సీనియర్ హీరోయిన్ మీనా స్ఫూర్తి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆమె వెల్లడించారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మీనా అవయవదానం చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయం.
దేశంలో అవయవదానంపై ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. మనిషి చనిపోయిన తర్వాత మూడు లేదా మూడున్నర గంటల్లోపు నేత్రాలను దానం చేయవచ్చు. దీని వల్ల ఎంతో మందికి చూపు ప్రసాదించవచ్చు. ఇటీవల కాలంలో కార్నియాల దానంపై చైతన్యం పెరిగింది. గతంలో కార్నియాలను దానం చేస్తే, మరో జన్మలో అంధత్వంతో పుడుతారనే మూఢ నమ్మకం భయపెట్టేది. సైన్స్ పురోభివృద్ధి చెందుతున్న క్రమంలో నేత్రదానంపై అవగాహన పెరిగింది.
అలాగే మిగిలిన అవయవాల దానంపై కూడా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్యులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి నుంచి ఎలాంటి అవయవాలు సేకరించవచ్చో సంబంధిత వైద్యులు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మరణానంతరం తమ మృతదేహాన్ని వైద్యశాలకు దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. ఈ మేరకు మరణానంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సమీపంలోని వైద్యశాలకు అందజేస్తున్నారు. ఇది వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఎంత ఎక్కువ అవయవ దానం జరిగితే అంత మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు అవుతుంది. సీనియర్ నటి అవయవదానం ప్రకటనతో జనంలోకి ఈ అంశం బాగా వెళుతుంది. ముఖ్యంగా అవయవదానంపై అవగాహన లోపం వల్లే నత్తనడకన సాగుతోంది. మూఢనమ్మకం పోగొట్టడంతో పాటు చైతన్యం కలిగిస్తే ఎంతో మంది అవయవదానం చేయడానికి తప్పక ముందుకొస్తారు.