బాబును రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టిచ్చిన‌ ఈనాడు

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన జ‌ల‌వివాదం చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. బాబు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నార‌నే వాస్త‌వాన్ని, ఆయ‌న భ‌గ‌వ‌ద్గీత‌గా భావించే ఈనాడు ప‌త్రికే రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టిచ్చింది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో స్థిర…

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన జ‌ల‌వివాదం చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. బాబు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నార‌నే వాస్త‌వాన్ని, ఆయ‌న భ‌గ‌వ‌ద్గీత‌గా భావించే ఈనాడు ప‌త్రికే రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టిచ్చింది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌లో స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకున్న చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడితే కేసీఆర్ నుంచి ఎలాంటి ముప్పు ఏర్ప‌డుతుందోన‌నే భ‌యప‌డుతున్నార‌నే వాద‌న కొన్ని రోజులుగా విన‌వ‌స్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా తాజా ఘ‌ట‌న నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా జలాల విష‌య‌మే వివాదం నెల‌కున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు అధ్య‌క్షత‌న ఆన్‌లైన్‌లో టీడీపీ ముఖ్య‌నేత‌ల స‌మావేశం జ‌రిగింది. సాధార‌ణంగా ఏ స‌మావేశ‌మైనా బాబు మాట్లాడిన‌ట్టు సంబంధిత అంశాల‌ను హైలెట్ చేస్తూ టీడీపీ అనుకూల మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించ‌డంతో పాటు ప్ర‌సారం చేసే విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో జ‌ల‌వివాదంపై నిర్వ‌హించిన స‌మావేశం వార్త‌ను మాత్రం టీడీపీ నేత‌లంటూ రాసుకురావ‌డం వెనుక చంద్ర‌బాబు భ‌యాన్ని ప్ర‌తిబింబిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. స‌ద‌రు స‌మావేశ వార్త‌ను ఈనాడు ప‌త్రిక రాసిన తీరు గ‌మ‌నిస్తే… బాబు భ‌యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

“శ్రీ‌శైలంలో నీటి హ‌క్కుల్ని కాపాడ‌లేక చేతులెత్తేసిన జ‌గ‌న్‌రెడ్డి పుట్టిన గ‌డ్డ‌కే ద్రోహం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. ఆయ‌న అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రాయ‌ల‌సీమ‌లో పారాల్సిన కృష్ణా జలాలు స‌ముద్రం పాల‌వుతున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్‌ను ఖాళీ చేస్తుంటే మ‌న సీఎం ఉత్తుత్తి లేఖ‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కృష్ణా జల వివాదంపై సీఎం అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లాల‌ని డిమాండ్ చేశారు”

“రాయ‌ల‌సీమ‌కు మ‌రో జీవ‌నాడి లాంటి ముచ్చుమ‌ర్రి ప్రాజెక్టును రెండేళ్ల‌యినా పూర్తి చేయ‌కుండా జ‌గ‌న్ పుట్టిన గ‌డ్డ‌కు ద్రోహం చేశార‌ని నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎలాంటి వివాదాల్లేని ముచ్చుముర్రి ప్రాజెక్టు ద్వారా 792 అడుగుల నుంచి నీరు తీసుకుని, రాయ‌ల‌సీమ‌లోని అన్ని కాలువ‌ల‌కు నీళ్లివ్వ‌చ్చు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముచ్చుమ‌ర్రిలో మూడు తూముల్లో నీటిని విడుద‌ల చేసింది. మిగిలిన 13 తూముల‌ను ఈ రెండేళ్ల‌లో పూర్తి చేసి ఉండొచ్చు. కేసీఆర్‌తో జ‌గ‌న్ లాలూచీ ప‌డి రెండేళ్ల‌యినా దీన్ని పూర్తి చేయ‌కుండా నేడు జ‌ల జ‌గ‌డం నాట‌క‌మాడుతున్నారు”

ఇంత‌కూ కేసీఆర్‌తో లాలూచా? లేక భ‌య‌మా? ఎందుక‌ని చంద్ర‌బాబు నోరు మెద‌ప‌లేక పోతున్నార‌నే ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు వెల్లువెత్తుతున్నా…స‌మాధానం చెప్ప‌క‌పోగా త‌ప్పించుకునేందుకు ఇలాంటి ఛీప్‌ట్రిక్స్‌కు పాల్ప‌డ‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ స‌మావేశంలో టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌, చినరాజ‌ప్ప‌, సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి …త‌దిత‌ర నేత‌లు పాల్గొన్నారు.