పెద్దలు వచ్చారంటే వరాలు ఉంటాయి. బహుమానాలు కూడా ఉంటాయి. అలాగే ముఖ్యమంత్రి అంతటి వారు తన ఇంటికి వస్తే ఊరికే ఉత్త చేతులతో వెళ్ళిపోతారా. విశాఖ టూర్ లో సీఎం జగన్ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్ళి ఆయనకే షాక్ ఇచ్చేశారు. జగన్ సీఎం హోదాలో తన ఇంటికి రావడం ఈ జన్మంతా గుర్తుండే మధురమైన అనుభవం అని వాసుపల్లి అంటున్నారు అంటే దటీజ్ జగన్ అనుకోవాలి.
వాసుపల్లి పెద్ద కుమారుడు సూర్య వివాహానికి రాలేని జగన్ ఆయన్ని దీవించడానికి వచ్చారు. పనిలో పనిగా వాసుపల్లికి కూడా గట్టి భరోసా ఇచ్చేశారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లికి 2024 ఎన్నికల్లో పర్టీ టికెట్ ఖాయమని ఈ దెబ్బతో రుజువు అయిపోయింది.
విశాఖ సౌత్ లో వాసుపల్లికి యాంటీగా టీడీపీ వర్గాలు పోరెత్తుతున్నాయి. అయినా సరే జగన్ మాత్రం ఆయనకే ఓటేశారని, అందుకే స్వయంగా ఇంటికి వచ్చి మరీ గిఫ్ట్ అలా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న వాసుపల్లి అనుచరులు ఇక సౌత్ లో తమా బండికి ఎదురులేదని, జోరు కూడా తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ సౌత్ లో వైసీపీ నుంచి ఎవరైనా టికెట్ మీద ఆశ పెట్టుకుంటే ఇక వాటిని అన్నింటికీ కట్ చేసుకోవాల్సిందే అన్న మెసేజ్ కూడా వైసీపీ హై కమాండ్ ఇచ్చేసింది అంటున్నారు.