“దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అంటూ తనదైన శైలిలో డైలాగులు పలుకుతూ ఒక తరం ప్రేక్షకులను అలరించాడు.. దివంగత సీనియర్ నటుడు నూతన ప్రసాద్! 'క్లిష్ట పరిస్థితుల్లో' అనే పదాన్ని చాలా చాలా పాపులర్ చేసేసాడు. దేశం సంగతి ఏమోగానీ.. రాజకీయం మాత్రం నాయకులకు చాలా చాలా సందర్భాలలో క్లిష్ట పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటుంది!
తమను రాజకీయ వాతావరణం అలా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసినప్పుడు నాయకులకు కరోనా అనేది ఒక ఆపద్బంధువులాగా అదుకుంటోందా.. అనే అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతోంది. ఎందుకంటే పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారుతున్నప్పుడు నాయకులు.. కరోనా బారినపడి హోం క్వారంటాయిన్ కు వెళుతున్నారు.
రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు.. ఎంచక్కా కరోనా బారిన పడడం ఒక అదృష్టం! ఎటొచ్ఛీ కరోనా వ్యాధి అంటే అది సోకగానే ప్రాణం పోయినట్టే అని భయపడే రోజులు మారిపోయాయి. కోవిడ్ పాజిటివ్ అనేది ఒక సాధారణ రోగం లాగా సోకడము తగ్గిపోవడం చాలామంది విషయాల్లో చాలా తరచుగా జరుగుతూనే ఉంది. కాకపోతే ఇంకా సాధారణ జలుబు జ్వరం లాగా కరోనాను పరిగణించడం లేదు కాబట్టి, హోమ్ క్వారంటాయిన్ మాత్రం అందరూ పాటిస్తున్నారు.
రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు పాజిటివ్గా తెలిస్తే కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి! ఎంచక్కా ఇల్లు కదలకుండా కూర్చోవచ్చు! ఎవరూ వచ్చి డిస్టర్బ్ కూడా చేయరు!! ఇంట్లోంచి కాలు బయట పెట్టవలసిన అవసరమే లేదు. కాలు బయట పెడితే మీడియా వాళ్ళు చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలతో వేధించుకు తినడం కూడా ఉండదు. హాయిగా ఇంట్లో కూర్చుని ఓటిటిలో సినిమాలు చూసుకుంటూ ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేయొచ్చు.
కరోనా ఇలా విశ్రాంతిని రిలాక్సేషన్ను ప్రసాదిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు అడిగి మరీ కరోనా తెచ్చుకుంటున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది.! పాజిటివ్ అని తేలకపోయినా సరే కరోనా వచ్చినట్లుగా ఒక ట్వీట్ కొట్టేసి అక్కడితో రెస్ట్ మోడ్ లోకి మారిపోవడం రివాజుగా మారుతోందా అనిపిస్తుంది!
ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అనారోగ్యం బారిన పడ్డారు. ఖాళీగా ఇంట్లో ఉండలేక ఓటీటీ లో చూడడానికి మంచి సినిమాల పేర్లు సలహా చెప్పండి అంటూ సరదాగా ఒక ట్వీట్ కూడా పెట్టారు! ఆ సందర్భంలో ఆయనకు వచ్చిన రాజకీయ ఇబ్బందికర వాతావరణం ఏమి లేదు గాని.. మరికొందరు పోకడలు అలాంటి అభిప్రాయం కలిగిస్తున్నాయి!
మహారాష్ట్రలో అధికార మార్పిడి సంక్షోభం తలెత్తిన సమయంలో అప్పటి ముఖ్య మంత్రి ఉద్దవ్ ఠాక్రే కరోనా బారిన పడ్డారు. పార్టీలో తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే క్యాంపు రాజకీయాలతో జడిపిస్తూ ఉంటే ఉద్ధవ్ మాత్రం ఇంటి నుంచి వీడియోస్ సందేశాలను విడుదల చేస్తూ కూర్చున్నారు. శివసేన పార్టీ దాదాపు సమూలంగా ఆయన మీద తిరుగుబాటు చేసిన నేపథ్యం అది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మార్చడానికి చేసిన కుట్ర అది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. తన అచేతనత్వం బయటపడకుండా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ కరోనా ముసుగు కింద ఉండిపోయారు! నిజంగా వచ్చిందో లేదో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన కొన్నాళ్ళు ఏకాంతం తర్వాత బయటకు వచ్చి, అధికార నివాసం వీడి సొంత ఇంటికి వెళ్లారు!!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా తరువాత.. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు! ఏం చేయడానికి ఆయనకు పాలు పోవడం లేదు! మునుగోడు ఉప ఎన్నిక మెడమీద కత్తిలా వేలాడుతోంది!!
భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధం అవుతుంది. “మీకు మించిన సభ మీ కంటే ముందు నేనే పెడతా” అన్నట్టుగా వారి కంటే ఒకరోజు ముందు కేసీఆర్ మరో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు! కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు.. మునుగోడు ఎన్నిక కోసం జాతీయ నాయకత్వం నుంచి రాహుల్ లాంటి వారిని తీసుకురాగల సత్తా ఆ పార్టీకి లేదు! మునుగోడు ఎన్నికను గెలవగలిగే సీన్ కూడా లేదు! ఇలాంటి నేపథ్యంలో కేవలం కెసిఆర్ ను, కోమటిరెడ్డి రాజగోపాల్ ను తిట్టడం మాత్రమే కార్యాచరణగా రేవంత్ రెడ్డి ఎంత కాలం పని చేయగలరు!! అందుకే ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటాయిన్ లోకి వెళ్లారు.
ఆయన మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేలోగా ఈ రెండు కీలక సభలు ముగిసిపోతాయి! రేవంత్ రెడ్డి అబద్ధం చెబుతున్నారని అనడం లేదు కానీ… ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కరోనా వారిని ఆదుకుంటుంది అనేది మాత్రం సత్యం!