టీడీపీ ప్రయోగం చేయబోతోందా?

రాజకీయ పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తుంటాయి. అవి విజయవంతం కావొచ్చు, విఫలమవొచ్చు. కొండకు వెంట్రుక వేసి లాగడానికి ప్రయత్నిస్తాయి. వస్తే కొండా రావొచ్చు. లేకపోతే వెంట్రుక పోతుంది. అంతే కదా. ప్రయోగం చేయడం తప్పేమీ…

రాజకీయ పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తుంటాయి. అవి విజయవంతం కావొచ్చు, విఫలమవొచ్చు. కొండకు వెంట్రుక వేసి లాగడానికి ప్రయత్నిస్తాయి. వస్తే కొండా రావొచ్చు. లేకపోతే వెంట్రుక పోతుంది. అంతే కదా. ప్రయోగం చేయడం తప్పేమీ కాదు. అది పాజిటివ్ థింకింగ్ ను సూచిస్తుంది. చేసిన ప్రయోగం విజయవంతమైతే ఆనందిస్తారు. కాకపొతే గుణపాఠంగా తీసుకుంటారు. 

ప్రస్తుతం ఏపీకే పరిమితమైన టీడీపీ తెలంగాణలో ప్రయోగం చేయాలనుకుంటోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులనుబట్టి చూస్తే ఆ ప్రయోగం విజయవంతం కాకపోవొచ్చు. అయినప్పటికీ ధైర్యం చేస్తోంది. ఇంతకూ ఏమిటా ప్రయోగం? మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని అనుకోవడం. టీడీపీ తెలంగాణా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావడం గురించి చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదనే సంగతి తెలిసిందే. సరైన నాయకత్వం లేక టీడీపీకి ఆదరణ లేకుండా పోయింది.

ఇలాంటి తరుణంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇది అంత తేలికగా అయ్యే అంశం కాదు. కాకపోతే తమ శక్తి ఏ మేర ఉందో తెలుసుకోవడానికి మునుగోడులో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మునుగోడులో బీసీ వర్గం ఓట్లు ఎక్కువ. ఇప్పటికీ బీసీలకు టీడీపీపై అభిమానం ఉందని అనుకుంటున్నారు. అందుకే అక్కడ పోటీ చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని సమాచారం. 

టీడీపీ తరపున బరిలో దిగేందుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మునుగోడు ఇంచార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ సిద్ధమవుతున్నారట. బీసీ వర్గానికి చెందిన ఐలయ్యకు నియోజకవర్గంలో కాస్త పట్టు ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన పోటీకి రెడీ అవుతున్నారట. మునుగోడులో పోటీ చేసే విషయమై తెలంగాణాలోని ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు చర్చలు జరిపారట.

మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాల్సిందేనని చాలామంది నేతలు గట్టిగానే చెప్పారట. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువమంది ఉన్నారట. ఎలాగూ తెలంగాణాలో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న చంద్రబాబు మునుగోడు ఉపఎన్నికను వేదికగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఖమ్మంలో తొందరలోనే బహిరంగ సభ నిర్వహించాలని వరదల సమయంలో భద్రాచలం వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పిన విషయం తెలిసిందే. 

నిజానికి సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలోకన్నా తెలంగాణాలోనే టీడీపీ బలంగా ఉండేది. కాకపోతే రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖలు ఇచ్చినా ఉపయోగంలేకపోయింది. అది ఆయన బాడ్ లక్. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీయార్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ ప్రయత్నమే ఓటుకునోటు కేసుగా దేశమంతా పాపులరై చివరకు అరెస్టు భయంతో చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి విజయవాడ వెళ్లిపోయారు.  

పార్టీ అధినేత తెలంగాణాను వదిలేసి వెళ్లిపోవడంతో మిగిలిన నేతలు కూడా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. దాంతో తెలంగాణాలో పార్టీ ప్రస్తుతం దుస్థితిలో ఉంది. దాదాపు భూస్ధాపితమైపోయిన పార్టీకి మళ్ళీ జవజీవాలు పోయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లున్నారు. అందుకనే ఖమ్మంలో బహిరంగ సభని, మునుగోడులో పోటీ అని హడావుడి చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లారిటిగా మాట్లాడుకుందామని ఈలోగా పరిస్ధితులను గమనిస్తుండమని చెప్పారట. 

రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ దూరంగానే ఉంది. బరిలో ఉంటామని పార్టీ నాయకత్వం చెప్పినప్పటికీ పోటీ చేయడానికి సాహసించలేదు. స్థానిక నాయకులు ఆసక్తి చూపినా అధిష్టానం వెనుకంజ వేసింది. అయితే పార్టీ కేడర్ ను కాపాడుకోవడానికి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడుకి 12 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ మూడుసార్లు మాత్రమే పోటీ చేసింది. మూడు సార్లూ గెలవలేదు. 

వామపక్షాలతో పొత్తు కారణంగా ఎనిమిది సార్లు పోటీ చేయలేదు. 1999 ,2004 ఎన్నికల్లో పార్టీ రెండో స్థానంలో నిలిచింది. 1983 లో మూడో స్థానంలో నిలిచింది. ఆ మూడుసార్లు మినహా మళ్ళెప్పుడూ పోటీ చేయలేదు. 2018 లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహా కూటమిలో భాగంగా మద్దతు తెలిపింది.

రాబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తే పార్టీలో ఉత్సాహం వస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ పోటీ చేస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితినిబట్టి చూస్తే టీడీపీకి గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పొచ్చు.