ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో మార్పుచేర్పులకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించడం గమనార్హం.
ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో తెలుగు వ్యక్తి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేయడం విశేషం. మొత్తం 8 మంది గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేశారు.
ప్రకాశం జిల్లా లోని తిమ్మసముద్రం గ్రామంలో హరిబాబు జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ, అనంతరం అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఘనత హరిబాబుది.
1993 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లారు. 2014లో విశాఖపట్నం నుంచి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై కంభంపాటి హరిబాబు గెలుపొంది గుర్తింపు పొందారు. నెమ్మదస్తుడిగా, వివాద రహితుడిగా పేరు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించారు.