దేశవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంద్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జెండా ను ఆవిష్కరించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లడారు.
దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి.. మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి మహనీయులు మార్గదర్శకులన్నారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, అల్లూరి, గోవింద్‌గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు.
వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగిందని, బానిసత్వంలో భారతీయత భావన గాయపడిందన్నారు. అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందని, ప్రపంచ యవనికపై భారత్ తనదైన ముద్ర వేసిందన్నారు. మనందరి దగ్గర ఉన్న మార్గం కఠినమైందని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆకలికేకలు, యుద్ధాలు, తీవ్రవాదం సమస్యలకు ఎదురొడ్డి నిలిచామని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
‘‘ వచ్చే 25 సంవత్సరాలల్లో దేశ ప్రజలు 5 అంశాలపై ప్రధాన దృష్టిపెట్టాలన్నారు. 2047 సంవత్సరంకల్లా దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదలాలి. ఆ ఐదు అంశాల్లో 1.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపడం. 2.. దేశంలో ఇంకా ఎక్కడైనా కొంచెం బానిసత్వం ఉన్నా నిర్మూలించాలి. 3.. దేశ చరిత్ర, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలపై గౌరవం ఉండాలి. 4.. ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలి. 5.. దేశం కోసం దేశ లక్ష్యాల కోసం కృషిచేయాలనే వజ్ర సంకల్పం మనలో ఉండాలి’’ అని మోడీ చెప్పారు.
యువతను ఉద్దేశిస్తూ.. ‘‘ప్రస్తుతం 25 ఏళ్ల వయసు ఉన్న యువత.. మరో 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్లకు చేరుతారు. అప్పటిలోగా మన భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో యువత పురోగమించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు. ‘‘ మనం ఏది చేసినా.. ‘ఇండియా ఫస్ట్’ దృక్పథంతో చేయాలి. అప్పుడే దేశంలో, దేశ ప్రజల్లో ఐకమత్య భావన ఏర్పడుతుంది. స్త్రీ, పురుష సమానత్వం లేనిదే.. సమానత్వ భావనకు పరిపూర్ణత చేకూరదు’’ అని ఆయన తెలిపారు. మహిళలను గౌరవించడం అనేది నవ భారత కలలను సాకారం చేసేందుకు పునాదిగా మారుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.