కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి ఒకరికి స్థానం దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచి కూడా మరొకరికి స్థానం దక్కవచ్చనేది ఢిల్లీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే.. బీజేపీ వాళ్లు దక్షిణాది రాష్ట్రాలను అంత సీరియస్ గా తీసుకుంటారా? అనేది ప్రశ్నార్థకమే.
ఎందుకంటే.. యూపీ ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకుని ప్రస్తుత కేబినెట్ విస్తరణ జరుగుతోందని స్పష్టం అవుతోంది. యూపీ, బిహార్, ఉత్తరాఖండ్ లకు ఇప్పుడు అగ్రతాంబూలం అంటున్నారు. ఎలాగూ మధ్యప్రదేశ్ లో సర్దుకోవాల్సినవి ఉన్నాయి. మామూలుగానే ఇలాంటి విషయాల్లో దక్షిణాదిని బీజేపీ పెద్దగా పరిగణనలోకి తీసుకోదు.
అలాంటిది ఇప్పుడు ఏపీకి ఒకటి, తెలంగాణకు మరోటి, కర్ణాటకకు ఇంకోటి అంటూ పంచే అవకాశాలు ఏవీ లేవు. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కోటి అనేది జస్ట్ మీడియా అంచనా మాత్రమే. చివర్లో ఏపీ నుంచి ఎవరికీ లేదు, తెలంగాణలోనూ ఎవరికీ లేదు.. అనే వార్త వచ్చినా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అది వాస్తవ పరిస్థితి.
అయితే ఊహాగానాలు ఉండాలన్నట్టుగా.. ఏపీ నుంచి జీవీఎల్ లేదా టీజీ అని, తెలంగాణ నుంచి ఇంకా ఎవరో తేలలేదని ప్రచారం జరుగుతోంది. అయితే మరో వర్గం మీడియా పవన్ కల్యాణ్ పేరును ఇంకా ప్రచారంలో ఉంచుతోంది.
తెలంగాణ కోటా నుంచి పవన్ కల్యాణ్ ను కేంద్రమంత్రిగా తీసుకుంటారట! ఎంత కేరాఫ్ హైదరాబాద్ అయితే మాత్రం పవన్ కల్యాణ్ ను బీజేపీ వాళ్లే తెలంగాణ గాటన కట్టేస్తే ఏపీలో ఆ పార్టీకి వచ్చే లాభంలో ముక్క పోయినట్టే. కాబట్టి.. పవన్ ను ఏపీ కోటా కిందే పరిగణించాలి బీజేపీ అధిష్టానం.
ప్రస్తుతానికి అయితే ఏపీ కోటాలో పవన్ పేరు తెరమరుగు అయ్యింది పూర్తిగా. పవన్ కు కేంద్రమంత్రి పదవి ఆపై రాజ్యసభ సభ్యత్వం.. ఆ పై బీజేపీ-జనసేనలు ఏపీలో బలోపేతం అనే ఊహాగానాలు తేలిపోయినట్టే. నేడే రేపో కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఖాయం అనే పరిస్థితుల్లో పవన్ కు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపూ లేకపోవడంతో ఆయనకు మంత్రి పదవి అనే ఊహాగానాలకు తెరపడుతోంది.