపీని ఇరికించిన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి

బీజేపీని ఆ పార్టీ నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఇరికించారు. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌కు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్ప‌డం ద్వారా బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ సిద్ధాంతాల‌ను బ‌లంగా వినిపించే వారిలో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి…

బీజేపీని ఆ పార్టీ నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఇరికించారు. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌కు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్ప‌డం ద్వారా బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ సిద్ధాంతాల‌ను బ‌లంగా వినిపించే వారిలో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఒక‌డు. టీవీ చ‌ర్చ‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కొంటార‌నే పేరు ఆయ‌న‌కు ఉంది. ఒక్కోసారి ప్ర‌త్య‌ర్థుల‌పై హ‌ద్దులు దాటి కామెంట్స్ చేస్తుంటారు. దీంతో అన‌వ‌స‌ర స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటార‌నే పేరు కూడా ఆయ‌న‌కు ఉంది.

తాజాగా ఆయ‌న మాట్లాడుతూ వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌, అధికారంలోకి వ‌చ్చిన తర్వాత జ‌నాన్ని రోడ్డు మీద‌కి తెచ్చార‌ని విరుచుకుప‌డ్డారు. రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్ చేసిందేమీ లేద‌న్నారు. క‌నీసం రాయ‌ల‌సీమ‌లో ఒక్క ప్రాజెక్టును కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌కు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

2018లో క‌ర్నూలులో రాయ‌ల‌సీమ‌కు చెందిన బీజేపీ నేత‌లు విష్ణు ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ‌కు రెండో రాజ‌ధాని ఇవ్వాల‌ని, అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని, అలాగే హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని, గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని కూడా రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌ని త‌దిత‌ర డిమాండ్ల‌ను బీజేపీ తెర‌పైకి తెచ్చింది. మ‌రోవైపు అమ‌రావతిలోనే ఏకైక రాజ‌ధాని వుండాల‌ని అదే ఏపీ బీజేపీ పాద‌యాత్రం కూడా చేసింది.

దీంతో ప్రాంతానికో డిమాండ్‌, నాయ‌కుడికో అభిప్రాయం అన్న రీతిలో ఏపీ బీజేపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆగ్ర‌హం ఏపీ ప్ర‌జానీకంలో ఉంది. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్ప‌డం ద్వారా…. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసు కొచ్చిన మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టైంద‌ని అమ‌రావ‌తి ప్రాంత రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీకి శ‌త్రువులో సొంత పార్టీలోనే బోలెడు మంది ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.