వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకూ వెళుతున్నారు. ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఏఏ ఇంటికి ఎంతెంత లబ్ధి కలిగిందో వివరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ఇళ్ల వద్దకే రావడంతో కొందరు అపరిష్కృత సమస్యలను వారి దృష్టికి తీసుకెళుతున్నారు.
అయితే కొందరు ఓవరాక్షన్ చేయడం, వారిని ఎల్లో మీడియా ఆకాశానికెత్తడం అంతా పథకం ప్రకారం జరుగుతోందన్న అనుమానాల్ని వైసీపీ వ్యక్తం చేస్తోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి గడపగడపకూ కార్యక్రమానికి వెళ్లారు. ఒక వ్యక్తి ఓవరాక్షన్ చేయడం గమనార్హం. అదే ఎల్లో మీడియాకు కావాల్సింది కూడా. శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం వల్ల కలిగే ప్రయాజనాల కంటే, ఎవరో ఒకరిద్దరు అతి చేస్తే, అదే అందరి అభిప్రాయం అన్న రీతిలో కలరింగ్ ఇస్తున్నారు. సదరు వ్యక్తి వింత వైఖరి ఏవగింపు కలిగిస్తోంది.
‘సొంత ఇల్లు.. సొంత కార్లు ఉన్న వాళ్లకు ప్రభుత్వ పథకాలు రావని చెప్తున్నారు.. రాబోయే రోజుల్లో సొంత పెళ్లాం ఉన్న వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు రావని అంటారేమో’ అని గడికోట శ్రీకాంత్‌రెడ్డితో ఆ వ్యక్తి అన్నాడు. అతని మానసిక స్థితి బాగాలేదని ఈ మాటలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలనేవి పేదల కోసం. అంతే తప్ప, కార్లు, మేడలున్న వాళ్ల కోసం కాదని జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు. సొంత పెళ్లాం ఉంటే కూడా సంక్షేమ పథకాలు రావని అంటారేమో అని అవివేకంగా మాట్లాడిన వాడి వికృతచేష్టలను సమాజం ఏవగించుకోకుండా వుంటుందా?
సంక్షేమ పథకాలకు, పెళ్లాలకు ఏంటి పోలిక? ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడితే హీరో అవుతారా? ఇలాంటి వ్యక్తి మరెవరితోనైనా ఇలాగే వ్యవహరించడా? నిజంగా ప్రజాసమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తే తప్పక అభినందించాలి.
ఇది నిలదీయడం అనరు. పొగరు, అజ్ఞానం కలిసిన వ్యక్తి నుంచి వచ్చే మాటలని అంటారు. సమస్యలను పరిష్కరించుకోవాలంటే కాస్త జ్ఞానంతో మాట్లాడాల్సి వుంటుంది. అది కరువైతే వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలే ఎదుర్కోవాల్సి వుంటుంది.