అమావాస్యకో, పుణ్నానికో అన్నట్టుగా తయారైంది జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయం. పవన్‌కల్యాణ్ నిలకడలేని తనం ప్రతి అంశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆయన మాట్లాడిన ఏ మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు.
ఇక సినిమాల్లో నటించనని, పూర్తిస్థాయిలో రాజకీయాలకే అంకితమవుతానని ప్రకటించారు. ఆ తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక …ఏమైందో అందరికీ తెలుసు. పవన్‌కల్యాణ్ రాజకీయంపై సీపీఐ నేత నారాయణ వ్యంగ్యంగా అన్న మాటలను గుర్తు చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యటిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న జలవివాదాలు, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై ఆయన తన పార్టీ నేతలతో చర్చిస్తారని సమాచారం.
మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వాన్ని తిట్టడానికే పరిమితం అవుతారా? లేక ఏదైనా పోరాట పిలుపు ఇస్తారా? అనేది ఇంకా తెలియడం లేదు. అలాగే జూలై 7న ఆయన మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో చర్చించనున్నారు.
పవన్ పర్యటన, చర్చించాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే ముందు ఏఏ ప్రధాన సమస్యలపై అధినేత చర్చించాలో అవగాహన కోసం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. చాలా రోజుల తర్వాత ఆంధ్రాకు వస్తున్న పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడ్తారనే దానిపై ఆసక్తి నెలకుంది. మరోవైపు బీజేపీతో కలిసి ఏదైనా చేస్తారా? అనేది ఆయన పర్యటనతో స్పష్టమయ్యే అవకాశం ఉంది.