బయోపిక్స్‌కు ప్రేక్షకుల గట్టి హెచ్చరిక!

-రాబోతున్న మరిన్ని జీవితగాథ సినిమాలు -వాస్తవానికి దగ్గరగా లేకపోతే అంతే సంగతులు -భారీ ఎత్తున రూపొందుతోన్న జయలలిత బయోపిక్‌ -వివాదాల తుట్టెను కదపగలరా? Advertisement హాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌ను పట్టుకుంది. ఆ…

-రాబోతున్న మరిన్ని జీవితగాథ సినిమాలు
-వాస్తవానికి దగ్గరగా లేకపోతే అంతే సంగతులు
-భారీ ఎత్తున రూపొందుతోన్న జయలలిత బయోపిక్‌
-వివాదాల తుట్టెను కదపగలరా?

హాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌ను పట్టుకుంది. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమనూ బయోపిక్‌ ట్రెండ్‌ అందుకుంది. తెలుగు, తమిళభాషల్లో బయోపిక్స్‌ వరసగా రూపొందుతూ ఉన్నాయి. ప్రముఖుల జీవిత కథల ఆధారంగా వివిధ సినిమాలు రూపొందుతూ వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి భారీ తనంతో, అనేక హంగూ ఆర్భాటలతో ఈ సినిమాలు రూపొందుతూ ఉన్నాయి. అయితే బయోపిక్స్‌ విషయంలో ప్రేక్షకులు మాత్రం ఒకే తరహా తీర్పును ఇస్తున్నారు. మీరు ఎంత గొప్పవ్యక్తి జీవితగాథను తెరకెక్కిస్తున్నారనేది కాదు, ఎంత వాస్తవిక ధోరణితో ఆ సినిమాలను రూపొందిస్తున్నారు.. అనేదే పాయింట్‌ అనే ధోరణితోనే బయోపిక్స్‌ విషయంలో ప్రేక్షకులు రియాక్ట్‌ అవుతూ ఉన్నారు.

'మహానటి' 'ఎన్టీఆర్‌' 'యాత్ర' వంటి బయోపిక్స్‌ వచ్చి వెళ్లిన నేపథ్యంలో ఇకపై బయోపిక్స్‌ తీయాలనుకునే వారందరూ ఆ సినిమాల ఫలితాలను, ఆ సినిమాల రూపకల్పన తీరును గమనించుకుని ముందుకుసాగాల్సి ఉంటుందని చెప్పవచ్చు. బయోపిక్‌ అనగానే.. భజన చేయడంకాదు, ఆ వ్యక్తులను దేవుళ్లుగా చూపడంకాదు. బయోపిక్‌ తీయడం అంటే సదరు వ్యక్తిని ఆకాశానికి ఎత్తేయడం కాదు. అనే సందేశాన్ని సినిమా వాళ్లకు ప్రేక్షకులు చాలా స్పష్టంగా ఇచ్చారు ప్రేక్షకులు. సందేశాలు ఇవ్వడం సినిమా వాళ్ల పనే కాదు, ప్రేక్షకులు కూడా సందేశాన్ని ఇస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం సినిమా వాళ్ల పని. ఒక ప్రముఖుడిని ఆకాశానికి ఎత్తేయడమే బయోపిక్స్‌తో చేయాల్సిన పని అనుకుంటే.. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ రెండుపార్ట్స్‌లో ఆ పనిని పతాకస్థాయిలో చేశారు. ఎన్టీఆర్‌ను దైవాంశగా అభివర్ణిస్తూ ఆ సినిమాలను రూపొందించారు. ఆయనా మనిషే అనే భావన ప్రేక్షకులకు కలగినిస్తే ఆయన ఎక్కడ తక్కువైపోతారో అనే లెక్కతో 'ఎన్టీఆర్‌' ను రెండు పార్ట్స్‌గా తీసేశారు!

ఎన్టీఆర్‌ను దైవాంశ సంభూతిగా చూపించేయడానికి అర్ధసత్యాలను, అసత్యాలను కూడా సినిమాలోకి జొప్పించడానికి దాని రూపకర్తలు ఏమాత్రం మొహమాట పడలేదు. ఎన్టీఆర్‌ పాత్రలో నటించడం బాలకష్ణకు ఫస్ట్‌పార్ట్‌లో అంత తేలికకాలేదు. యంగ్‌ ఎన్టీఆర్‌ ఫిజిక్‌ను ఏమాత్రం చూపలేకపోయి బాలకృష్ణ భంగపడ్డారు. ఇక ఎన్టీఆర్‌ సినీరంగ ప్రవేశం, నిర్మాతలు ఆయనతో వ్యవహరించిన తీరును కూడా అర్ధ సత్యాలతో నింపి ఆ బయోపిక్‌ను మరింత కంగాళీగా మార్చేశారని సినీ విమర్శకులు తేల్చారు. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండోపార్ట్‌ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది!

'బయోపిక్‌' అంటే తాము ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పడంకాదు, జరిగింది చెబితే ప్రేక్షకులు ఆసక్తి ఆ సినిమా మీద ఎంతో కొంత అయినా ఉంటుంది.అలాకాకుండా వ్యక్తిగత అజెండాలతో, ఏదో ఉద్దేశాలను కలిగించాలనే బయోపిక్స్‌ తీస్తే ఫలితం తేడా ఉంటుంది. అదెలా ఉంటుందో ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండుపార్ట్స్‌ ఫలితాన్ని బట్టి చెప్పవచ్చు. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన 'డర్టీ పిక్చర్‌' విషయంలో అయినా సౌత్‌లో ఆకట్టుకున్న 'మహానటి'లో అయినా ఎంతోకొంత వాస్తవాలను ప్రస్తావించారు. సదరు వ్యక్తుల బలహీనతలను ఆ సినిమాల్లో స్పష్టంగా చూపించారు. ఆ బలహీనతలను ఏర్పడటానికి వారు ఎదుర్కొన్న పరిస్థితులను కన్వీన్సింగ్‌గా చూపించి ఉండవచ్చు. వాళ్లు బలహీనతలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వైనాలను కూడా అందంగా సమర్థించి ఉండవచ్చు. అయితే సదరు ప్రముఖుల పతనావస్థ గురించి ఎంతోకొంత వాస్తవాలను చూపే ప్రయత్నం జరిగింది ఆ బయోపిక్స్‌లో. అందుకే ఆ సినిమాలు ఆడాయి!

అలాకాకుండా అంతా పాలిష్‌ చేస్తే పరిస్థితుల్లో తేడా వస్తుంది. 'యాత్ర' సినిమాలో కూడా వైఎస్‌ను ఒక రాజకీయ నేతగా చూపించారు. అంతేకానీ ఒక సూపర్‌ మ్యాన్‌గా చూపించలేదు. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు చేత ఫైట్‌ చేయించనంత పనిచేశారు! ఒక రాజకీయ నేతను, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా చూపాలనే కనీస విషయాలను మరిచిపోయి నేలవిడిచి సాము చేస్తే ఫలితాలు అలా ఉంటాయి.

వస్తోంది జయలలిత పిక్చర్‌!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు ఇప్పుడు రంగం సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్‌, వైఎస్‌ బయోపిక్‌ల తర్వాత సౌత్‌లో ఒక టాల్‌ పర్సనాలిటీ బయోపిక్‌ రాబోతూ ఉంది. వాస్తవానికి జయలలిత బయోపిక్‌ తీయాలని చాలామంది అనుకున్నారు. అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలో మూడు సినిమాలున్నాయి. వాటిల్లో ఒక సినిమా మాత్రం భారీ బడ్జెట్‌తో, స్టార్‌ కాస్టింగ్‌తో రూపొందుతూ ఉంది.

కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌లో, జయలలితగా కనిపిస్తున్న సినిమా సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది. ఆ సినిమాను వందకోట్ల రూపాయల పైస్థాయి బడ్జెట్‌తో రూపొందిస్తూ ఉన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే ఆ సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయినట్టుగా, త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించనున్నట్టుగా వారు చెబుతున్నారు. అంతేకాదు ఆ సినిమా విషయంలో జయలలిత మేనకోడలు, మేనళ్లుడుల నిరభ్యంతర పత్రం కూడా తీసుకున్నారట! మరి నిరభ్యంతర పత్రాలు తీసుకోవడం మొదలుపెడితే జయలలిత బయోపిక్‌ విషయంలో చాలామంది అభ్యంతరాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నాడీఎంకే ఇంకా అధికారంలోనే ఉంది. అసలే తమిళనాట నేతల విషయంలో భావోద్వేగాలు అధికం. కాబట్టి.. వారు 'జయలలిత'ను రిలీజ్‌ కానిస్తారా? అనేది సందేహాస్పదమైన అంశమే.

అన్నాడీఎంకే అధికారంలో లేకపోతే ఆ సినిమాను ఎలాతీసిన పెద్దగా అడిగేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఆ పార్టీ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి.. జయలలిత బయోపిక్‌ను వారు భూతద్దంలో చూసే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నుంచి జయలలిత రూపకర్తలు నిరంభ్యంతర పత్రం తీసుకున్నారో లేదో. తమిళనాట అభ్యంతరాలు చెప్పడానికి చాలామందే ఉంటారు. జయలలిత బయోపిక్‌ కచ్చితంగా బోలెడన్ని కేసులను ఎదుర్కొనాల్సి రావొచ్చు. కోర్టు ఆమోదాల మేరకే ఆ సినిమా బయపడాల్సి రావొచ్చు.

ఆ సంగతలా ఉంటే.. వాస్తవాలను చూపగలరా అనేది మరో ప్రశ్న. జయలలిత రాజకీయంలో ఎన్నో వివాదాస్పద పుటలున్నాయి. వాటిని యథాతథంగా చూపగలరా? జయలలిత హీరోయిన్‌గా సాగించిన ప్రస్థానం, ఆదశలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అవివాహితగా మిగిలిపోవడం, ఆమెపై వచ్చి రూమర్లు, గాసిప్పులు.. ఎంజీఆర్‌తో ఆమె అనుబంధం ఏమిటి? శోభన్‌బాబు కథ ఏమిటి? అనే అంశాల గురించి వివరణలు ఇవ్వగలరా? బోల్డ్‌గా ఏమైనా చూపగలరా? వాస్తవాలు ఇవి అని వాదించగలరా? అనే ప్రశ్నలకు జయలలిత బయోపిక్‌ సమాధానం ఇవ్వాల్సి ఉంది.

సినీ కెరీర్‌ సంగతలా ఉంచితే, పొలిటికల్‌ కెరీర్‌లో జయలలితపై బోలెడన్ని వివాదాలున్నాయి. ఆదాయానికి మించిన కేసుల్లో ఆమె దోషిగా తేలారు ఒకసారి. రాజకీయంగా కూడా నియంతలా చలామణి అయ్యారనే విశ్లేషణలున్నాయి. శశికళతో ఆమె అనుబంధం బోలెడన్ని వివాదాలను రేపింది. ఆఖరికి జయలలిత మరణం కూడా ఒక మిస్టరీగానే నిలిచింది. అలాంటి అంశాలన్నింటినీ జయలలిత బయోపిక్‌లో ప్రేక్షకులను రీచ్‌ అయ్యేలా చూపిస్తారా లేక అంతా పాలిష్‌ పట్టి అదే 'జయలలిత' బయోపిక్‌ అంటారా? అనేది ముందు ముందు తేలాల్సిన అంశం. వాస్తవికంగా రూపొందిస్తే జయలలిత బయోపిక్‌ మరో 'మహానటి' కాగలదు, పాలిష్‌ పడితే మరో 'ఎన్టీఆర్‌' అవుతుంది. ఏ సినిమా తీయాలనుకునే ఛాయిస్‌ 'జయలలిత' రూపకర్తలకే ఉంటుంది!

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు