మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఓ అందమైన ప్రేమకథ. హ్యాండ్సమ్ హీరో, బబ్లీ హీరోయిన్, ఓ మంచి కుటుంబం.. ఈ సెటప్ తో సాగే కథ. మరి ఇందులో హీరోగా నటించడానికి ఒప్పుకున్న అఖిల్ కు కథలో ఏం నచ్చి ఉంటుంది?
కచ్చితంగా లవ్ లేదా ఫ్యామిలీ ఎలిమెంట్స్ నచ్చి ఉంటాయనుకుంటాం. కానీ అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కామెడీ నచ్చిందట. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బయటపెట్టిన మేటర్ ఇది.
“అఖిల్ ను కలిశాను. స్టోరీ చెప్పాను. సింగిల్ సిట్టింగ్ లో స్టోరీ ఓకే చేశాడు. నెరేషన్ అయిన తర్వాత తన బుగ్గలు పట్టుకొని అటుఇటు నడిచాడు. నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెట్టాయన్నాడు. కామెడీని బాగా ఎంజాయ్ చేశాడు. అందుకే ఈ సినిమా చేస్తానని చెప్పాడు.”
నాగార్జున కూడా సింగిల్ సిట్టింగ్ లో ఈ కథకు ఓకే చెప్పారని, ఆయనకు కూడా తను చెప్పిన కామెడీ ట్రాక్ బాగా నచ్చిందంటున్నాడు. అలా అఖిల్ తన ప్రాజెక్టులోకి వచ్చాడంటున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇక పూజా హెగ్డేపై స్పందిస్తూ.. స్టాండప్ కమెడియన్ పాత్రను ఆమె ఎలా చేస్తుందోనని భయపడ్డానని, కానీ పూజా హెగ్డే చాలా బాగా చేసిందని చెప్పుకొచ్చాడు.
ప్యాచ్ వర్క్ మినహా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు అయిపోయింది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్న తర్వాత తమ సినిమానే ముందుగా రిలీజయ్యే అవకాశం ఉందంటున్నాడు ఈ దర్శకుడు.