కామ్న జఠ్మలానీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తనకు పెళ్లయిన విషయం బయటకు పొక్కితే అవకాశాలు తగ్గిపోతాయని భావించింది. అందుకే బెంగళూరులో కాపురం పెట్టి, హైదరాబాద్ కు షూటింగ్స్ కోసం వచ్చేది. ఆ తర్వాత పెళ్లితో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి, ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కు దూరం.
ఇలా అంతా సద్దుమణిగిన తర్వాత, ఇన్నాళ్లకు అప్పటి పుకార్లపై స్పందించింది కామ్న జఠ్మలానీ. తన పెళ్లితో పాటు, సినిమా కెరీర్ పై రియాక్ట్ అయింది. తన పెళ్లికి, సినిమా అవకాశాలకు సంబంధం లేదని స్పష్టం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లి అయినప్పటికీ సినిమాల్లో నటిస్తాననే కండిషన్ పైనే పెళ్లి చేసుకున్నానని, తన భర్తకు కూడా తను సినిమాల్లో నటించడం ఇష్టమేనని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లయిన విషయాన్ని సీక్రెట్ గా ఉంచలేదని, ఇండస్ట్రీలో చాలామందికి ఆ విషయం తెలుసని అంటోంది. కాకపోతే తన పెళ్లికి ఎవ్వర్నీ ఆహ్వానించలేకపోయానని, కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చింది.
చాలామంది తనది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారని, కానీ తనది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చెప్పుకొచ్చింది కామ్న. తన భర్త బెంగళూరులో వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. ఇప్పటికీ సినిమా ఆఫర్లు వస్తే తను నటిస్తానని, తన భర్తకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.
రీఎంట్రీ తర్వాత ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలనుకుంటారు. మంచి పాత్రలు చేయాలనుకుంటారు. కానీ కామ్న మాత్రం మాంఛి మసాలా సాంగ్ చేయాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా, తను ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నానని, జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన పక్కా లోకల్ లాంటి మసాలా సాంగ్ చేయడానికి రెడీ అని ప్రకటించింది.