జ‌గ‌న్ నుంచి జ‌నం కోరుకుంటున్న‌దిదే!

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పెంచుతున్నారు. త‌న ప్ర‌భుత్వానికి సంక్షేమ బాట అని ఆయ‌న స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అయితే అప్పులు చేసి, బ‌ట‌న్ నొక్కి సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తున్న…

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పెంచుతున్నారు. త‌న ప్ర‌భుత్వానికి సంక్షేమ బాట అని ఆయ‌న స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అయితే అప్పులు చేసి, బ‌ట‌న్ నొక్కి సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తున్న మాట నిజ‌మే కానీ, అభివృద్ధి మాటేది? అనే ప్ర‌శ్న వెంటాడుతోంది. ప‌రిశ్ర‌మ‌లు ఎక్క‌డ‌? అనే నిల‌దీత పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో అడ‌పాద‌డ‌పా త‌ప్ప చెప్పుకోత‌గిన ప‌రిశ్ర‌మ‌లు రాలేద‌నే విమ‌ర్శ వుంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ప‌రిశ్ర‌మ ప్రారంభం, అలాగే శంకుస్థాప‌న‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వెళ్ల‌నుండ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. వైఎస్ జ‌గ‌న్‌పై ఎన్నో ఆశ‌లు, న‌మ్మ‌కంతో ఓట్లు వేశారు. 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట్ స్థానాల‌ను క‌ట్ట‌బెట్టారు. గ‌తంలో ఏ పార్టీకి ద‌క్క‌నన్ని ఓట్ల శాతం వైసీపీ సొంత‌మైంది. ఇదంతా ప్ర‌జాద‌ర‌ణే పుణ్య‌మే.

అయితే సంక్షేమ పథ‌కాల అమ‌లుపై చూపుతున్న శ్ర‌ద్ధ‌, ఇత‌ర అంశాల‌పై క‌న‌బ‌ర‌చ‌లేద‌నే విమ‌ర్శ బ‌లంగా ఉంది. అప్పు చేసి ప‌ప్పుకూడు రాష్ట్రానికి ఎంత వ‌ర‌కు మంచిద‌నే ప్ర‌శ్న‌లొస్తున్నాయి. దీంతో గ‌త ఆరు నెల‌లుగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై సీఎం జ‌గ‌న్ స‌హా సంబంధిత శాఖ ఉన్న‌తాధికారులు పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లి (సెజ్‌)లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  మంగ‌ళ‌వారం ఏటీసీ టైర్ల ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు మ‌రో ఎనిమిది ప‌రిశ్ర‌మ‌ల నిర్మాణానికి భూమి పూజ చేయ‌నున్నారు. 249 ఎక‌రాల్లో రూ.3,202 కోట్ల పెట్టుబ‌డుల‌తో స్థాపించే ఈ ప‌రిశ్ర‌మ‌ల్లో 4,664 మందికి ఉపాధి ల‌భించ‌నుంది.

ఇలాంటివి జ‌గ‌న్ పాల‌న‌లో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌గ‌న్ పాల‌న‌కు గ‌ట్టిగా రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. వీలైన‌న్ని ఎక్కువ ప‌రిశ్ర‌మ‌లు తీసుకొస్తేనే ప్ర‌భుత్వానికి అన్ని వ‌ర్గాల్లో మంచి పేరు వ‌స్తుంది. అలా కాదంటే కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ప్ర‌భుత్వంగా మిగిలిపోతుంది. ఇది రాజ‌కీయంగా లాభ‌మా? న‌ష్ట‌మా? అనేది జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే అంచ‌నా వేసుకోవాల్సి వుంటుంది.