మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రో గొప్ప నిర్ణ‌య‌మిది!

ఇప్ప‌టికే డ్రైవింగ్ లైసెన్స్ ల వ్య‌వ‌హారం పూర్తి ప్ర‌హ‌స‌నంగా మారింది. నిజాయితీగా టెస్టుల్లో పాల్గొని, పాసై లైసెన్స్ లు తెచ్చుకునే వారి సంఖ్య త‌క్కువ‌! జిల్లాల స్థాయిల్లోని ఆర్టీవోల్లో జ‌రిగే ప్ర‌హ‌స‌నం అంతా ఎవ‌రికి…

ఇప్ప‌టికే డ్రైవింగ్ లైసెన్స్ ల వ్య‌వ‌హారం పూర్తి ప్ర‌హ‌స‌నంగా మారింది. నిజాయితీగా టెస్టుల్లో పాల్గొని, పాసై లైసెన్స్ లు తెచ్చుకునే వారి సంఖ్య త‌క్కువ‌! జిల్లాల స్థాయిల్లోని ఆర్టీవోల్లో జ‌రిగే ప్ర‌హ‌స‌నం అంతా ఎవ‌రికి తెలియ‌నిది కాదు. మొత్తం బ్రోక‌ర్ల రాజ్యం. బ్రోక‌ర్లకు డ‌బ్బులిస్తే ఎలాంటి వారికైనా క‌నీసం స్టీరింగ్ ప‌ట్టుకోవ‌డం తెలియ‌ని వారికి కూడా లైసెన్స్ వ‌స్తుంది. బ్రోక‌ర్ల‌ను న‌మ్ముకోక‌పోతే ఎంత‌టి డ్రైవ‌ర్ కూడా లైసెన్స్ తెచ్చుకోవ‌డం గ‌గ‌నం. ఈ ప‌రిస్థితిని ద‌శాబ్దాల క్రిత‌మే 'భార‌తీయుడు' సినిమాలో చూపించారు. ఆ ప‌రిస్థితి ఇప్ప‌టికీ ఏ మాత్రం మార‌లేదు! ఇక మార‌క‌పోవ‌చ్చు కూడా.

అయితే ప్ర‌స్తుతం క‌నీసం సిటీ లెవ‌ల్ ఆర్టీవో ఆఫీసుల్లో టెస్టు స్ట్రిక్ట్ గా జ‌రుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాల‌నుకునే వాళ్లు క‌చ్చితంగా వాహ‌నాన్ని క‌దిలించ‌గ‌ల‌గాలి, అలాగే కారును ఎయిట్ నంబ‌ర్ ర్యాంప్ పై న‌డ‌ప‌డంతో పాటు, రివ‌ర్స్ చేయాలి. ఈ విష‌యంలో క‌నీసం 90శాతం క‌రెక్టుగా న‌డిపిన వారికే కారు డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. అప్ప‌టికీ బ్రోక‌ర్ల ద్వారానే 90 శాతం మంది లైసెన్స్ ల‌కు అప్లై చేసుకుంటారు. 

ఆర్టీవో వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకునే అవ‌కాశం ఉన్నా.. అందుకు ఫీజు ఐదారు వంద‌లే అయినా.. ఐదారు వేల రూపాయ‌లు చెల్లించి మ‌రీ బ్రోక‌ర్ల ద్వారానే అంతా ఆర్టీవోల‌కు వెళ్తారు. ఎక్క‌డ సంత‌కాలు చేయాలో, ఎలా అప్లోడ్ చేయాలో.. అందులో ఏదైనా మ‌రిచిపోతే మ‌ళ్లీ ఆర్టీవో వెన‌క్కు పంపిస్తాడు.. అలాగే టెస్టుల విష‌యంలో బ్రోక‌ర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తార‌నే లెక్క‌ల‌తో జ‌నాలు బ్రోక‌ర్ల‌ను న‌మ్ముకుంటారు.

టెస్టుల విష‌యంలో జిల్లా స్థాయిల ఆర్టీవోల‌కు చాలా చెడ్డ‌పేరుంది. టెస్టులు పాస్ కాకున్నా లైసెన్స్ లు జారీ చేస్తారు, మొత్తం వ్య‌వ‌హారం బ్రోక‌ర్ల చేతిలోనే ఉంటుంద‌నేది చాలా మంది చెప్పే విష‌య‌మే. ఇలా వ‌చ్చీరాని డ్రైవింగ్ తో రోడ్లెక్కి చాలా మంది ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతూ ఉంటారు. అస్స‌లు స్టీరింగే ప‌ట్టుకోవ‌డం రాని వారు కూడా చాలా మంది లైసెన్స్ ల‌ను క‌లిగి ఉంటారంతే! సిటీ లెవ‌ల్ ఆర్టీవోల్లో మాత్రం టెస్టు క‌చ్చితంగా పాస్ కావాల్సిందే అనే ప‌రిస్థితి ఉంది. 

బ‌హుశా ఇక ఆ ముచ్చ‌ట కూడా అవ‌స‌రం లేదు. ఇన్నాళ్లూ ఆథ‌రైజ్డ్ డ్రైవింగ్ స్కూళ్ల‌లో శిక్ష‌ణ మాత్ర‌మే ఉండేది. ఇక ప‌రీక్ష‌లు కూడా డ్రైవింగ్ స్కూళ్ల చేతికే ఇస్తూ ఇటీవ‌లే కేంద్రం ఒక చ‌ట్టం తెచ్చింది. ఒక‌వైపు మ‌న‌కు బోలెడ‌న్ని ఆర్టీవో ఆఫీసులున్నాయి. ఆ ఆఫీసులు సువిశాలంగా, డ్రైవింగ్ టెస్టుల‌ను కండ‌క్ట్ చేసేందుకు అనుగుణంగా క‌ట్టారు. అలాంటి చోట్ల డ్రైవింగ్ టెస్టులు జ‌ర‌గ‌డం, ఆర్టీవో ప‌రీక్ష‌కు వ‌చ్చిన వారిని ప‌ర్య‌వేక్షించిన అనంత‌ర‌మే లైసెన్స్ జారీ కావ‌డం జ‌రుగుతూ వ‌చ్చింది. ఇక ఆర్టీవో ఆఫీసుల‌న్నీ వెల‌వెల‌బోనున్నాయి. టెస్టులు కూడా ప్రైవేట్ వారే పెట్టి, వారే పాస్ చేసేస్తార‌ట‌. ఇక ఆర్టీవోకు వెళ్లే ప‌ని లేదు.

ఇన్నాళ్లూ డ్రైవింగ్ లైసెన్స్ కు ఒక విలువ ఉండేది. అడ్ర‌స్ ఫ్రూఫ్ గా, వ్య‌క్తిగ‌త ఫ్రూఫ్ గా కూడా అది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎందుకంటే.. దాన్ని జారీ చేసే ఆఫీస‌ర్ ను మీరు వ్య‌క్తిగ‌తంగా క‌లుస్తారు. మీరు ఎవ‌రు, మీ అడ్ర‌స్ ఏమిట‌నే విష‌యాన్ని ఆఫీస‌ర్ ప‌రిశీలిస్తాడు. వ్య‌క్తిగ‌త నిర్ధార‌ణ‌కు కూడా అలా డ్రైవింగ్ లైసెన్స్ కు విలువ ఉండేది. త‌ప్పుడు అడ్ర‌స్ లు, న‌కిలీ వ్య‌క్తుల పేర్ల‌తో లైసెన్స్ లు తెచ్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మే. అయితే… ఇక మొత్తం వ్య‌వ‌హారం ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్తుంది. అక్క‌డ వారు ఏం చేస్తే అదే చ‌ట్టం అయ్యే అవ‌కాశం ఉంది.

ఐదారు వేలు చేతిలో పెడితే డ్రైవింగ్ రాని వారికి కూడా లైసెన్స్ తెప్పించ‌గ‌ల ఘ‌నాపాటి బ్రోక‌ర్లు ఇప్ప‌టికే చాలా మంది ఉన్నారు. ఇన్నాళ్లు అందులో కొంత వాటాను ఆర్టీవోల‌కు ఇచ్చేవారు. ఇక ఆర్టీవోల‌కు ఆ వాటా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా బ్రోక‌ర్లు, కొన్ని డ్రైవింగ్ స్కూళ్లే మొత్తం దందాను న‌డిపించ‌డానికి కేంద్రం సువ‌ర్ణావ‌కాశం ఇచ్చింది. ఇక వాళ్లు దున్నుకోవ‌డ‌మే త‌రువాయి! ఎక‌రాలకు ఎక‌రాల్లోని ఆర్టీవో ఆఫీసుల‌ను అలంకార‌ప్రాయంగా మార్చి,  బ్రోక‌ర్ల‌కు, ప్రైవేట్ వ్య‌క్తుల‌కూ అదికారాల‌ను అప్ప‌గిస్తూ.. మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రో గొప్ప నిర్ణ‌యం ఇది!