నిర్మాతల మధ్య మంచి సంబంధాలు వున్నాయని, మీడియానే చెడగొడుతోందని నిర్మాత దిల్ రాజు ఆరోపించారు. కార్తికేయ2 ఫంక్షన్ లో ఆయన రెండురకాల ఆరోపణలు చేసారు. ఒకటి తెలియకుండా తోచిన వార్తలు రాస్తున్నారని, కన్ ఫర్మ్ చేసుకుని రాయమని.
రెండవది యూ ట్యూబ్ వ్యూస్ కోసం ఏవేవో చేస్తున్నారని. ఈ రెండో విషయం గురించి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అది నిజం కనుక. చాలా యూ ట్యూబ్ చానెళ్లు ఇదే చేస్తున్నాయి. కంటెంట్ తో సంబంధం లేని థంబ్ నెయిల్స్ పెడుతున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన కార్తికేయ2 సక్సెస్ మీట్ వీడియోలకు కూడా దిల్ రాజు ప్రస్తావన లేకున్నా ఆయన పేరుతో థంబ్ నెయిల్స్ పెట్టేసారు. అంతెందుకు ఓ మెయిన్ స్ట్రీమ్ లీడ్ మీడియా తను పెట్టిన విడియో థంబ్ నెయిల్ చిరంజీవి పేరు వాడేసింది. నిఖిల్ ఆయన పేరు ప్రస్తావించకుండానే. అందువల్ల దిల్ రాజు ఆవేదన లేదా ఆగ్రహంలో సగం వరకు నిజం వుంది.
ఇక పోతే తెలుసుకుని రాయడం అన్నది. క్లారిఫికేషన్ తీసుకోవడం అన్నది. ప్రతి చిన్న వార్తకు క్లారిఫికేషన్ తీసుకోవడం, ఇవ్వడం రెండూ సాధ్యం కాదు. కార్తికేయ2 విడుదల డేట్ కు సంబంధించి దిల్ రాజు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంది.
జూలై 22 డేట్ ను తానే అడిగా అని దిల్ రాజు చెప్పారు. నైజాంలో, వైజాగ్ లోనే కాదు, అన్ని ప్రాంతాల్లో తన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వున్న దిల్ రాజు అలా అడిగితే ఏ నిర్మాత అయినా కాదనగలరా? ఒక సినిమా మంచి డేట్ వేసుకుకున్నాక అలా అడిగి తీసుకోవడం కరెక్టేనా? పైకి ఏమీ చెప్పకపోయినా ఆ నిర్మాతలు ఎంత స్ట్రగుల్ పడి వుంటారో అర్థం అవుతుంది కదా?
22 నుంచి జరిగితే 29న రామారావు ఆన్ డ్యూటీ, 5న సీతారామం, బింబిసార, 12న మాచర్ల సినిమాలు వున్నాయి కదా, కార్తికేయ2 నిర్మాతలు ఇబ్బంది పడతారని దిల్ రాజు ఊహించలేదా?
నిర్మాతలు సినిమాను కాపీ లెక్కన అమ్మేసారు. ఈ డేట్ మారడం వల్ల అలా కొన్న వారు వెనక్కు వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా? దాని వల్ల చాలా ఏరియాలు స్వంతగా విడుదల చేసుకోవడం నిజం కాదా? హిట్ అయింది కాబట్టి అంతా హ్యాపీ. లేదూ అంటే ఎంత నష్టం?
హీరో నిఖిల్ తన తొలి ఇంటర్వూలోనే తనను బలవంతంగా వెనక్కు పంపారని చెప్పడం, ఒకటి రెండు రోజులు ఏడ్చానని చెప్పడం రికార్డెడ్ గానే వుంది కదా? ఎందుకు ఏడ్చావు అని స్టేజ్ మీద పక్కనే వున్న నిఖిల్ ను అడిగి వుండొచ్చు కదా?
పీపుల్స్ మీడియా జనాలను, నిఖిల్ ను ఇద్దరు బడా డిస్ట్రిబ్యూటర్లు సునీల్, దిల్ రాజు కూర్చోపెట్టి థియేటర్ల సమస్య వివరించి, వెనక్కు వెళ్లమని చెప్పినది వాస్తవమా? కాదా?
అప్పుడు, ఓ పెద్ద రాజకీయ అధికార పార్టీ నేత దిల్ రాజు కు, సునీల్ కు ఫోన్ చేసి కుర్రాడిని ఇబ్బంది పెట్టొద్దు, థియేటర్లు ఇవ్వండి అని చెప్పినది, ఆ మేరకు ఇద్దరూ అంగీరించినది వాస్తవమా? కాదా?
తనకు బంధువు అవుతారు కనుక, తానే ఆ పెద్దాయిన వద్దకు వెళ్లి, ఈ విషయంలో సాయం చేయమని కోరానని నిఖిల్ నే స్వయంగా చెప్పారు.
దురదృష్ట వశాత్తూ మాచర్ల సినిమా ఫ్లాప్ అయింది కనుక కార్తికేయ 2 సినిమాకు థియేటర్లు పెరిగాయి. అదే ఆ సినిమా హిట్ అయి వుంటే డేట్ మారినందుకు కార్తికేయ2 సినిమా పరిస్థితి ఏమిటి?
సరే, ఇప్పుడు దిల్ రాజు తన మీద మీడియా రాళ్లేస్తోందని, మూసుకు కూర్చోవాలని హుంకరించారు. మరి గతంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను బాహాటంగా చేసిన విమర్శల మాటేమిటి?
దిల్ రాజు కు కార్తికేయ 2 టీమ్ కు మధ్య జరిగిన వార్తలు బయటకు ఎలా వస్తాయి? ఎవరో ఒకరు చెప్పకుండా అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా?
మీడియాను బ్లేమ్ చేయడం సలువు. బాధ పడిన వారు మీడియా దగ్గర బాధపడి, లీకులు ఇస్తారు. బాధ పెట్టిన వారు మీడియా మీద రాళ్లేస్తారు. అంతే..అంతకన్నా ఏం లేదు.