గుంటూరు జిల్లా మంగళగిరిలో మొదటి ఎన్నికలో ఫెయిల్ అయిన స్టూడెంట్ కూడా జగన్ విద్యా బుద్ధుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎబ్బెట్టుగా ఉందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ‘అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు’ నినాదంతో మంగళగిరిలో ఉచిత వైద్య కేంద్రాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సొంత ఖర్చుతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌పై లోకేశ్ విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఆయనపైకే రివర్స్ అయ్యాయి. లోకేశ్ మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు. సీఎం జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా’ అని హెచ్చరించారు.
లోకేశ్ అకడమిక్ విద్యార్హతల సంగతి పక్కన పెడితే, రాజకీయంగా ఆయన మొదటి అడుగే విఫలమైంది. దీన్ని గమనంలో పెట్టుకోకుండా జగన్‌పై సెటైర్స్ వేయాలనుకోవడం ఆయనకే చెల్లింది. రాజకీయంగా తాను సక్సెస్‌ఫుల్ లీడర్ అని నిరూపించు కుని వుంటే, జగన్‌పై ఎన్ని మాట్లాడినా జనామోదం ఉండేది. కానీ లోకేశ్ విషయంలో అన్నీ రివర్సే. దొడ్డిదారిలో మంత్రి పదవి దక్కించుకున్నారనే విమర్శ సొంత పార్టీ నుంచే బలంగా ఉంది. ఎమ్మెల్సీ పదవి పుణ్యాన ఆయన అమాత్యుడు కాగలిగారు.
మంత్రి హోదాలో మంగళగిరి బరిలో నిలిచి పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కూడా జగన్‌వి టెన్త్ క్లాస్ పాస్, డిగ్రీ ఫెయిల్ తెలివితేటలని మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయిన నాయకుడి మాటలకు విలువ వుండదనే స్పృహ లోకేశ్‌లో లేనట్టుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
మళ్లీ మంగళగిరి బరిలో నిలుస్తానని ఇప్పటికే ప్రకటించిన లోకేశ్, కనీసం ఈ దఫా అయినా పాస్ అయ్యేందుకు ప్రయత్నించు చిన్నబాస్ అని నెటిజన్లు వెటకరిస్తున్నారు. మరి రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో లోకేశ్ చేసే వర్కౌట్లు ఏంటో ఆయనకే తెలియాలి.