‘మా’ లొల్లి మాది.. ‘సినిమా’ సంగతి మాకెందుకు?

సినిమాటోగ్రఫీ చట్టానికి కేంద్రం చేసిన సవరణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అన్ని సినీ పరిశ్రమల్ని ఇది షేక్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన అమీర్ ఖాన్ లాంటి తారల నుంచి సౌత్ కు…

సినిమాటోగ్రఫీ చట్టానికి కేంద్రం చేసిన సవరణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అన్ని సినీ పరిశ్రమల్ని ఇది షేక్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన అమీర్ ఖాన్ లాంటి తారల నుంచి సౌత్ కు చెందిన కమల్ హాసన్, సూర్య వరకు చాలామంది తమ నిరసన తెలిపారు. విశాల్, కార్తి, గౌతమ్ మీనన్, భారతీరాజా.. ఇలా ఎంతోమంది ప్రముఖులు గళమెత్తారు. కానీ టాలీవుడ్ కు మాత్రం ఈ సమస్య పట్టడం లేదు.

రాబోయే రోజుల్లో సినీపరిశ్రమను అతలాకుతలం చేయబోయే ఈ సవరణపై టాలీవుడ్ స్టార్ హీరోలు మౌనం దాల్చారు. ఎలా రియాక్ట్ అయితే, ఏమౌతుందో అనే భయాందోళనలో పడిపోయారు. అంతా ఒక్కతాటిపై నిలిచి ఖండించాల్సిన సమయంలో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

“మనదాక వస్తే అప్పుడు చూసుకుందాంలే” అనే వ్యవహారశైలి టాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఉంది. సినిమాల్ని ఓటీటీలకు ఇచ్చే నిబంధనలు, థియేటర్ల సమస్యపై కూడా ఇలానే వ్యవహరించారు చాలామంది. ఇప్పుడీ సెన్సార్ నిబంధనల సవరణ వివాదంపై కూడా టాలీవుడ్ హీరోలు, మేకర్స్ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. 

'ఏదో జరుగుతోంది జరగని, తర్వాత చూద్దాం' అనే మైండ్ సెట్ తో ఉన్నారు. మరికొంతమంది మాత్రం సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేంద్రానికి రాసిన ఉమ్మడి లేఖలో సంతకం పెట్టి మమ అనిపించినట్టున్నారు. దాదాపు 1400 మంది సంతకాలు పెట్టారు. అందులో టాలీవుడ్ నుంచి ఎవరెవరు సంతకాలు పెట్టారనేది బయటకురాలేదు.

అయినా ఇలాంటి టైమ్ లో సంతకంతో సరిపెట్టడం సరికాదు. బయటకొచ్చి తమ గళం వినిపించాలి. కనీసం హీరో సుధీర్ బాబులా ఒక ట్వీట్ అయినా వేయాలి. ఆ మాత్రం తీరిక కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉన్నట్టు లేదు. పైగా ఇప్పుడు టాలీవుడ్ లో 'మా' యుద్ధం జోరుగా సాగుతోంది.

కాబోయే 'మా' అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఇప్పటికే 2-3 వర్గాలు ఏర్పడ్డాయి. పొద్దున్న లేస్తే ఎవరి లాబీయింగ్ లో వాళ్లు ఉన్నారు. ఎవరి రాజకీయాల్లో వాళ్లు మునిగిపోయారు. కొంతమంది పాత లెక్కల్ని సరిచేసే పనిలో పడితే, మరికొంతమంది తమకు మకిలి అంటకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో పడ్డారు.

టాలీవుడ్ లో ప్రముఖులు చాలామంది ఇలా బిజీ అయిపోయారు. సినిమా భవితవ్యాన్ని శాసించే, సినిమాటిక్ స్వేచ్ఛను హరించే ఈ చట్టంపై వీళ్లకు బెంగ లేదు. రాబోయే రోజుల్లో సినిమాను దారుణంగా తొక్కేసే ఈ సవరణపై వీళ్లకు అస్సలు ఆలోచన లేదు. ఎందుకంటే, వీళ్లకు ఇప్పుడు దానికంటే ''మా'' వ్యవహారాలు ఎక్కువయ్యాయి.