విశాఖలో రామానాయుడు స్టూడియో స్థలాన్ని వెనక్కు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని స్టూడియో స్థలం వెనక్కు ఇవ్వాలని ప్రభుత్వం, స్టూడియో అధినేత సురేష్ బాబును కోరిందని వార్తలు వెలువడ్డాయి.
రామానాయుడు కాలం నాటిదని, ఎన్నో సినిమాలు షూటింగ్ చేసుకున్నాయని, ఎంతో మంది పనివారితో కళకళలాడిపోతోందని ఇలా కథనంలో వండి వార్చేసారు.
అసలు ఈ స్టూడియో ఎలా సాధ్యమైంది? అన్నది చూద్దాం. విశాఖ టు భీమిలి బీచ్ రోడ్ ను ఆనుకుని వున్న అనువైన చిన్న కొండను చంద్రబాబు టైమ్ లో స్టూడియో నిర్మాణానికి అంటూ సురేష్ బాబుకు ఇచ్చేసారు. అప్పటికే చాలా మంది విశాఖలో స్టూడియోల కోసం స్థలాలు కావాలని కోరుతున్నా, వారెవరికీ ఆ భాగ్యం దక్కలేదు.
ఆ తరువాత కొన్నేళ్లకు వైఎస్ అధికారంలోకి వచ్చారు. అప్పటికి సురేష్ బాబు ఆ కొండను అలాగే వుంచుకున్నారు తప్ప, దేని కోసం తీసుకున్నారో, ఆ స్టూడియోను నిర్మించలేదట.
అదే టైమ్ లో బీచ్ రోడ్ లో వున్న కొండలను వివిధ ఐటి కంపెనీలకు ఇచ్చి, విశాఖలో ఐటిని ప్రమోట్ చేసే పని స్టార్ట్ చేసారు వైఎస్. ఆ సమయంలో ఖాళీగా వున్న ఈ కొండను కూడా వెనక్కు తీసుకోవాలనుకున్నారని అప్పట్లో వినిపించింది. దాంతో సురేష్ బాబు వెళ్లి వైఎస్ కలిసారన్నది అప్పట్లో రాజకీయ వర్గాల్లో వినిపించిన సంగతి.
శతృవైనా, మిత్రుడైనా సమాదరించే గుణం వున్న వైఎస్, తెలుగుదేశం పార్టీకి చెందిన సురేష్ బాబును ఒకటే కోరారు అని బోగట్టా. ''.. స్టూడియో కట్టండి. అలా అయితే వెనక్కు తీసుకునే ఆలోచన చేయం. స్టూడియో కట్టి విశాఖ జనాలకు ఉద్యోగాలు కల్పిస్తే, ఇచ్చిన దానికి ఉపయోగం వుంటుంది. లేదూ అంటే వెనక్కు తీసుకోకతప్పదు..' అని క్లారిటీ ఇచ్చేసారన్నది అప్పడు జరిగిన విషయాలు తెలిసిన వారు చెప్పే సంగతి.
దాంతో అర్జెంట్ గా సురేష్ బాబు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కానీ విరివిగా షూటింగ్ లు అయితే అక్కడ జరగలేదు. అడపదడప షూటింగ్ లు తప్ప, హైదరాబాద్ లో స్టూడియోల మాదిరిగా నిత్యం షూటింగ్ లు అయితే జరగడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునే ఆలోచన చేస్తోందని బయటకు లీకులు వదిలారు.
నిజానికి ఏ ప్రభుత్వానికి అయినా తమ అవసరాల కోసం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకునే హక్కు వుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇస్తారు. నష్ట పరిహారం ఇస్తారు. అమరావతి నిర్మాణానికి అవసరం అయింది అని గతంలో ఎందరిలో ఇచ్చిన పట్టా భూములు వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి కదా. వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చారని కూడా వివరణలు వచ్చాయి. మరి అలాంటిది దీనికి మాత్రం రాజకీయ రంగు పులమడం ఏమిటో?
నిజానికి స్టూడియో నిర్మాణం చేయనపుడే వైఎస్ వెనక్కు తీసుకుని వుంటే ఏం సమస్య వుండేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు వైకాపా మీద బురదేస్తున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టోటల్ వ్యవహారంలో మొత్తం నిజా నిజాలు సురేష్ బాబు పెదవి విప్పితే తప్ప క్లారిటీగా తెలియదు.