Advertisement

Advertisement


Home > Politics - Gossip

హిందీ కావాలా? వద్దా?

హిందీ కావాలా? వద్దా?

ఎన్డీయే సర్కారు మళ్లీ అలా అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే హిందీ తప్పనిసరి రూపంలో ఒక టీకప్పులో తుఫాన్‌ రేగింది. ఆ వెంటనే కేంద్రం ఆ విషయంలో వెనక్కు తగ్గడం, ఆ  తుఫాన్‌ ఉధతి తగ్గిపోవడం చకచకా జరిగింది. హిందీ విషయంలో కస్తూరి రంగన్‌ చేసిన ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు భగ్గుమన్నారు. ప్రత్యేకించి తమిళనాడు, కన్నడీగ రాజకీయ నేతలు హిందీ వ్యతిరేకతను  వ్యక్తం చేశారు. హిందీ తప్పనిసరి చేస్తే కుదరదంటూ స్పష్టం చేశారు. వారు స్వభాషాభిమానులు. టక్కున స్పందించారు.

అదే తెలుగు వారికి మాత్రం భాషాభిమానం తక్కువ. అందుకే మనోళ్లు స్పందించలేదు. స్పందించినా ఆల్రెడీ ఏపీలో నిర్భంద హిందీ అమల్లో ఉంది. ఉమ్మడి ఏపీ కాలం నుంచినే మన దగ్గర నిర్బంధ హిందీ అమల్లో ఉంది. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో హిందీ బోధన అమలవుతూ ఉంది. ప్రైవేట్‌ స్కూళ్లలో అయితే ఒకటో తరగతి నుంచినే హిందీలో కూడా అఆలు రుద్ధిస్తూ ఉన్నారు.

మన దగ్గర ఏడో తరగతి, పదో తరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌లో హిందీ పాస్‌ కావడం తప్పనిసరిగా ఉంది దశాబ్ధాల నుంచి. అదే నిర్బంధ హిందీకి నిదర్శనం. ఈ విషయంలో తెలుగు వారికి ఎప్పుడూ పెద్దగా అభ్యంతరం లేదు. అభ్యంతరాలు లేకపోవడం కూడా మంచిదే!

ఎందుకంటే.. తద్వారా తెలుగు వాళ్లకు మరో భాష గురించి కనీస ప్రాథమిక జ్ఞానం ఉంటుంది. కేవలం తెలుగు కాకుండా ఇంగ్లిష్‌, హిందీలు స్కూల్‌ దశ నుంచినే సబ్జెక్టులుగా ఉండటం, ఆంగ్ల మాధ్యం ఉండటం ద్వారా విద్యార్థులకు ఎంతోకొంత మేలే జరుగుతుంది.

ఇప్పటికీ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేవలం తమ ప్రాంతీయ భాషలో మాత్రమే విద్య చెప్పే విధానం ఉంది. పోటీ ప్రపంచంలో ఒక భాషే నేర్చుకుంటాం అంటే కుదిరే పనికాదు. ఒకవైపు తమిళనాట హిందీ వ్యతిరేకత గట్టిగా ఉందని మనం అనుకుంటాం.

ఆ విషయంలో సగటు తమిళులను కదిలిస్తే, తమకూ హిందీ నేర్చుకునే అవకాశం ఉంటే బానే ఉండేదని, ఉద్యోగాల కోసం ఉత్తరాదికి వెళ్లినప్పుడు తెలుగువాళ్లు హిందీలో మాట్లాడుతూ  అల్లుకుపోయినట్టుగా తాము ముందుకు వెళ్లలేమని కొంతమంది తమిళ యువత అంటూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మరో భాషను నేర్చుకోవాల్సిన అవసరం గుర్తుకువస్తుంది.

అలాగని ఏ భాషనూ ఎవరి మీదా రుద్దడం సబబుకాదు. భాషలు నేర్చుకోవడం ఐచ్చికం. అది ఆసక్తి మేరకు చేయాల్సిన పని. బలవంతంగా చేయాల్సింది కాదు. ఈ విషయాన్ని తమిళులు, కన్నడీగులు కూడా గుర్తించాలి. తమిళనాట నిర్బంధ తమిళం అంటున్నారు. అక్కడ తెలుగుమాట్లాడే ప్రజల మీద కూడా బలవంతంగా తమిళులు తమ భాషను రుద్దుతున్నారు. హిందీని వ్యతిరేకిస్తూ నీతులు చెప్పేవాళ్లు ఆ విషయాన్నీ గుర్తించరా?

-ఎల్. విజయలక్ష్మి

పవన్‌ తత్త్వమేమిటో బోధపడలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?