టీడీపీ ఆశలు అడియాసలేనా…?

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ప్రజల్లో కూడా అదే ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆశలను ఎల్లో మీడియా మరింతగా పెంచుతోంది. జగన్ పరిపాలనలో లోపాలు లేవని కాదు.…

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ప్రజల్లో కూడా అదే ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆశలను ఎల్లో మీడియా మరింతగా పెంచుతోంది. జగన్ పరిపాలనలో లోపాలు లేవని కాదు. తప్పనిసరిగా ఉన్నాయి. ప్రధానంగా అభివృద్ధి జరగడం లేదని, యువతకు ఉపాధి కరువైందని వ్యతిరేక మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. 

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఏపీకి ఇప్పటికీ రాజధాని లేదు. ఇది విచారించాల్సిన విషయమే కాదు. సిగ్గుపడాల్సిన సంగతి. జగన్ మాత్రం మూడు రాజధానుల పట్టు వీడలేదు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో కూడా మూడు రాజధానుల విషయాన్ని నొక్కి వక్కాణించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు రాజధాని లేకపోవడాన్ని ఎల్లో మీడియా ప్రత్యేకంగా ఎత్తిచూపుతూ ఇది జగన్ కు నెగెటివ్ అవుతుందని చెబుతోంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.

జగన్ పాలనలో అనేక లోపాలు ఉన్నప్పటికీ టీడీపీ తాము అధికారంలోకి వస్తే ఆ లోపాలను ఎలా సరిచేస్తామో ఇప్పటివరకు చెప్పడం లేదు. అదే జగన్ పార్టీకి బలం చేకూరుస్తోంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందని, శ్రీలంక మాదిరిగానో, వెనిజులా మాదిరిగానో మారిపోతుందని చెబుతోందిగానీ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో టీడీపీ చెప్పడం లేదు. 

ఈ కారణంగానే ప్రజల్లో వైఎస్సార్ సీపీకి, జగన్ కు ఆదరణ కొనసాగుతోంది. దీన్నిబట్టి టీడీపీని ప్రజలు నమ్మడంలేదనుకోవాలా? జగన్ కు ఆదరణ కొనసాగుతోందని చెప్పడానికి సాక్ష్యమేమిటి? అని అడగొచ్చు. జాతీయ దిగ్గజ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలే ఇందుకు సాక్ష్యం. ఇప్పటివరకు మూడు మీడియా సంస్థలు సర్వే చేశాయి. మూడు సర్వేల్లోనూ జగన్ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయని తేలింది. 2019 లో వచ్చినన్ని సీట్లు రావుగాని ఎక్కువ సీట్లు సాధించి ఆధిక్యం సాధిస్తుంది. ఇదివరకు రెండు జాతీయ మీడియా ఛానళ్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు చేపట్టాయి.

ఈ రెండు కూడా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశాయి. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమౌతుందని తేలింది. ఇప్ప్పుడున్న లోక్‌సభ స్థానాల కంటే కూడా అధిక సీట్లను ఎన్డీఏ కూటమి తన ఖాతాలో వేసుకోగలుగుతుందని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది. 

ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే కూడా ఇదే స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో మరోసారి ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యాన్ని కోరుకుంటున్నారని  తేలింది. సీట్లు మాత్రం గతం కంటే తగ్గినప్పటికీ.. ఆయన మూడోసారి ప్రధానిగా పగ్గాలు అందుకుంటారని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని, 25 లోక్‌సభ స్థానాలకు 18 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని పేర్కొంది ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే. ఇప్పుడిక మరో జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ వంతు వచ్చింది.

తాజాగా స్నాప్ ఒపీనియన్ పోల్ పేరుతో టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో దాదాపుగా అవే ఫలితాలను ప్రతిబింబించింది. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 292 నుంచి 312 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ ఈ దఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని, 118 నుంచి 138 స్థానాలకే పరిమితమౌతుందని వివరించింది. 

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని తేల్చింది టైమ్స్ నౌ స్నాప్ ఒపీనియన్ పోల్. ఇప్పుడున్న లోక్‌సభ స్థానాలతో పోల్చుకుంటే వాటి సంఖ్య తగ్గినప్పటికీ.. మెజారిటీ సీట్లు వైఎస్ఆర్సీపీకే వెళ్తాయని పేర్కొంది. మొత్తం 17 నుంచి 23 లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. ఇదే రేషియోను అసెంబ్లీ స్థానాలకు బదలాయించుకుంటే.. వైసీపీ సులువుగా 125 నుంచి 135 అసెంబ్లీ సీట్లల్లో జెండా ఎగురవేయడం ఖాయం.

ఆగస్టు 15వ తేదీన టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే ప్రకారం.. తమ పార్టీకి 17 నుంచి 23 ఎంపీ సీట్లు లభిస్తాయని తేలినట్లు తెలిపింది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జ‌గ‌న్‌ 5వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఈ సర్వేలన్నీ- ఇదివరకు టీడీపీ చేసిన సర్వే ప్రచారానికి, ఆ నాయకుల అంచనాలకు భిన్నంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ముఖ్యమంత్రుల పనితీరులో వైఎస్ జగన్ 20వ స్థానంలో నిలిచారంటూ ఇదివరకు టీడీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు సర్వేల ఫలితాలు చూసిన టీడీపీ తన ప్రచార పంథాలో మార్పులు చేసుకొని, ప్రజలను ఆకట్టుకుంటుందా?