మునుగోడు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయిలో రాజకీయ కాక పుట్టిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. పరస్పర విమర్శలతో ఇప్పటికే బాగా కాక పెంచాయి. అయితే మునుగోడు ఎన్నికల బరిలో.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సిద్ధంగా ఉందా? తాను వినిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి మునుగోడు ఉప ఎన్నికను కూడా ఒక వేదికగా మార్చుకుంటుందా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది!
వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, తన తండ్రి పేరుతో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఏడాది దాటింది. ఈ ఏడాది రోజులపాటు ఆమె దాదాపుగా ప్రజల మధ్యనే గడుపుతూ ఉన్నారు. నిరుద్యోగం అనేది ప్రధాన ఏజెండాగా కేసీఆర్ మీద నిశిత విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తెలంగాణలో అనేక ప్రాంతాలను కవర్ చేస్తూ పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఏడాదిగా చేస్తున్న కృషికి ఇప్పటిదాకా లభించిన ఫలితం ఎంత? ఏడాదిగా కేసీఆర్ మీద కురిపిస్తున్న విమర్శలకు ఇప్పటిదాకా ప్రజలలో సాధించిన స్పందన ఎంత? ఈ విషయాలను షర్మిల ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పని చేయడానికి మునుగోడు ఎన్నికలలో బరిలోకి దిగడానికి మించి వేరే మార్గం లేదు.
నల్గొండ జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఒక స్థాయిలో ఆదరణ ఉంది. షర్మిల పార్టీలో ఆ జిల్లా నుంచి నాయకులు కూడా ఉన్నారు. షర్మిల ఇప్పటికే అనేక బహిరంగ సభలలో మాట్లాడుతూ.. 2023 ఎన్నికలలో తన అధికారంలోకి వచ్చిన వెంటనే, అది చేస్తా ఇది చేస్తా అని అనేక హామీలు గుప్పించారు! మరి రాబోయే ఏడాదిలో జరిగే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలనని నమ్ముతున్న షర్మిల, ఏడాది నుంచి తాను నడుపుతున్న పార్టీకి.. ఇప్పటిదాకా దక్కిన ప్రజాదరణ ఎంతో చూసుకోవాలి కదా! అందుకే మునుగోడు ఉపఎన్నిక బరిలోకి దిగాలని పలువురు సూచిస్తున్నారు!
మునుగోడు లో జరిగేది సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణం వలన వచ్చిన ఉపఎన్నిక కాదు. సానుభూతి సాంప్రదాయంతో పోటీ నుంచి విరమించుకోవడానికి అవకాశం లేదు. మునుగోడు ఉపఎన్నిక అనేది కేవలం ఆధిపత్య ప్రదర్శన, అహంకార ప్రదర్శన లకు తార్కాణం మాత్రమే అలాంటి ఎన్నికలో వారికి బుద్ధి చెప్పాలంటే షర్మిల రంగంలోకి దిగడమే బాగుంటుంది!
తెలంగాణలో ప్రధాన పార్టీల నాయకులు ఎవరూ కూడా షర్మిల ఉనికిని గుర్తించనట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఆమె సంకల్పించిన ప్రజాప్రస్థానానికి చాలా అవమానకరమైన సంగతి ఇది. ఇలా ఆమె పార్టీని, ప్రయత్నాన్ని, కష్టాన్ని చిన్నచూపు చూస్తున్న వారికి.. కనువిప్పు కలిగించడం కోసం కూడా షర్మిల మునుగోడు బరిలో తమ అభ్యర్థిని దింపి, తాను సాధించగల ఓటు శాతం ఎంతో వారికి చూపించాల్సి ఉంది.
షర్మిల పార్టీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది. ఆమె కేసిఆర్ కు మేలు చేయడానికి మాత్రమే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసమే పార్టీ పెట్టింది.. అని నిందిస్తున్న వారు ఉన్నారు. ఒకవేళ షర్మిల బరిలోకి దిగి ఆమెకు కొన్ని వేల ఓట్లు లభించి ఆ తేడాతో తెరాస అభ్యర్థి విజయం సాధిస్తే గనుక ఈ ఆరోపణలు నిజం అవుతాయి.
ఇదంతా షర్మిల ఎంత సీరియస్ గా మునుగోడులో పోరాడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అసలు బరిలోకి దిగకుండా ప్రేక్షకుడి పాత్ర పోషిస్తే మాత్రం షర్మిల ఇంకా అనేక రకాల విమర్శలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది కాకపోతే బరిలోకి దిగకుండా మిన్నకుండడం.. ఇంతకాలం కష్టపడి సంపాదించిన బలాన్ని తెలుసుకోకుండా, తూకం వేసుకునే ప్రయత్నం చేయకుండా.. గుడ్డిగా ముందుకు సాగిపోతే అది షర్మిలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది!