జనసేనాని పవన్‌కల్యాణ్‌ను వైసీపీ నేతలు రాజకీయంగా ఆడుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు పవన్‌కల్యాణ్ తమపై చేసిన విమర్శలను అవకాశంగా తీసుకుని వైసీపీ నేతలు దుమ్ము దులుపుతున్నారు. టీడీపీ బానిసత్వం నుంచి జనసేనకు స్వాతంత్ర్యం ఎప్పుడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వేసిన పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో మంత్రి పవన్‌పై విరుచుకుపడ్డారు.
ఈ దఫా ప్రజానీకం జనసేన వైపు చూడాలని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేయడంపై రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా సెటైర్ విసిరారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడని, ఆయనమో టీడీపీ వైపు చూస్తాడంటూ అదిరిపోయే వ్యంగ్యాస్త్రం సంధించారు. కాకినాడలో మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు కొమ్ము కాసేందుకే పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడని ధ్వజమెత్తారు.
కనీసం ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్‌పై చాలా సవాళ్లు విసిరారని ఎద్దేవా చేశారు. కాపులెవరూ పవన్‌కల్యాణ్‌ను నమ్మేస్థితిలో లేరని తేల్చి చెప్పారు. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే అని కాపులకు తెలుసని మంత్రి చెప్పుకొచ్చారు. తుని ఘటనలో కాపులను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు.
అలాంటి నాయకుడికి కాపులను మళ్లీ తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తప్పు పట్టారు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారంటూ మంత్రి ఘాటు వ్యాఖ్య చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను కేవలం కుల నాయకుడిగానే ఇతర రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. కేవలం కాపుల ఓట్ల కోసమే ఆయన్ను టీడీపీ దువ్వుతోంది. జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోడానికి కూడా కారణం అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగని పవన్‌లో కులతత్వం ఉందని ఎవరూ చెప్పరు.
అలాగే ఆయన ఒప్పుకోరు. కానీ ఆ సామాజిక వర్గంలో జనాదరణ కలిగిన నేతగా పవన్‌ను మాత్రమే గుర్తిస్తుండడం వల్ల ఆ రకమైన ప్రచారం జరుగుతోంది. సహజంగా ఏ కులంలోనైనా ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఓన్ చేసుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణమే. పవన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
చంద్రబాబుకు కాపులను తాకట్టు పెడతారని వైసీపీకి చెందిన ఆ సామాజిక వర్గం నేతలు బలంగా చెప్పడం వెనుక వ్యూహం దాగి వుంది. దాన్నే జనంలోకి వైసీపీ బలంగా తీసుకెళుతోంది. ఇందుకు మంత్రులు గుడివాడ, దాడిశెటల్టి రాజాల ఎదురుదాడులే నిదర్శనం.